ఫేస్‌బుక్: చిన్న పిల్లల కోసం ప్రత్యేక యాప్ ‘మెసెంజర్ కిడ్స్‌’

  • 6 డిసెంబర్ 2017
పిల్లలు తమ స్నేహితులు, అంగీకరించిన పెద్దవాళ్లతో వీడియో చాట్ చేయవచ్చు Image copyright Facebook
చిత్రం శీర్షిక పిల్లలు తమ స్నేహితులు, అంగీకరించిన పెద్దవాళ్లతో వీడియో చాట్ చేయవచ్చు

సోషల్ మీడియాలో చేరాలంటే ఎంత తక్కువ వయసు మరీ తక్కువవుతుంది?

ఖచ్చితంగా చెప్పాలంటే, ఫేస్‌బుక్ ఉపయోగించడానికి 13 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసున్న వారికే అనుమతి ఉంది. కానీ తక్కువ వయసున్న వారిని అడ్డుకునే పద్ధతులు బలంగా లేవు. ఫలితంగా 13 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు రెండు కోట్ల మందికి పైగా ఫేస్‌బుక్ ఉపయోగిస్తున్నారు.

దీంతో ఫేస్‌బుక్ చిన్నపిల్లల కోసం రూపొందించిన తన తొలి యాప్‌ను సోమవారం ప్రారంభించింది. దీనిని ఉపయోగించడానికి ముందుగా తల్లిదండ్రుల అనుమతి అవసరం. ఇది వాణిజ్య ప్రకటనల కోసం సమాచారాన్ని అందించబోదని ఆ సంస్థ హామీ ఇచ్చింది.

ఫేస్‌బుక్ ప్రస్తుతం 13 ఏళ్ల పైబడిన వారి కోసం అందిస్తున్న మెసేజ్ యాప్‌‌కు సరళమైన, భద్రత పెంచిన వర్షన్‌నే ‘మెసెంజర్ కిడ్స్’గా ప్రవేశపెట్టింది.

‘‘తల్లిదండ్రులు తమ పిల్లలు ట్యాబ్లెట్లు, స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించటానికి అనుమతించడం పెరుగుతోంది. కానీ తమ పిల్లలు వాటిని ఎలా ఉపయోగించాలి, ఎటువంటి యాప్‌లు సరైనవి అనే అంశాలపై వారికి సందేహాలు, ఆందోళనలు ఉన్నాయి’’ అని మెసెంజర్ కిడ్స్ ప్రొడక్ట్ మేనేజర్ లోరెన్ చెంగ్ పేర్కొన్నారు.

‘‘తల్లిదండ్రులతో సంభాషించేటపుడు, పరిశోధన చేసేటపుడు వారే స్వయంగా మంచి యాప్‌ల అవసరం గురించి చెప్పినపుడు.. అలాంటి దానిని అభివృద్ధి చేయాల్సిన అవసరముందని మాకు తెలిసింది’’ అని చెంగ్ చెప్పారు.

Image copyright Facebook
చిత్రం శీర్షిక చిన్నపిల్లల ఫ్రెండ్స్ సంభాషణలు సురక్షితంగా ఉండటానికి, ఆమోదం పొందడానికి తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా డిజైన్ చేశారు

స్నేహితులకు తల్లిదండ్రుల ఆమోదం

‘మెసెంజర్ కిడ్స్‌‘లో ఇద్దరు పిల్లలు ఫ్రెండ్స్ కావాలనుకుంటే.. దానికి తల్లిదండ్రులు ఆమోదించాల్సి ఉంటుంది. ఆ స్నేహం సురక్షితమైన తల్లిదండ్రులు నిర్ధారించిన తర్వాత స్నేహితులు లైవ్ చాట్ చేయొచ్చు. పరస్పరం సందేశాలు, ఫొటోలు పంపుకోవచ్చు.

‘‘పిల్లలకు తగిన లైబ్రరీ కూడా ఉంటుంది. ప్రత్యేకంగా ఎంపిక చేసిన జీఫ్‌లు, ఫ్రేమ్‌లు, స్టిక్కర్లు, మాస్కులు, డ్రాయింగ్ టూల్స్ ఉంటాయి. వాటి ద్వారా తమ కంటెంట్‌ను అలంకరించడంతో పాటు తమ వ్యక్తిత్వాన్ని అభివ్యక్తీకరించవచ్చు’’ అని వివరించారు.

తల్లిదండ్రులు ఆమోదించిన పెద్దలు కూడా ఈ యాప్ ద్వారా ఆ పిల్లలను సంప్రదించవచ్చు. అయితే పెద్దలకు పిల్లల నుంచి వచ్చే సందేశాలు మామూలు ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ ద్వారానే వస్తాయి.

అయితే ‘మెసెంజర్ కిడ్స్‘ పిల్లల పేర్లు, మేసేజీల కంటెంట్, ఉపయోగించటం మీద నివేదికల సమాచారాన్ని సేకరిస్తుంది. యాప్‌ను ఎలా ఉపయోగిస్తున్నారనేది తెలుసుకునేందుకు ఈ డాటా సేకరిస్తుంది.

అమెరికాలో చిల్డ్రన్స్ ఆన్‌లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ (కొప్పా)కు అనుగుణంగా సమాచార పరిరక్షణ విధానాలు గల మూడో పార్టీలతో ఈ సమాచారాన్ని ఫేస్‌బుక్ అందిస్తుంది.

Image copyright Facebook
చిత్రం శీర్షిక వీడియో చాట్‌ను పిల్లలు ఇంకా ఎక్కువగా ఆనందించేలా చేయడానికి ఫేస్‌బుక్ పలు ఎఫెక్టులు కూడా జోడించింది

తర్వాతి తరం వినియోగదారుల కోసమా..?

‘‘పెద్దవాళ్ల’’ ఫేస్‌బుక్‌ను బలోపేతం చేసుకోవడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించుకోబోమని ఫేస్‌బుక్ హామీ ఇచ్చింది.

పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఆధారంగా వారి తల్లిదండ్రులు లక్ష్యంగా యాడ్లు పంపించడం ఈ కొత్త యాప్ వల్ల కలిగే వాణిజ్య ప్రయోజనం కావచ్చునని భావిస్తున్నారు. మెసెంజర్ కిడ్స్‌లో చర్చించిన అంశాలను.. ఆ పిల్లలు 13 ఏళ్ల వయసు దాటి టీనేజీలోకి ప్రవేశించినపుడు వారిని లక్ష్యంగా యాడ్లు గుప్పించేందుకు ఉపయోగించుకోవచ్చుననీ చెప్తున్నారు.

ఇలాంటిదేదీ జరగవని ఫేస్‌బుక్ పేర్కొంది. ఇందులో చేరుతున్న పిల్లల వయసు ఎంతో ఈ యాప్‌కు నిర్దిష్టంగా తెలియదని, కాబట్టి పిల్లలు పెద్దయ్యాక ఫేస్‌బుక్‌లోకి మారాలని ఏమీ చెప్పబోదని అంటోంది.

ఒకవేళ పూర్తిస్థాయి ఫేస్‌బుక్‌లో చేరాలని పిల్లలు నిర్ణయించుకున్నట్లయితే అక్కడ సరికొత్త అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. మెసెంజర్ కిడ్స్ నుంచి ఏ సమాచారం అందులోకి బదిలీకాదు.

తర్వాతి తరం యూజర్లకు సోషల్ నెట్‌వర్క్ చాయిస్‌గా ఫేస్‌బుక్ ముందుండాలని ఆ సంస్థ కోరుకుంటోంది. కాబట్టి చిన్నపిల్లలు పెరిగిన తర్వాత ఫేస్‌బుక్‌లోకి మారటం ఫేస్‌బుక్‌కి వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన విషయం.

ఆరేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలను స్నాప్‌చాట్ (లేదా మరేదైనా పోటీ నెట్‌వర్క్) కన్నా ముందుగా ఆకట్టుకోగలిగితే.. ఆ పిల్లలు టీనేజర్లుగా, యువతగా ఎదిగినపుడు సహజంగానే ఫేస్‌బుక్‌ను ఉపయోగించే అవకాశాలు ఉంటాయి.

పిల్లలు ‘ఫోమో’ బారిన పడరా?

వ్యాపార విషయాలు పక్కనపెడితే.. ఇంత చిన్నపిల్లలు అసలు సోషల్ మీడియా ఉపయోగించాలా? అనే ప్రశ్న ఉంది. ఫేస్‌బుక్ తొలి పెట్టుబడిదారుల్లో ఒకరు, ఆ సంస్థ మొదటి ప్రెసిడెంట్ అయిన షాన్ పార్కర్.. తన సాయంతో స్థాపితమైన ఈ నెట్‌వర్క్ ప్రతికూల ప్రభావం గురించి తన అభిప్రాయం వెలిబుచ్చారు.

సోషల్ మీడియాలో మనకు ఎవరైనా ఒక ‘‘లైక్’’ నొక్కినపుడు మనకు వచ్చే చిన్న ‘‘డోపమైన్ హిట్’’ (మెదడులో సంతోషాన్నిచ్చే నాడీకణాల ప్రసారం) గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది మన పిల్లల మెదళ్లను ఏం చేస్తోందో దేవుడికే తెలియాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘మెసెంజర్ కిడ్స్’లో ఈ ‘‘లైక్’’ వ్యవస్థ ఒక కీలక భాగం. ఆన్‌లైన్‌లో తమ తోటి పిల్లల అంగీకారం అనే విధానాన్ని ఆరేళ్ల వయసు చిన్న పిల్లలకు పరిచయం చేయాలని ఒక సమాజంగా మనం కోరుకోగలమా? అనే సందేహం మనకు రావచ్చు. ఆరేళ్ల పిల్లలు ఆటలాడుకోవాలి కానీ ‘ఫోమో‘ (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్ - సోషల్ మీడియాలో జరుగుతున్న సంఘటనల్లో వెనుకబడిపోతున్నామనే భయం) బారిన పడకూడదు.

ఈ యాప్ ప్రారంభంతో తలెత్తుతున్న వివిధ ప్రైవసీ అంశాల విషయంలో విస్తృత పారదర్శకత కావాలని కొందరు కోరుతున్నారు. ఫేస్‌బుక్ బ్లాగ్‌స్పాట్‌లో సోమవారం రాసిన వ్యాసం వివిధ ఆందోళనలను తొలగించడానికి జాగ్రత్తగా రూపొందించారు. పిల్లల సంరక్షణకు సంబంధించిన నిపుణులు, సంస్థల పేర్లను అందులో ప్రస్తావించడం మార్కెటింగ్ వ్యూహంలో కీలక భాగం.

Image copyright Reuters

‘పైకి మంచి ఆలోచనగా కనిపిస్తుంది...‘

ఫేస్‌బుక్ చేస్తున్న దానికి మద్దతు కూడా ఉంది. పిల్లలు సోషల్ నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నారు కాబట్టి.. అది భద్రంగా, పర్యవేక్షణలో ఉండేలా చేయగలిగింది చేయవచ్చు అన్నది ఇప్పుడు కనిపిస్తున్న అభిప్రాయం.

‘పిల్లలు, కుటుంబాల జీవితాలను మెరుగుపరచడానికి అంకితమైన’ కామన్ సెన్స్ మీడియా అనే అమెరికా స్వచ్ఛంద సంస్థ ఒకటి.. చిన్న పిల్లల్లో సోషల్ మీడియా ఎంతగా విస్తరించిందనే అంశాన్ని లోతుగా పరిశీలించింది.

‘‘13 ఏళ్ల లోపు పిల్లలను వారి తల్లిదండ్రులు మాత్రమే చేర్చగల ఒక మెసెంజర్ యాప్ పైకి మంచి ఆలోచనగానే కనిపిస్తోంది’’ అని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ స్టేయర్ పేర్కొన్నారు.

‘‘కానీ డాటా సేకరణ గురించి, పిల్లలు పోస్ట్ చేసే కంటెంట్ ఏమవుతుందనే దాని గురించి, భవిష్యత్ ప్రణాళికల గురించి స్పష్టమైన విధానాలు లేకపోతే దానిని పూర్తిగా విశ్వసించటం అసాధ్యం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘ఈ ఉత్పత్తిలో యాడ్లు లేవు. తల్లిదండ్రుల నియంత్రణ ఉండేలా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. దీనికిగాను ప్రస్తుతానికి అభినందించవచ్చు. కానీ ఫేస్‌బుక్ పిల్లల ప్రయోజనాల కోసం పనిచేస్తోందని తల్లిదండ్రులు ఊరకే ఎలా నమ్మాలి?’’ అని ప్రశ్నిస్తున్నారు.

చిన్నారి వినియోగదారులను పర్యవేక్షించడానికి తాము ప్రారంభిస్తున్న ఈ చర్యను మరింత నిశితంగా పరిశీలిస్తుంటారని ఫేస్‌బుక్‌కి తెలుసు. ‘మెసెంజర్ కిడ్స్’లోకి ప్రవేశించే ఎలాంటి హానికరమైన కంటెంట్ అయినా ఆ సంస్థకు పెద్ద సమస్య అవుతుంది.

గతంలో యూట్యూబ్ పిల్లలకు భద్రమైన చానల్‌ను ఏర్పాటు చేయడం ఎంత కష్టమో.. అది చిన్నారుల కోసం ప్రారంభించిన ‘యూట్యూబ్ కిడ్స్‘లోకి ఆందోళన రేకెత్తించే వీడియోలు వచ్చిచేరినపుడు అర్థమైంది. అలాగే ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేసినా వాటిని బద్దలుకొట్టేందుకు కొద్దిమంది ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటారు.

ఫేస్‌బుక్ ప్రారంభించిన ‘మెసెంజర్ కిడ్స్’ ముందుగా అమెరికాలో మాత్రమే అందులోనూ యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు