జెరూసలెంపై ట్రంప్ నిర్ణయంపై ప్రపంచవ్యాప్త నిరసనలు

 • 7 డిసెంబర్ 2017
ట్రంప్, పాలస్తీనా, జెరూసలెం, ఇజ్రాయెల్ Image copyright Reuters
చిత్రం శీర్షిక వివాదాస్పద జెరూసలెం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జెరూసలెంను ఇజ్రాయిల్ రాజధానిగా గుర్తిస్తున్నామని ప్రకటించారు. తాజా నిర్ణయం మధ్య ప్రాచ్య శాంతి ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్తుందని ట్రంప్ అభివర్ణించారు.

అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకి మార్చాలని అధికారులను ఆదేశించారు.

అమెరికాకు చాలా కాలంగా మిత్రదేశాలుగా ఉన్న దేశాలు సహా చాలా దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇది మధ్య ప్రాచ్యంలో శాంతికి విఘాతం కలిగించే నిర్ణయం అని కూడా అవి అంటున్నాయి.

పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ ట్రంప్ ప్రకటనను తీవ్రంగా ఖండించారు.

ఈ మార్పులను ఇజ్రాయెల్ ఆహ్వానిస్తుండగా, ఈ చర్యతో మధ్య ప్రాచ్య శాంతి ప్రక్రియకు విఘాతం కలుగుతుందని పాలస్తీనావాసులు, అరబ్ నేతలు హెచ్చరిస్తున్నారు.

అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా మాత్రం అమెరికా ముస్లింలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించింది.

ఇజ్రాయెల్ మొదటి నుంచి జెరూసలెం తమ రాజధాని అని చెబుతుండగా, పాలస్తీనా మాత్రం తూర్పు జెరూసలెంను భవిష్యత్ పాలస్తీనా దేశ రాజధానిగా చెప్పుకుంటోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ట్రంప్ పోస్టర్‌ను తగలబెడుతున్న పాలస్తీనావాసులు

జెరూసలేం గురించి ఇంత వివాదం ఎందుకు?

ఈ సమస్యకు మూలాలు అరబ్ దేశాలు, ఇతర ఇస్లామిక్ ప్రపంచం నుంచి మద్దతు కలిగిన పాలస్తీనాకు, ఇజ్రాయెల్‌కు మధ్య వివాదంలో ఉన్నాయి.

యూదు, ఇస్లాం, క్రైస్తవం.. ఈ మూడు మతాలకు చెందిన పవిత్ర ప్రదేశాలు ఈ నగరంలో, మరీ ప్రత్యేకించి తూర్పు జెరూసలేంలోనే ఉన్నాయి.

1967 మధ్య ప్రాచ్య యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ జోర్డాన్ నుంచి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. నాటి నుంచి మొత్తం జెరూసలెం నగరాన్ని అవిభాజ్య రాజధానిగా వ్యవహరిస్తోంది.

1993 నాటి ఇజ్రాయెల్-పాలస్తీనా శాంతి ఒప్పందాల ప్రకారం, తర్వాతి దశలలో జరిగే చర్చల ద్వారా జెరూసలెం పరిస్థితిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

జెరూసలేంపై ఇజ్రాయెల్ సార్వభౌమత్వానికి అంతర్జాతీయ ఆమోదం ఎన్నడూ లేదు. అన్ని దేశాలూ తమ రాయబార కార్యాలయాలను టెల్ అవీవ్‌లోనే నెలకొల్పాయి.

1967 నుంచి ఇజ్రాయెల్ తూర్పు జెరూసలెంలో డజన్ల కొద్దీ సెటిల్‌మెంట్లను నిర్మించింది. వాటిలో దాదాపు 2 లక్షల మంది యూదులు ఉంటున్నారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం దీనిని అక్రమంగా పరిగణిస్తున్నా, ఇజ్రాయెల్ మాత్రం తోసిపుచ్చుతోంది.

జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడం ద్వారా అమెరికా తూర్పు ప్రాంతంలో ఉన్న సెటిల్‌మెంట్లు అన్నీ న్యాయబద్ధమైనవే అన్న ఇజ్రాయెలీ వాదనకు మద్దతు తెలుపుతోంది.

Image copyright Getty Images

అమెరికా మద్దతు ఎందుకు?

జెరూసలెంపై తమ నిర్ణయం ''వాస్తవాన్ని గుర్తించడం'' అని అమెరికా అంటోంది.

అయితే, నగరానికి చెందిన నిర్దిష్టమైన సరిహద్దులను మాత్రం తుది ఒప్పందానికి లోబడి నిర్ణయిస్తారని అమెరికా అంటోంది.

అయితే పవిత్ర స్థలాల పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పూ ఉండదు.

ట్రంప్ తన అధ్యక్ష పదవికి ప్రచారం ప్రారంభించినప్పుడే ఇజ్రాయెల్ అనుకూల ఓట్ల కోసం ఈ ప్రతిపాదన తెచ్చారు.

Image copyright Getty Images

ప్రపంచ దేశాల ప్రతిస్పందన

 • సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తామన్న అమెరికా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ముస్లింలను రెచ్చగొట్టేదిగా ఉందని అన్నారు.
 • పాలస్తీనా యూకే ప్రతినిధి మాన్యుయెల్ హస్సస్సైన్ బీబీసీతో మాట్లాడుతూ, ఈ మార్పులు రెండు దేశాల మధ్య శాంతి ప్రక్రియకు మరణశాసనం లాంటివని అన్నారు. ఇది మధ్యప్రాచ్యంలో యుద్దం ప్రకటించడం లాంటిదని తెలిపారు.
 • హమాస్ నేత ఇస్మాయిల్ హనియా అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ శుక్రవారం నిరసన ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
 • యూకే విదేశీ కార్యదర్శి బోరిస్ జాన్సన్ అమెరికా నిర్ణయాన్ని సునిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.
 • జోర్డాన్ రాజు అబ్దుల్లా అమెరికా నిర్ణయం శాంతి ప్రక్రియ పునరుద్ధరణకు విఘాతం కలిగిస్తుందని అన్నారు.
 • ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతాహ్అల్ సిసి ఈ ప్రాంతంలో సమస్యను జటిలం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
 • టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎర్డోగన్ తమ దేశం ఇజ్రాయెల్‌తో సంబంధాలు తెంచుకుంటుందని తెలిపారు.
 • ఆ ప్రాంతంలోని ''ప్రజలందరి హక్కులను గుర్తించడం'' ద్వారా మాత్రమే అక్కడి సమస్య పరిష్కారం కాగలదని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు.
 • మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చైనా హెచ్చరించింది.
 • ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్, అరబ్ లీగ్ కూడా ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసాయి.

రాబోయే రోజుల్లో ఆందోళనలు తలెత్తే అవకాశం ఉండడంతో భద్రతా కారణాల రీత్యా తమ ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలు జెరూసలెంకు లేదా వెస్ట్ బ్యాంక్‌కు వెళ్లొద్దని అమెరికా సూచించింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)