నాన్నా! నువ్వు లేవు.. నీ ఉత్తరం అందింది!

  • 3 డిసెంబర్ 2017
తండ్రితో బైలీ Image copyright @sellersbailey/Twitter

బైలీ సెల్లర్స్ 21వ పుట్టిన రోజు విషాదంతో నిండిపోయింది. ఐదేళ్ల క్రితం చనిపోయిన తండ్రి నుంచి ఆమె చివరి ఉత్తరం ఆరోజే అందుకుంది.

బైలీ అమెరికాలోని నాక్స్‌విల్‌లో ఉంటోంది. ఆమెకు పదహారేళ్లప్పుడు తండ్రి కేన్సర్‌తో చనిపోయారు. కానీ ఆయన చనిపోయే ముందు తన కూతురి ప్రతి పుట్టిన రోజుకీ ఒక ఫ్లవర్ బొకే అందేలా ఏర్పాటు చేశారు. అందుకోసం ముందుగానే డబ్బులు కట్టేశారు. బొకేతో పాటుగా ప్రతి పుట్టిన రోజుకీ ఓ ఉత్తరం కూడా బైలీకి అందేది.

గత ఐదేళ్లుగా బైలీ తన తండ్రి పంపించిన బొకే, ఉత్తరాలను అందుకుంటూ ఉంది.

Image copyright @sellersbailey/Twitter

కానీ ఈసారి వచ్చిన ఉత్తరం చివరిదని, కన్న కూతురుకు ఆ తండ్రి వీడ్కోలు చెప్పారు.

'జీవితం ప్రతీ మలుపులోనూ నేను నీకు తోడుగా ఉంటాను.. ఓసారి చుట్టూ చూడు.. అక్కడే ఉంటాను' అని లేఖలో కూతురికి ధైర్యం చెప్పారు.

ఈ విషయాన్ని బైలీ ట్విటర్‌లో పోస్ట్ చేసింది

'నాన్నా! ఐ మిస్ యూ..' అంటూ తన తండ్రి భుజాలపై కూర్చున్న ఫోటో, ఫ్లవర్ బొకే, ఆ చివరి ఉత్తరాన్ని కూడా ట్వీట్ చేసింది.

Image copyright Twitter

చివరి లేఖలో ఇలా ఉంది

'బైలీ!..

మళ్లీ మనం కలుసుకునేంత వరకూ ఇదే నా చివరి ఉత్తరం. నా చివరి ప్రేమలేఖ. నాకోసం కన్నీరు పెట్టకు. నా జీవితంలో దొరికిన వజ్రం నువ్వు. ఇది నీ ఇరవయ్యొకటో పుట్టినరోజు.

అమ్మ మాటను గౌరవించు. నిన్ను నువ్వు ఎప్పుడూ మోసం చేసుకోకు. జీవితాన్ని ఆనందంగా జీవించు. అడుగడుగునా నేను నీ వెంటే ఉంటాను. ఓసారి చుట్టూ చూడు. నువ్వు ఎక్కడ చూస్తే నేను అక్కడ ఉంటాను.

ఐ లవ్ యూ!!!

నాన్న'

Image copyright @sellersbailey/Twitter

బైలీ ట్విటర్ పోస్టుకు చాలా మంది స్పందించారు.

''ఈ పోస్ట్ నన్ను ఏడిపించింది. ఇది హృదయాన్ని కదిలించే ఘటన!'' అంటూ @thesn0wmexican ట్వీట్ చేశారు.

''అవును.. ప్రతి సంవత్సరమూ నా పుట్టినరోజు కోసం ఎదురు చూస్తాను. ఆయన నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇదే చివరి ఉత్తరం అన్న విషయం నా మనసును గాయపరిచింది.'' అంటూ బైలీ రీట్వీట్ చేసింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)