'హాస్యం, అల్లరి అంటే సావిత్రికి చాలా ఇష్టం'

  • 6 డిసెంబర్ 2017
సావిత్రి Image copyright V.Govindha Rao

సినీ జగత్తులో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న మహానటి సావిత్రి.

ఆమె నటన ఒక అపూర్వ గ్రంథాలయం.

తెలుగు వారి తలపుల్లో ఆమె ఓ చెరగని సంతకం.

ఆమెకున్న లక్షల మంది అభిమానుల్లో నేనూ ఒకడ్ని. ఆ తరువాతే మేనల్లుడిని, అల్లుడిని.

Image copyright V.Govindha Rao
చిత్రం శీర్షిక సావిత్రి కుమార్తె పెళ్లి రిసెప్షన్‌కు సి.పుల్లయ్య హాజరయ్యారు

ఎప్పుడూ అభిమానినే..

ఏది ఏమైనా నా మనసు మాత్రం ఆమెను ఎప్పుడూ ఒక అభిమానిగానే ఆరాధిస్తుంది.

ఆమె అద్భుతమైన నటి అని ఇప్పుడు నేనంటే.. కాకపోతే మరేమిటని ఎవరైనా అనేస్తారు.

అయితే చాలా మంది నటీమణులున్నా తెలుగువారికి ఆమె మాత్రమే 'మహానటి' ఎందుకయ్యింది. తమిళులకు 'నడిగైయర్ తిలగమ్' ఎందుకయ్యింది.

ముఖంలో నవరసాలను అవలీలగా క్షణమాత్రంలో చూపగల సామర్థ్యం ఆమెకొక్కదానికే వుంది అని ఏ ప్రేక్షకుడైనా చెప్పగలడు.

అదేమాట నేనంటే గర్వంతో చెప్పినట్టవుతుంది.

Image copyright V.Govindha Rao
చిత్రం శీర్షిక సావిత్రి కుమార్తె పెళ్లి రిసెప్షన్‌లో చక్రపాణి

కొన్ని వందల సినిమాలు చేసి ఎన్నో రకాల పాత్రలను పండించిన ఆమె ప్రతిభ అనన్య సామాన్యం.

స్వతహాగా ఆమెది ఎంతో మంచి హృదయం. ఆమె ఆర్ద్రత, ఆశయాలు, సుతిమెత్తని సంభాషణలు ఆమె వ్యక్తిత్వాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాయి.

ఆమె దాతృత్వం గురించి చెప్పాలంటే చర్విత చర్వణమే అవుతుంది.

నిజ జీవితంలో హాస్యం, అల్లరి అంటే ఆమెకు చాలా ఇష్టం. చాలా బాగా పాడుతుంది. మంచి నాట్యగత్తె. వీటన్నిటినీ మించి చిన్నపిల్లల స్వభావం.


కన్నదాసన్ అనే తమిళ సినిమా కవి సావిత్రి గారి గురించి ఇలా అన్నారు.

ఆమె రుతువుల్లో వసంత రుతువు

కళల్లో చిత్ర (లేఖన) కళ

మాసాల్లో మార్గశిర మాసం

పూలల్లో మల్లెపువ్వు

...ఇంతకంటే గొప్పగా ఏం చెప్పాలి ఆమె గురించి.


తెలుగువాళ్ళకు ఒక మహాకవి.. శ్రీశ్రీ

తమిళవాళ్ళకు ఒక మహాకవి.. భారతి

వాళ్ళకీ వీళ్ళకీ ఒకే ఒక మహానటి.. సావిత్రి

ఇటువంటి మహానటితో నాకు వ్యక్తిగతంగా ఎన్నో మరపురాని జ్ఞాపకాలు, మదినిండుగా అనుభూతులూ ఉన్నాయి.

సావిత్రి గారిది.. నాది అక్క తమ్ముళ్ళ అనుబంధం.

నన్ను ఆమె 'ఏరా గోవిందు' అని పిలిచేది. నేను 'అక్క' అని పిలిచేవాడిని.

సంబోధన మాత్రం 'నువ్వు' అనే.

Image copyright V.Govindha Rao
చిత్రం శీర్షిక సావిత్రి కుమార్తె పెళ్లి రిసెప్షన్‌లో పద్మనాభం

కొత్త బట్టలు పెట్టారు

చిన్నప్పుడు స్కూలు సెలవులకు నేను మద్రాసుకు వచ్చేవాడిని.

ఆమె నటించిన 'మాయా బజార్' టైమ్‌కు నాకు పదేళ్ళు.

అది 1957. అప్పుడే ఆమె కట్టుకున్న కొత్త ఇంటి గృహ ప్రవేశం.

నాకు కొత్త బట్టలు పెట్టి సావిత్రి గారి దంపతుల కాళ్ళకు నమస్కారం చేయించారు.

ఆ మరు సంవత్సరం వాళ్ళకు అమ్మాయి పుట్టింది. నా చేత గోల్డ్ కాయిన్ ఇప్పించారు మా పెద్దనాన్న.

Image copyright V.Govindha Rao
చిత్రం శీర్షిక సావిత్రి కుమార్తె పెళ్లి రిసెప్షన్‌లో అక్కినేని నాగేశ్వర రావు

నా మీద కోప్పడ్డారు

మా పెళ్ళికి ముందు ఆమె చాలా బిజీగా వుండేది.

నన్ను అప్పుడప్పుడూ షూటింగులకు, ప్రివ్యూలకు తీసుకు వెళ్ళేది.

కొన్నికొన్ని సీన్ల గురించి, పాటల గురించి మాట్లాడుకునే వాళ్ళం. 'నీకు సినిమా జ్ఞానం బాగానే వుందిరా' అనేది.

నేను ఉద్యోగం చెయ్యాలని పట్టుపట్టినప్పుడు ససేమిరా అన్నది. కొంచెం కోప్పడింది కూడా.

అయితే నేను ఎస్‌బీఐలో చేరడం. ఆ వెంటనే పెళ్ళి అవడం జరిగింది.

తమిళ సినిమా 'ప్రాప్తం'.. తెలుగులో 'మూగమనసులు'గా రీమేక్ జరుగుతున్న టైమ్‌లో ఒకరోజు బ్రేక్‌లో పేకాట ఆడుతున్నారు.

నేను 'కరాకా' రాసిన గాంధీ పుస్తకం చదువుతూ పక్కన పెట్టి వెళ్ళాను.

నేను తిరిగి వచ్చే లోపు కెమేరామన్ ఆ పుస్తకం మీద రెండు కార్డులు పెట్టాడు.

అప్పట్లో నాకు పేకాటంటే చిరాకు. అతన్ని సావిత్రి గారు తెగ చివాట్లు పెట్టింది.

Image copyright V.Govindha Rao
చిత్రం శీర్షిక సావిత్రి కుమార్తె పెళ్లి రిసెప్షన్‌లో పి.సుశీల

చాలానే మాట్లాడుకునే వాళ్ళం

ఏఎన్‌ఆర్, శివాజీ గణేషన్ విషయానికి వచ్చి వారి యాక్టింగ్ గురించి డిస్కస్ చేసే వాళ్ళం. మెథడ్ యాక్టింగ్ గురించి ఆమె చాలా చెప్పేది. ఎస్‌వీఆర్ గురించి ఇద్దరం చాలానే మాట్లాడుకునే వాళ్ళం.

ఇంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు చెప్పేవాడిని.

ఎందుచేతనో జాగ్రత్తలు తీసుకునేది కాదు. అన్ని విషయాలు తెలిసి కూడా.

నేనంటే ఇష్టం, అభిమానం లేకపోతే ఆమెకు నేను అల్లుణ్ణి అయ్యేవాణ్ణి కాదు.

(నాటి నటీమణి సావిత్రి జయంతి సందర్భంగా...)

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)