ఎన్‌సీఆర్‌బీ నివేదిక: హైదరాబాద్‌లో గృహహింస.. ఏపీలో వేధింపులు ఎక్కువ!

  • సతీష్ ఊరుగొండ
  • బీబీసీ ప్రతినిధి
మహిళ

ఫొటో సోర్స్, Getty Images

దేశ రాజధాని దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నట్లు 'నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో' నివేదిక వెల్లడించింది. 2016లో నమోదైన కేసుల వివరాలు ఈ నివేదిక బయటపెట్టింది.

గృహ హింస నుంచి లైంగిక వేధింపుల వరకు.. కిడ్నాపుల నుంచి దోపిడీల వరకు అన్ని వివరాలను గణాంకాలతో సహా బట్టబయలు చేసింది.

నేరాలకు అడ్డా ఉత్తరప్రదేశ్‌

యూపీ, మధ్యప్రదేశ్‌లతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ పెరిగిన నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2016లో దేశవ్యాప్తంగా మొత్తం 48,31,515 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 2.6శాతం అధికం. నేరాల్లో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. మొత్తం నేరాల్లో 9.5శాతం ఆ రాష్ట్రంలోనే జరిగాయి. ఆ తర్వాత 8.9శాతంతో మధ్యప్రదేశ్ రెండోస్థానంలో, 8.8శాతంతో మహారాష్ట్ర మూడోస్థానంలో ఉన్నాయి.

క్రైమ్ రేట్ దేశ రాజధానిలో అత్యధికంగా ఉంది. దిల్లీలో క్రైమ్ రేట్ 974.9గా(ప్రతి లక్ష జనాభాకు) ఉంది. తర్వాత స్థానం కేరళది. తెలంగాణ 6, ఏపీ 15వ స్థానంలో ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images

ఏపీలో వేధింపులు ఎక్కువే!

2016లో తెలుగు రాష్ట్రాల్లో కూడా నేరాల సంఖ్య పెరిగింది. మహిళల వేధింపుల కేసులు ఏపీలో పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 2014-2016 మధ్య ఏపీలో మహిళలపై వేధింపులకు సంబంధించి మొత్తం 16,362 కేసులు నమోదయ్యాయి. ఇందులో లైంగిక వేధింపుల కేసులు 1,312.

9,425 లైంగిక కేసులతో ఉత్తరప్రదేశ్ టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత 4,071 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో.. 3,129 కేసులతో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో 860 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయి.

ఫొటో సోర్స్, Getty Images

మాటు వేసి కాటు వేస్తున్నారు!

2015తో పోలిస్తే ఏపీలో అత్యాచారాలు కాస్త తగ్గినా, మైనర్లను టార్గెట్ చేయడం కలవరపెడుతోంది.

  • 2016లో ఏపీలో మొత్తం 994 అత్యాచార కేసులు నమోదయ్యాయి.
  • వీటిలో 463 మంది అత్యాచార బాధితులు మైనర్లే.
  • 79 కేసుల్లో నిందితులు సొంత కుటుంబసభ్యులే.
  • మరో 361కేసుల్లో ఇరుగుపొరుగు వారే అత్యాచారాలకు పాల్పడ్డినట్లు నివేదిక చెబుతోంది.

సైబర్ నేరాల్లో ఆరో స్థానం

హత్యలు, కిడ్నాప్‌లు, సైబర్ నేరాలు కూడా ఏపీలో పెరిగాయని నివేదిక వెల్లడించింది. సైబర్ నేరాల్లో ఏపీ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది.

గృహహింసలో హైదరాబాద్‌కు రెండోస్థానం

ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. మహిళలను కించపరిచే ఉద్దేశంతో దాడులు చేయడం, లైంగిక వేధింపులు కూడా ఎక్కువయ్యాయని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది.

మెట్రో నగరాల్లో గృహ హింస కేసుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. భర్త, కుటుంబ సభ్యుల వేధింపులకు సంబంధించి 2016లో హైదరాబాద్‌లో 1,311 కేసులు నమోదయ్యాయి. 3645 కేసులతో దిల్లీ మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ మినహా తెలంగాణలో మాత్రం వరకట్నవేధింపుల కేసులు తగ్గాయి.

దేశవ్యాప్తంగా చూస్తే గృహ హింస కేసులు పశ్చిమబెంగాల్‌లో ఎక్కువగా నమోదు అయ్యాయి. తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి.

మహిళలను అవమానించిన కేసులు ఏపీలో 1,831 నమోదయ్యాయి. దేశంలో ఇదే అత్యధికం. తెలంగాణలో ఈ సంఖ్య 1,003గా ఉంది.

ఏపీలో 917 కిడ్నాప్‌లు జరగ్గా, తెలంగాణలో 1,302 జరిగాయి. 2016లో కిడ్నాప్‌లు మహారాష్ట్రలో ఎక్కువగా జరిగాయి. యూపీ, బిహార్ తర్వాత స్థానంలో ఉన్నాయి.

మిగతా రాష్ట్రాల విషయానికొస్తే మహిళలపై దాడులు, దౌర్జన్యాలు మహారాష్ట్రలో అత్యధికంగా నమోదు అయ్యాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

మహిళలపై అత్యాచారాలు మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా జరిగాయి. యూపీ, మహారాష్ట్ర తర్వాత క్రమంలో ఉన్నాయి.

చిన్నారుల కిడ్నాప్‌లు, అపహరణ కేసులు కూడా దేశవ్యాప్తంగా పెరిగాయి. 2016లో పిల్లల కిడ్నాప్‌లో యూపీ దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది.

పిల్లలపై లైంగిక నేరాలు యూపీలో ఎక్కువగా జరిగాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోనూ అధికంగానే ఉన్నాయి.

2016లో యూపీలో దళితులపై ఎక్కువగా దాడులు జరిగాయి. తర్వాత బిహార్, రాజస్తాన్ ఉన్నాయి.

2016లో ఎస్టీలపై దాడులు ఎక్కువగా జరిగిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. రాజస్తాన్, ఒడిశా దాన్ని ఫాలో అయ్యాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన నేరాలు

కొన్ని నేరాల్లో ఏపీ, తెలంగాణ పోటీ పడినట్లు కనిపిస్తోంది. 2016లో దేశంలో మహారాష్ట్రలో మోసాలు అత్యధికంగా జరిగాయి. ఈ విషయంలో తెలంగాణ రెండో స్థానంలో, ఏపీ మూడో స్థానంలో ఉన్నాయి.

గోవా మహిళలకు సురక్షిత ప్రాంతం!

ఎన్‌సీఆర్‌బీ నివేదిక పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. గోవాలో మహిళలపై నేరాలు తగ్గాయి. దేశంలోనే సురక్షిత ప్రాంతంగా గోవా నిలిచింది. 2016లో నేరాల విషయంలో గోవా దేశంలో 28వ స్థానంలో నిలిచింది. గోవాలో 2014లో 4,466గా ఉన్న నేరాల సంఖ్య 2016లో 2,692కి తగ్గింది.

వయోవృద్ధులపై నేరాలు ముంబయిలో ఎక్కువగా నమోదయ్యాయి. తర్వాతి స్థానం దిల్లీది.

సైబర్ నేరాలు ముంబయిలో ఎక్కువగా నమోదయ్యాయి. బెంగళూరు, జైపూర్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

మా ఇతర కథనాలు: