బెంగళూరు: 120కి పైగా టీవీలను దొంగిలించిన హోటల్ కస్టమర్

  • 30 నవంబర్ 2017
వాసుదేవ్ నానయ్య దొంగిలించిన టీవీలతో బెంగళూరు పోలీసులు Image copyright Bangalore police
చిత్రం శీర్షిక వాసుదేవ్ నానయ్య హోటళ్లలో 120కి పైగా టీవీలు దొంగతనం చేశారు

వాసుదేవ్ నానయ్య అనే వ్యక్తి హోటళ్లలో గదులు అద్దెకు తీసుకొని అందులోని టీవీలను దొంగిలిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.

ఇందు కోసం చిన్నచిన్న హోటళ్లనే అతను ఎంచుకునేవాడని వారు తెలిపారు. ఈ విధంగా దక్షిణ భారతదేశ వ్యాప్తంగా నాలుగు నెలల్లో 120కి పైగా టీవీలను తస్కరించినట్లు వెల్లడించారు.

వాసుదేవ్‌ ఎంతో మర్యాదస్తుడిగా కనిపించేవాడని, అందువల్ల హోటళ్లలో పని చేసే సిబ్బంది అతనిని అనుమానించే వారు కాదని పోలీసు ఉన్నతాధికారి బీబీసీ హిందీ ప్రతినిధి ఇమ్రాన్ ఖురేషీకి చెప్పారు.

"ఏదైనా హోటల్‌లో దిగినపుడు వాసుదేవ్ సాధారణంగా పెద్ద పరిమాణంలో ఉండే సూట్ కేస్‌ను తీసుకొచ్చేవాడు. టీవీ సైజ్‌ను చూసుకునేవాడు. ఒకవేళ తెచ్చిన సూట్ కేసు సరిపోకపోతే, బయటకు వెళ్లి మరొకటి తెచ్చుకునేవాడు" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేతన్ సింగ్ రాథోడ్ వివరించారు.

"ఏదో పని ఉన్నట్లు హోటల్ బయటకు లోపలికి చాలా సార్లు తిరిగేవాడు. అందువల్ల అతను ఎప్పుడు సూట్ కేసుతో బయటకు వెళ్లిపోయాడో హోటల్ సిబ్బంది గుర్తించలేక పోయేవారు" అని రాథోడ్ చెప్పారు.

ఇలా దొంగిలించిన టీవీని వాసుదేవ్ అమ్మాలని ప్రయత్నించినప్పుడు సదరు కొనుగోలుదారుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

వాసుదేవ్‌‍‌కు ఇలా అరెస్ట్ కావడం కూడా కొత్తేమీ కాదు.

గత అక్టోబరులో ఒక హోటల్ నుంచి టీవీని దొంగిలించడానికి ప్రయత్నించి పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతను బెయిల్‌పై బయట ఉన్నాడు.

బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే వాసుదేవ్ మళ్లీ దొంగతనాలు మొదలుపెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు.

బెంగళూరు పోలీసులు ఇప్పటి వరకు అతనిపై 21 కేసులు పెట్టారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)