ఉత్తర కొరియాను రెచ్చగొడుతున్న అమెరికా: రష్యా

  • 1 డిసెంబర్ 2017
క్షిపణి పరీక్ష

ఉత్తర కొరియా అణ్వాయుధ ప్రయోగాల్ని మరింత తీవ్రం చేసేలా అమెరికా రెచ్చగొడుతోందని రష్యా విదేశాంగ మంత్రి సిర్గీ లావరోవ్ ఆరోపించారు.

ఇటీవల ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష నిర్వహించిన తర్వాత, అన్ని దేశాలూ ఉత్తర కొరియాతో అన్ని సంబంధాలు తెంచుకోవాలంటూ ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ చేసిన ప్రతిపాదనను కూడా ఆయన తిరస్కరించారు.

"సంబంధాలు తెంచుకోవడంతో ఎటువంటి ప్రయోజనం ఉండదు. పరస్పర చర్చలతోనే దీనికి పరిష్కారం సాధ్యం" అని ఆయన అన్నారు.

యుద్ధం జరిగితే ఉత్తర కొరియా ప్రభుత్వం "పూర్తిగా నాశనమవుతుంది" అని అమెరికా గతంలోనే హెచ్చరించింది.

ఉత్తర కొరియా వాదనల్లో నిజమెంత?

ఇటీవలే తాము బాలిస్టిక్ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని ఉత్తర కొరియా తెలిపింది. ఈ క్షిపణికి అమెరికా వరకూ చేరుకునే శక్తి ఉందని ఉత్తర కొరియా పేర్కొంది.

కానీ మరోవైపు రక్షణ నిపుణులు దీనిపై పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఉత్తర కొరియా వద్ద ఒక ఆయుధాన్ని తిరిగి భూవాతావరణంలోకి ప్రవేశపెట్టే సాంకేతికత ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు.

సిర్గీ లావరోవ్ ఏమన్నారు?

నిజంగా ఉత్తర కొరియాను నాశనం చేసే ప్రయత్నాలు అమెరికా చేస్తోందా అని బెలారస్‌ రాజధానిలో రష్యా విదేశాంగమంత్రి సర్గయి లావరోవ్ ప్రశ్నించారు.

"ఓ ప్రణాళిక ప్రకారమే కిమ్ జోంగ్‌ను ఏకపక్ష చర్యలకు పాల్పడే విధంగా రెచ్చగొడుతున్నారు" అని ఆయనన్నారు.

"అమెరికా ఏం కోరుకుంటోందో చెప్పాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో అమెరికా రాయబారి చెప్పినట్టుగా అమెరికా ఉత్తర కొరియాను నాశనం చేసేందుకు నిజంగానే కారణాలు వెతుకుతుంటే అవేమిటో బాహాటంగా చెప్పాలి. అమెరికా ఉన్నత స్థాయి నాయకత్వం తమ వైఖరిని స్పష్టం చేయాలి".

ఉత్తర కొరియాతో మరోసారి చర్చలు ప్రారంభించడాన్ని సమర్థిస్తూ "సంబంధాలు తెంచుకోవడంతో ఎటువంటి ప్రయోజనం ఉందని గతంలోనే స్పష్టం చేశాం. ఆంక్షలు అమలు చేయాలనే ఈ ప్రతిపాదనల్లో చర్చలు ప్రారంభించాలనే నిబంధన కూడా ఉండాలి. కానీ అమెరికా ఈ అవసరాన్ని గుర్తించడం లేదు. నా దృష్టిలో ఇది పెద్ద తప్పు" అని లావరోవ్ తెలిపారు.

చైనాతోపాటు రష్యా కూడా ఉత్తర కొరియాను సమర్థించే అతి కొద్ది దేశాల జాబితాలో ఉంది.

Image copyright Getty Images

అమెరికా ఏం కోరుకుంటోంది?

ఉత్తర కొరియాతో అన్ని దేశాలు రాజకీయ, వాణిజ్య సంబంధాలు బహిష్కరించాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ కోరారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఉత్తర కొరియాకు చమురు సరఫరా నిలిపివేయాలని చైనాను కోరారు.

ఉత్తర కొరియా అణు కార్యక్రమానికి చమురు ఎంత అవసరమో మాకు తెలుసని నిక్కి హేలీ తెలిపారు. ఈ చమురును చైనా ఉత్తర కొరియాకు సరఫరా చేస్తుంది అని ఆమె అన్నారు.

చైనా ఎప్పటి నుంచో ఉత్తర కొరియాకు మద్దతు తెలుపుతోంది. ఉత్తర కొరియాకు చైనా అతిపెద్ద వ్యాపార భాగస్వామి కూడా. తన చమురు అవసరాలకు ఉత్తర కొరియా చైనా సహాయమే తీసుకుంటుంది.

ఉత్తర కొరియాతో సంబంధాలు తెంచుకోవాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చైనా విదేశాంగ మంత్రి "మా దేశం ఎప్పుడూ సంపూర్ణ, తీవ్రమైన, కఠినమైన తీర్మానాలను మాత్రమే అమలు చేస్తుంది" అని స్పందించారు.

ఈ క్షిపణి ఎందుకంత ప్రత్యేకం?

ఉత్తర కొరియా బుధవారం నాడు ప్రయోగించిన హాసంగ్-15 క్షిపణి గతంలో ప్రయోగించిన అన్ని క్షిపణుల కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంది.

ఈ క్షిపణి 4,475 కిలోమీటర్ల ఎత్తుకు చేరిందని ఉత్తర కొరియా ప్రభుత్వం చెబుతోంది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఎత్తు కంటే పది రెట్లు ఎక్కువ.

"వారు తమ సైన్య పరిధిని ఎంతవరకూ పెంచారంటే ఇప్పుడు దక్షిణ కొరియాకు అమెరికాపై దాడి చేసే సామర్థ్యం లేదని చెప్పడం కష్టంగా మారింది." అని ఎంఐటీలో రాజనీతి శాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ విపిన్ నారంగ్ బీబీసీతో అన్నారు.

"ఉత్తర కొరియా క్షిపణిలో తేలికపాటి, నకిలీ ఆయుధం ఉండి ఉంటుంది. అందుకే ఆ క్షిపణి అసలు అణు బాంబును దూరం తీసుకెళ్లలేదు." అని ఆమెరియాకు చెందిన ఓ స్వచ్చంద సంస్థ 'యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్'కు చెందిన డేవిడ్ రైట్ తన బ్లాగులో పేర్కొన్నారు.

ఈ ఏడాది సెప్టెంబరులో దూరంగా వెళ్లే క్షిపణిపై లోడ్ చేసే అణ్వాయుధాల ప్రయోగం నిర్వహించిందని ఉత్తర కొరియా వెల్లడించింది. 2006 తర్వాత ఉత్తర కొరియా నిర్వహించిన అణ్వాయుధాల ప్రయోగాల్లో ఇది ఆరవ ప్రయోగం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)