అమెరికా: ఉత్తర కొరియా సమస్యకు యుద్ధమే పరిష్కారం కాదు..ఇంకా చాలా మార్గాలున్నాయి

  • 4 డిసెంబర్ 2017
అమెరికా రక్షణ సలహాదారు మెక్ మాస్టర్ Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా సమస్యకు సత్వర పరిష్కారం అవసరం అని అమెరికా రక్షణ సలహాదారు మెక్ మాస్టర్ అంటున్నారు

ఉత్తర కొరియా బెదిరింపులకు దీటుగానే స్పందిస్తామని అమెరికా రక్షణ సలహాదారు హెచ్ఆర్ మెక్ మాస్టర్ తెలిపారు.

ఒక రక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ‘రోజురోజూకీ ఉద్రిక్తత పెరుగుతోంది. అయితే కేవలం యుద్ధమే దీనికి పరిష్కార మార్గం కాదు’ అని ఆయన పేర్కొన్నారు.

ఐక్యరాజ్య సమితి ఆంక్షలను ధిక్కరిస్తూ ఉత్తర కొరియా రెండు నెలల్లో తొలిసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించింది. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉత్తర కొరియా గతంలో ప్రయోగించిన అన్ని క్షిపణుల కంటే తాజాగా ప్రయోగించిన క్షిపణి అత్యంత ఎత్తులో ప్రయాణించి జపాన్ సముద్రతీరంలో మునిగింది.

అంతర్జాతీయంగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా, ఆంక్షలు విధిస్తున్నా.. ఉత్తర కొరియా అణు పరీక్షలు, క్షిపణి ప్రయోగాలు చేస్తూనే ఉండటంతో ఉద్రిక్తతలు బాగా పెరిగాయి.

ఉత్తర కొరియా తొలి అణు ప్రయోగాన్ని సెప్టెంబర్‌లో నిర్వహించింది.

తాజాగా ప్రయోగించిన క్షిపణి అమెరికా ఖండంలో ఏ ప్రాంతాన్నైనా తాకగలదని ఉత్తర కొరియా అంటోంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక ఉత్తర కొరియా సైన్యంతో ఆ దేశ అధ్యక్షుడు కిమ్

ఈ పరిణామాల నేపథ్యంలో కాలిఫోర్నియాలో నిర్వహించిన రక్షణ సదస్సులో అమెరికా రక్షణ సలహాదారు మాట్లాడుతూ.. యుద్ధంతో కాకుండా అనేక మార్గాల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అని పేర్కొన్నారు.

'ఉత్తర కొరియాకు చమురు సరఫరాను చైనా పూర్తిగా నిలిపివేయాలి. అప్పుడు ఆ దేశం చమురు లేకుండా క్షిపణులు ప్రయోగించడం కష్టమవుతుంది.

ఈ విషయంపై స్పందించాలని మేం చైనాను కోరతాం. ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై చైనా సత్వరమే స్పందిస్తుందని భావిస్తున్నాం’ అని మెక్ మాస్టర్ తెలిపారు.

మరోవైపు, దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా భారీ స్థాయిలో సైనిక విన్యాసాలు చేస్తూ తమను రెచ్చగొడుతున్నాయని ఉత్తర కొరియా విమర్శించింది.

'ఉత్తర కొరియాను రెచ్చగొట్టేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది అందరికీ తెలిసిందే. ఇలాంటి చర్యలు ఏ క్షణమైనా అణు యుద్ధానికి దారి తీయవచ్చు' అని ఉత్తర కొరియా అధికార పార్టీ దినపత్రిక రొడొంగ్ పేర్కొంది.

హౌవసాంగ్ -15 క్షిపణిని గురువారం ప్రయోగించినట్లు ఉత్తర కొరియా తెలిపింది.

ఈ క్షిపణి 4,475 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, కేవలం 53 నిమిషాల్లో 950 కిలోమీటర్లు ఎగిరిందని పేర్కొంది.

అమెరికాలోని కీలక ప్రాంతాలను ధ్వంసం చేసే భారీ ఆయుధాలను కూడా మోసుకెళ్లగలదని తెలిపింది.

ఉత్తర కొరియా తాజా క్షిపణి 13 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదని, నిర్దేశిత మార్గంలో అమెరికాను చేరుతుందని రక్షణ నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు.

Image copyright KCNA
చిత్రం శీర్షిక నవంబర్ 30న దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ మిసైల్ హౌవసాంగ్15 ను ఉత్తరకొరియా ప్రయోగించింది

అయితే, అంతదూరం భారీ ఆయుధాలను విజయవంతంగా మోసుకెళ్లగలదా లేదా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

గగనతలం నుంచి మళ్లీ భూ వాతావరణంలోకి వచ్చేటప్పుడు క్షిపణిలోని ఆయుధాలు ధ్వంసం కాకుండా ప్రయోగించే సాంకేతికత ఉత్తర కొరియాకు లేదని అంటున్నారు.

ఉత్తర కొరియా క్షిపణి దాడుల నుంచి తట్టుకునేందుకు పశ్చిమ తీరంలో టెర్మినల్ హై అల్టిట్యూట్ ఏరియా డిఫెన్స్ ( థాడ్) యాంటీ బాలిస్టిక్ మిసైల్స్ ను ఏర్పాటు చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.

అదనపు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ (ఎండీఏ) సిద్ధమవుతోందని ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు చేసిన వ్యాఖ్యలను రాయిటర్స్ ఉటంకించింది.

అయితే, థాడ్ వ్యవస్థ ఏర్పాటుపై తమకు ఆదేశాలు అందలేదని అమెరికా రక్షణ సంస్థలో భాగమైన ఎండీఏ తెలిపింది.

దక్షిణ కొరియా, గ్వామ్ (పసిఫిక్ తీరంలోని అమెరికా భూభాగం)లో ఇప్పటికే థాడ్ వ్యవస్థ నెలకొల్పారు. ఈ ప్రాంతాలు ఉత్తర కొరియా నుంచి 3,400 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

అమెరికా వ్యూహాత్మక యుద్ధ విమానాలు, ఆ దేశానికి చెందిన లక్షన్నర మంది ప్రజలున్న గ్వామ్ పై మధ్య, దీర్ఘ శ్రేణి రాకెట్లను ప్రయోగించే ప్రణాళికను గత ఆగస్టులోనే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ప్రకటించారు.

స్వల్ప, మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను భూ ఉపరితంలోనే ధ్వంసం చేసే సత్తా థాడ్ వ్యవస్థకు ఉంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

ఈ కథనం గురించి మరింత సమాచారం