ట్రంప్ ప్రకటనపై భగ్గుమన్న వెస్ట్ బ్యాంక్, 31 మంది పాలస్తీనావాసులకు గాయాలు

  • 8 డిసెంబర్ 2017
జెరూసలెం, ట్రంప్, ఇజ్రాయెల్, పాలస్తీనా Image copyright Getty Images

జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పాలస్తీనావాసులు భగ్గుమన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో అల్లర్లకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు ఇజ్రాయెల్ బలగాలు టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు ప్రయోగించడంతో కనీసం 31 మంది గాయపడ్డారు.

ట్రంప్ ప్రకటనకు నిరసనగా వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ రెండు చోట్లా పాలస్తీనావాసులు వీధుల్లో ఆందోళనకు దిగారు.

దశాబ్దాలుగా ఇజ్రాయెల్‌పై అమెరికా అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

బుధవారం ట్రంప్ జెరూసలెంను అధికారికంగా ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు.

అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకు తరలించాలని తన అధికారులను ఆదేశించారు.

ట్రంప్ నిర్ణయాన్ని అమెరికా మిత్ర దేశాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై రాబోయే రోజుల్లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, అరబ్ లీగ్ సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే పాలస్తీనా ఇస్లామిక్ బృందం హమస్ తిరుగుబాటుకు పిలుపునిచ్చింది.

గాజా స్ట్రిప్ ను పరిపాలిస్తున్న హమస్ నేత ఇస్మాయిల్ హనియా శుక్రవారం నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ఇంతిఫదా, అంటే తిరుగుబాటు చేయాలని కోరారు.

మరింత సమాచారం కోసం ఈ కథనాలు చూడొచ్చు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)