బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
ఫొటో క్యాప్షన్,

పీవీ నరసింహా రావు

1992 డిసెంబర్ 6.. ఉదయం 7 గంటలకు పీవీ నరసింహా రావు నిద్ర లేచారు. సాధారణంగానైతే ఆయన అంతకన్నా ముందే లేస్తారు. కానీ ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా నిద్ర లేచారు.

వార్తాపత్రికలు తిరగేశాక, ఒక అరగంట పాటు ట్రెడ్ మిల్ మీద వ్యాయామం చేశారు.

ఆ తర్వాత ఆయన వ్యక్తిగత వైద్యులు శ్రీనాథ్ రెడ్డి వచ్చి రక్తం, మూత్రం నమూనాలు తీసుకున్నారు.

అనంతరం శ్రీనాథ్ రెడ్డి తన ఇంటికి వెళ్లిపోయారు. మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఆయన టెలివిజన్‌ ఆన్ చేయగానే బాబ్రీ మసీదు గుమ్మటంపై వేలాది మంది కరసేవకులు కనిపించారు.

మొదటి గుమ్మటం మధ్యాహ్నం 1.55 గంటలకు కూలిపోయింది. హఠాత్తుగా డాక్టర్ శ్రీనాథ్‌కు పీవీ హృద్రోగి అన్న విషయం గుర్తుకు వచ్చింది.

1990లో పీవీకి హార్ట్ సర్జరీ చేసినపుడు అందరూ ఆయన రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకుంటారనే అనుకున్నారు.

పీవీ డాక్టర్ వెల్లడించిన ఆసక్తికరమైన విషయాలు

పీవీ రక్తపోటును పరీక్షించేందుకు డాక్టర్ ఆయన ఇంటికి వెళ్లేసరికి బాబ్రీ మసీదు మూడో గుమ్మటం కూడా కూలిపోయింది.

''నన్ను చూసి ఆయన 'మళ్లీ ఎందుకు వచ్చావు?' అని ప్రశ్నించారు. మళ్లీ పరీక్షలు చేయడానికి అని చెప్పి ఆయనను పక్కనే ఉన్న గదిలోకి తీసుకెళ్లాను.

అనుకున్నట్లుగానే ఆయన గుండె వేగం పెరిగింది. పల్స్ రేటు, రక్తపోటు కూడా పెరిగింది. ఆయన ముఖం ఎర్రగా మారింది. మనిషి చాలా ఆందోళనగా కనిపించారు.

దాంతో ఆయనకు 'బీటా బ్లాకర్' అదనపు డోస్ ఇచ్చా. అప్పుడు ఆయన పరిస్థితి కొంచెం మెరుగైంది.

ఆ సంఘటన ఆయనలో చాలా ఆందోళన కలిగించిందన్నది స్పష్టం. ఎందుకంటే శరీరం అబద్ధం చెప్పదు'' అని డాక్టర్ శ్రీనాథ్ వివరించారు.

ఫొటో క్యాప్షన్,

మంత్రివర్గ సమావేశంలో పీవీ మౌనంగా ఉన్నట్లు అర్జున్ సింగ్ తన ఆత్మకథలో వెల్లడించారు

కేబినెట్ సమావేశంలో పీవీ మౌనం

ఆ తర్వాత పీవీ తన గది తలుపులు మూసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన తన నివాసంలోనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసారు.

అర్జున్ సింగ్ తన ఆత్మకథ 'ఎ గ్రెయిన్ ఆఫ్ సాండ్ ఇన్ ద హవర్‌గ్లాస్ ఆఫ్ టైమ్'లో ఇలా వివరించారు. ''ఆ సమావేశం మొత్తం పీవీ ఎంత ఆగ్రహంతో కనిపించారంటే, ఆయన నోట ఒక్క మాట కూడా రాలేదు. అందరూ మీరే ఏదైనా చేయండి అన్నట్లు జాఫర్ షరీఫ్ వైపు చూసారు.

దేశం, ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ సంఘటనకు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని జాఫర్ షరీఫ్ అన్నారు. అదే సమయంలో మాఖన్‌లాల్ ఫోతేదార్ కన్నీరు కార్చడం ప్రారంభించారు. కానీ పీవీ మాత్రం శిలావిగ్రహంలా కూర్చున్నారు.''

ఫొటో క్యాప్షన్,

పీవీ మంత్రివర్గంలో మాఖన్‌లాల్ ఫోతేదార్ సభ్యునిగా ఉన్నారు

కనీసం చివరి గుమ్మటాన్ని అయినా కాపాడండి

అంతకు ముందు బాబ్రీ మసీదును పడగొట్టేప్పుడు, కేంద్ర మంత్రి మాఖన్‌లాల్ ఫోతేదార్ పీవీకి ఫోన్ చేసి వెంటనే ఏదైనా చేయమని వేడుకున్నారు.

తన ఆత్మకథ 'ద చీనార్ లీవ్స్'లో ఆయన, ''ఫైజాబాద్‌లో ఉన్న హెలికాప్టర్ల ద్వారా వాయుసేనను అయోధ్యకు తరలించి కరసేవకులను చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించమని ప్రధానికి విజ్ఞప్తి చేసాను. కానీ పీవీ, 'ఆ పని నేనెలా చేయగలను?' అన్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏ చర్య అయినా తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని నేను ఆయనకు చెప్పాను. 'రావు గారూ కనీసం ఒక గుమ్మటాన్నైనా కాపాడండి' అని వేడుకున్నాను.

అలాగైతే కనీసం దేశ ప్రజలకు 'మేం బాబ్రీ మసీదును రక్షించేందుకు వీలైనంతగా ప్రయత్నించాం' అని చెప్పుకోవచ్చని వేడుకున్నా. పీవీ చాలా సేపు మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత 'ఫోతేదార్‌జీ! నేను మళ్లీ మీకు ఫోన్ చేస్తా' అని పెట్టేశారు.''

ఫొటో క్యాప్షన్,

రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మను కలిసినట్లు మాఖన్‌లాల్ ఫోతేదార్ ఆత్మకథలో రాసుకున్నారు

పిల్లాడిలా రోదించిన రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ

ఫోతేదార్ ఇంకా ఈ విధంగా రాసుకొచ్చారు, ''ప్రధాని నిష్క్రియాపరత్వం నాకు చాలా నిరాశ, వేదన కలిగించింది. నేను రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మకు ఫోన్ చేసి, ఆయనను కలవాలనుకుంటున్నట్లు తెలిపాను. ఆయన సాయంత్రం 5.30 గంటలకు రమ్మన్నారు.

నేను రాష్ట్రపతిని కలవడానికి బయలుదేరుతుండగా, సాయంత్రం 6 గంటలకు కేబినెట్ సమావేశం ఉన్నట్లు పీవీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. అయినా నేను రాష్ట్రపతి నివాసానికి వెళ్లాను.

నన్ను చూడగానే ఆయన చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టకున్నారు. 'పీవీ ఎందుకు ఇలా చేశారు?' అని ప్రశ్నించారు. టీవీ, రేడియోల ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాలని నేను శంకర్ దయాళ్ శర్మకు విజ్ఞప్తి చేసాను. అందుకు ఆయన అంగీకరించారు.

కానీ దానికి ప్రధాని అనుమతి కావాల్సి ఉంటుందని అధికారులు ఆయనకు తెలిపారు. అందుకు ప్రధాని అనుమతి ఇచ్చేవారా అన్నది నాకు అనుమానమే.''

పీవీనే బాధ్యులు

మాఖన్‌లాల్ ఫోతేదార్ తన ఆత్మకథలో ఈ విధంగా తెలిపారు.. ''నేను 15-20 నిమిషాలు ఆలస్యంగా కేబినెట్ సమావేశానికి హాజరయ్యాను. అందరూ మౌనంగా ఉండడం చూసి, 'ఎందుకు అందరూ మౌనంగా కూర్చున్నారు?' అని ప్రశ్నించాను.

మాధవరావ్ సింధియా, 'ఫోతేదార్‌జీ! బాబ్రీ మసీదును కూల్చేశారు మీకు తెలీదా?' అన్నారు. నేను ప్రధాని వైపు తిరిగి, 'రావుగారూ! ఇది నిజమేనా?' అని ప్రశ్నించాను.

ప్రధాని నా కళ్లలోకి చూడలేకపోయారు. దానికి బదులుగా కేబినెట్ కార్యదర్శి అది నిజమే అని చెప్పారు. నేను కేబినెట్ మంత్రులందరి ఎదుటే, దీనికి ఆయనే బాధ్యత వహించాలని అన్నాను. ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు.''

ఫొటో క్యాప్షన్,

బాబ్రీ మసీదు చివరి రాయి పడిపోయాకే పీవీ పూజ నుంచి లేచినట్లు కులదీప్ నయ్యర్ తన ఆత్మకథలో రాసుకున్నారు

మసీదు కూల్చివేత సమయంలో పూజలో పీవీ

'బియాండ్ ద లైన్స్' అన్న తన ఆత్మకథలో కులదీప్ నయ్యర్.. ''బాబ్రీ మసీదు కూల్చివేతలో పీవీ పాత్ర ఉన్నట్లు నాకు సమాచారం ఉంది. కరసేవకులు మసీదును ధ్వంసం చేస్తున్నపుడు పీవీ పూజలో ఉన్నారు. మసీదు చివరి రాయి పడిపోయాకే ఆయన పూజ నుంచి లేచారు'' అని తెలిపారు.

కానీ పీవీపై 'హాఫ్ లయన్' అన్న పుస్తకాన్ని రాసిన వినయ్ సీతాపతి మాత్రం ఈ విషయంలో పీవీకి క్లీన్ చిట్ ఇచ్చారు.

ఫొటో క్యాప్షన్,

బాబ్రీ మసీదు కూల్సివేత సమయంలో ఆయన పూజలో లేరని వినయ్ సీతాపతి (తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి) చెబుతున్నారు

మంత్రి మండలి సభ్యులు ఆయన పతనాన్ని కోరుకున్నారు

సీతాపతి ఇలా అంటారు.. ''1992లో రెండు కూల్చివేతలకు కుట్ర జరిగింది. ఒకటి బాబ్రీ మసీదు, రెండు.. పీవీ నరసింహారావు. సంఘ్ పరివార్ బాబ్రీని కూల్చివేయాలనుకుంటే, పీవీ ప్రత్యర్థులు ఆయనను పదవిలోంచి దించెయ్యడానికి కుట్ర పన్నారు.

బాబ్రీ మసీదును కూల్చివేసినా, కూల్చివేయకున్నా, తన ప్రత్యర్థులు మాత్రం తనను 7-రేస్ కోర్స్ రోడ్డు నుంచి తరిమేయాలని చూస్తున్నారని ఆయనకు బాగా తెలుసు.

1992 నవంబర్‌లో సీసీపీఏలో కనీసం ఐదు సమావేశాలు జరిగాయి. ఆ సమావేశాల్లో ఏ ఒక్క నేత కూడా కల్యాణ్ సింగ్‌ను తొలగించాలని కోరలేదు.''

''శాంతిభద్రతలకు భంగం కలిగినప్పుడో, లేదా భంగం కలిగే ప్రమాదం ఉందని అనుమానం ఉన్నపుడో రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయవచ్చని పీవీకి అధికారులు సలహా ఇస్తూనే వచ్చారు. బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పీవీ పూజలో ఉన్నారని కులదీప్ నయ్యర్ చెబుతున్నారు. ఆయన అక్కడ స్వయంగా ఉన్నారా? తనకు ఆ సమాచారాన్ని సోషలిస్టు నేత మధు లిమయే ఇచ్చారని, లిమయేకు ఈ విషయం ప్రధాని కార్యాలయంలో ఉన్న 'విశ్వసనీయ వర్గాల' నుంచి తెలిసిందని ఆయన అంటున్నారు. కానీ ఆ 'విశ్వసనీయ వర్గాలు' ఏవో ఆయన బయట పెట్టడం లేదు.''

బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో పీవీ నిద్రపోతున్నారు లేదా పూజలో ఉన్నారు అనే కథనాలు అవాస్తవమని తన పరిశోధనలో తేలిందని వినత్ సీతాపతి తెలిపారు.

నరేష్ చంద్ర, హోం కార్యదర్శి మాధవ్ గోడ్‌బోల్ కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు. తాము ప్రతి నిమిషం ప్రధాని నుంచి సూచనలు తీసుకున్నట్లు వారు తెలిపారు.

రామ జన్మభూమి అంశాన్ని బీజేపీ నుంచి పీవీ లాక్కోవాలనుకున్నారా?

రాజకీయ విశ్లేషకులు, ఇందిరా గాంధీ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ అధినేత రామ్ బహదూర్ రాయ్, ''1991లో బాబ్రీ మసీదును కూల్చేసే ప్రమాదముందని తెలిసినపుడు, దాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పీవీ మీడియా సలహాదారు పీవీఆర్కే ప్రసాద్ రాసిన పుస్తకంలో, మసీదు కూల్చివేతను పీవీ ఎలా చూస్తూ ఊరుకున్నారో వివరించారు.

అక్కడ రామమందిరాన్ని నిర్మించాలని ఆయన చాలా ఉత్సుకతతో ఉండేవారు. అందుకే ఆయన రామాయణ ట్రస్టును ఏర్పాటు చేసారు. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత ముగ్గురు ప్రముఖ జర్నలిస్టులు - నిఖిల్ చక్రవర్తి, ప్రభాష్ జోషి, ఆర్కే మిశ్రా ఆయనను కలవడానికి వెళ్లారు. నేను కూడా వారి వెంటే ఉన్నాను. డిసెంబర్ 6 నాటి సంఘటనను ఎందుకు జరగనిచ్చారో వారు తెలుసుకోవాలనుకున్నారు. దానికి ఆయన ఇచ్చిన సమాధానం 'నాకు రాజకీయాలు తెలీవనుకున్నరా?' అని.''

''ఆ మాటలకు నా భావం ఏమిటంటే - బాబ్రీ మసీదును కూల్చివేస్తే, బీజేపీ రామమందిరం చుట్టూ చేస్తున్న రాజకీయాలకు తెర పడుతుందని ఆయన భావించారు. అందుకే దాన్ని ఆపడానికి ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఆ తర్వాత బీజేపీ నుంచి ఆ అంశాన్ని తాము లాక్కోవచ్చనుకున్నారు. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగేలా ఆయన ఒక్కొక్క పనీ చేసుకొచ్చారు.''

ఫొటో క్యాప్షన్,

సయీద్ నఖ్వీతో రేహాన్ ఫజల్

బెడిసికొట్టిన రాజకీయ ఎత్తుగడ

పీవీకి దగ్గరగా ఉండే జర్నలిస్ట్ కల్యాణీ శంకర్. బాబ్రీ మసీదు విధ్వంసంలో పీవీ పాత్రను 'బెడిసికొట్టిన రాజకీయ ఎత్తుగడ'గా ఆయన అభివర్ణించారు.

''బాబ్రీ మసీదు విషయంలో ఏమీ జరగదని అద్వానీ, వాజ్‌పేయి ఆయనకు హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో కేంద్రం రిసీవర్‌షిప్‌కు నిరాకరించింది. అక్కడ భద్రతా బలగాలను మోహరించాలా, వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. కల్యాణ్ సింగ్ అక్కడికి భద్రతా బలగాలను పంపనే లేదు'' అని ఆయన తెలిపారు.

బాబ్రీ మసీదు విషయంలో పీవీది 'తప్పుడు అంచనా'నా లేక, 'నిర్ణయం తీసుకోవడంలో జరిగిన తప్పా?' అని నేను ప్రముఖ జర్నలిస్ట్ సయీద్ నఖ్వీని ప్రశ్నించాను.

నఖ్వీ దీనికి జవాబిస్తూ,''పీవీతో పాటు హోం మంత్రికి కూడా ఈ విషయంలో బాధ్యత లేదా? ఆరోజు సాయంత్రం అయ్యేసరికి చాలా మంది ప్రభుత్వ అధికారులు నుదుటన తిలకం ధరించి సగర్వంగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. దానికేమంటారు?'' అని ప్రశ్నించారు.

ఫొటో క్యాప్షన్,

ముస్లింల ఆగ్రహాన్ని తగ్గించాలని పీవీని కోరినట్లు తన ఆత్మకథలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసుకున్నారు

అనుభవ లేమి వల్లే..

'ద టర్బులెంట్ ఇయర్స్' అన్న తన ఆత్మకథలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ.. ''బాబ్రీ విధ్వంసాన్ని ఆపలేకపోవడం పీవీ అతి పెద్ద వైఫల్యం. ఆయన ఇతర పార్టీలతో చర్చించే బాధ్యతను నారాయణ్ దత్త్ తివారీ లాంటి సీనియర్ నేతలు, అనుభవజ్ఞులకు అప్పగించాల్సింది. హోంమంత్రి ఎస్‌బీ చవాన్ మంచి మధ్యవర్తే కానీ, పెరిగిపోతున్న భావోద్వేగ అంశాలను ఆయన పసిగట్టలేకపోయారు. రంగరాజన్ కుమారమంగళం కూడా నిజాయితీగా పని చేశారు. కానీ ఆయన అప్పుడు ఇంకా యువకులు. దానికితోడు అనుభవలేమి.''

''తర్వాత పీవీ నన్ను ఒంటరిగా కలిసినప్పుడు, రాబోయే ప్రమాదాల గురించి వివరించేందుకు మీ పక్కన ఎవరూ లేరా? బాబ్రీ విధ్వంసంపై అంతర్జాతీయంగా వచ్చే ప్రతిస్పందన గురించి ఆలోచించలేదా? అని ప్రశ్నించాను. కనీసం ఇప్పుడైనా ముస్లింల ఆగ్రహాన్ని తగ్గించడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోండి అని చెప్పాను. నేనీ మాటలు చెప్పేటప్పుడు ఆయన ముఖంలో ఎప్పటిలాగే ఎలాంటి భావాలూ ప్రతిఫలించలేదు. నేను చాలాకాలం పాటు ఆయనతో కలిసి పని చేశాను. ఆయన గురించి నాకు తెలుసు. ఆయన ముఖంలోని భావాలను నేను చదవాల్సిన పని లేదు. ఆయనలో దు:ఖాన్ని, నిరాశను స్పష్టంగా గమనించాను.''

ఫొటో క్యాప్షన్,

డిసెంబరు 6న ఏదో జరగనున్నట్లు అర్జన్ సింగ్‌కు ముందే తెలుసునని మాఖన్‌లాల్ ఫోతేదార్ తన ఆత్మకథలో రాశారు

అర్జున్ పాత్రపైనా ప్రశ్నలు

ఈ మొత్తం వ్యవహారంలో అర్జున్ సింగ్ పాత్రపై కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తన ఆత్మకథలో మాఖన్‌లాల్ ఫోతేదార్.. ''డిసెంబర్ 6న ఏదో పెద్ద సంఘటన జరగబోతోందని అర్జున్ సింగ్‌కు బాగా తెలుసు. కానీ ఆయన రాజధాని నుంచి పంజాబ్‌కు వెళ్లిపోయారు. డిసెంబర్ 6న జరిగిన కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం, తర్వాత కేబినెట్ నుంచి రాజీనామా చేయడానికి వెనుకాడ్డం, ఇవన్నీ రాజకీయంగా ఆయనకు చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి. ఆయన నాకు చాలా సన్నిహితంగా ఉన్నారు. సవాళ్లను ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదని నాకు తెలుసు. అర్జున్ సింగ్ వైఖరి, మొత్తం కేబినెట్ మంత్రుల మౌనం, మరీ ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో, 'హిందీ హార్ట్‌ల్యాండ్'లో కాంగ్రెన్‌ను ముస్లింలకు ఎంత దూరం చేశాయంటే, ఆ పార్టీ కేంద్రంలో ఎనిమిదేళ్ల వరకు అధికారంలోకి రాలేకపోయింది.''

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)