ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తే ప్రమాదకర పర్యవసానాలు: అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక

  • 4 డిసెంబర్ 2017
జెరూసలేం నగరంలోని డోమ్ ఆఫ్ రాక్ మసీదు ముందు ఎగురుతున్న ఇజ్రాయెల్ పతాకం Image copyright AFP
చిత్రం శీర్షిక జెరూసలేం తమ రాజధానిగా ఇజ్రాయెల్ పరిగణిస్తోంది. కానీ తూర్పు జెరూసలేం తమ భవిష్యత్ దేశానికి రాజధాని కావాలని పాలస్తీనా ప్రజలు కోరుకుంటున్నారు

ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తించినట్లయితే ‘‘ప్రమాదకర పర్యవసానాలు’’ ఉంటాయని అమెరికాను జోర్డాన్ విదేశాంగమంత్రి ఐమన్ సఫాది హెచ్చరించారు.

అటువంటి ప్రకటన చేసినట్లయితే అరబ్, ముస్లిం ప్రపంచంలో తీవ్ర ఆగ్రహం రగులుతుందని అమెరికా విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్సన్‌కు తాను చెప్తానని సఫాది పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ త్వరలో ప్రకటిస్తారన్న ఊహాగానాలు పెరుగుతున్నాయి.

అయితే ఈ విషయమై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ చెప్పారు.

‘‘ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తించినట్లయితే జరిగే ప్రమాదకర పర్యవసానాల గురించి అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్‌తో మాట్లాడాను. అటువంటి నిర్ణయం అరబ్, ముస్లిం ప్రపంచాల్లో ఆగ్రహం రగిలిస్తుంది. ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తుంది. శాంతి ప్రయత్నాలకు గండి కొడుతుంది’’ అని సఫాది ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఈ విషయంపై అమెరికా విదేశాంగ శాఖ నుంచి బహిరంగంగా ఎటువంటి స్పందనా లేదు.

Image copyright AFP
చిత్రం శీర్షిక టెల్ అవీవ్‌లోని అమెరికా రాయబార కర్యాలయాన్ని జెరూసలేంకు మారుస్తానని డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు

అటువంటి ప్రకటన చేయకుండా ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చేందుకు అంతర్జాతీయ మద్దతును కూడగట్టటం కోసం పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ప్రయత్నిస్తున్నారు.

ఆయన ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్, టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యప్ ఎర్డోగన్‌లు సహా ప్రపంచ నాయకులకు ఫోన్ చేశారని అబ్బాస్ కార్యాలయం తెలిపింది.

‘‘అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించడానికి కానీ, జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడానికి కానీ తీసుకునే నిర్ణయం వల్ల ప్రమాదాల గురించి వివరించటా’‘నికి ఆయన ఈ ఫోన్లు చేసినట్లు అబ్బాస్ సలహాదారు మజ్దీ అల్-ఖాలీదీ ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు చెప్పారు.

అటువంటి చర్య రెండు దేశాల పరిష్కారానికి ముప్పుగా మారుతుందని పాలస్తీనా నాయకులు గతంలో హెచ్చరించారు.

1967 మధ్య ఆసియా యుద్ధం నాటి నుంచీ తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ ఆక్రమించుకుని ఉంది. ఆ ప్రాంతాన్ని 1980లో కలిపేసుకుని.. అది తన సొంత భూభాగంగా పరిగణిస్తోంది.

జెరూసలేంను తన శాశ్వత, అవిభాజ్య రాజధానిని చేసుకోవాలని ఇజ్రాయెల్ కృతనిశ్చయంతో ఉంది. అయితే తూర్పు జెరూసలేం తమ భవిష్యత్తు దేశానికి రాజధాని కావాలని పాలస్తీనా వాసులు కోరుకుంటున్నారు.

1948 నుంచీ అమెరికా ప్రభుత్వాలన్నీ.. జెరూసలేం విషయాన్ని చర్చల ద్వారా నిర్ణయించుకోవాలని, తాము పక్షపాతంతో వ్యవహరించినట్లు భావించేందుకు ఆస్కారమున్న చర్యలకు తాము పాల్పడబోమని పేర్కొన్నాయి.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక జారెడ్ కుష్నర్ వాషింగ్టన్ డీసీలో సాబాన్ ఫోరమ్‌లో ప్రసంగించారు

అయితే.. డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది ఎన్నికల ప్రచారంలో ఇజ్రాయెల్‌కు బలంగా మద్దతు తెలిపారు. తాను అధికారం చేపట్టిన మొదటి రోజునే అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు మార్చేలా ఆదేశిస్తానని హామీ ఇచ్చారు.

అయితే అటువంటి నిర్ణయమేదీ తీసుకోకుండా ఆయన జాప్యం చేస్తూ వచ్చారు. బుధవారం ట్రంప్ చేయబోయే ప్రసంగంలో దీనిపై ఒక ప్రకటన చేయవచ్చునన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ట్రంప్ కీలక సలహాదారుల్లో ఒకరైన కుష్నర్ ఆదివారం వాషింగ్టన్‌లో ఒక మేధో బృందాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. అధ్యక్షుడు తన ఉద్దేశాన్ని ఆయన అభీష్టం ప్రకారమే సరైన సమయంలో ప్రకటిస్తారని పేర్కొన్నారు.

‘‘అధ్యక్షుడు తన నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఆయన ఇంకా చాలా విభిన్న వాస్తవాలను పరిశీలిస్తున్నారు. ఆయన నిర్ణయం తీసుకున్నపుడు ఆయనే మీకు చెప్తారు. నేను కాదు’’ అని కుష్నర్ వివరించారు.

ఇవికూడా చూడండి

మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionఓ లేఖ మొత్తం మధ్య ప్రాచ్య చరిత్రను మార్చగలదా?

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు