రాజధాని నగరాలను ఎలా ఎంపిక చేస్తారు?

ఫొటో సోర్స్, US Airforce/Getty Images
వాషింగ్టన్ డీసీ
దేశ రాజధానిగా జెరూసలెంను ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు ఏ దేశమూ దాన్ని అధికారికంగా గుర్తించలేదు. తాజా అమెరికా నిర్ణయంపై అసమ్మతి కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
జెరూసలెం మూడు మతాలకు పవిత్ర ప్రదేశం. యూదులు, క్రిస్టియన్లు, ముస్లింలకు చెందిన పవిత్ర కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఈ హోదానే పాలస్తీనా, ఇజ్రాయెల్లను వేరు చేస్తోంది.
అసలు రాజధాని అంటే ఏమిటి? దాన్ని ఎలా నిర్ణయిస్తారు? అది అక్కడే ఎందుకు ఉండాలి? అది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుంది? అన్న ప్రశ్నలు తెర పైకి వస్తున్నాయి.
రాజధానుల ఎంపికకు నాలుగు కారణాలు:
ఫొటో సోర్స్, AFP
కొన్ని రాజధానుల్లో సకల సౌకర్యాలు ఉంటాయి. కానీ మయన్మార్ రాజధాని నాప్యీడా మాదిరిగా అక్కడ ప్రజలే ఉండరు!
1. ఐక్యతకు చిహ్నం-నియంత్రణకు నిదర్శనం
ఇంగ్లీష్ 'కేపిటల్' పదం లాటిన్ భాషలోని 'కేపిటలిస్' పదం నుంచి వచ్చింది. 'కేపిటలిస్' అంటే 'తల' అని అర్థం.
అంటే దేశం ఒక దేహం అయితే, రాజధాని దానికి తల అన్నమాట.
రాజధానికి రక్షణ అవసరం. అదే సమయంలో దేశ భూభాగంపై నియంత్రణ కలిగి ఉంటుంది. దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంది.
అందుకే చాలా రాజధానులను దేశం నడిబొడ్డున నిర్మించారు. అన్ని వర్గాల వారికి ప్రాతినిథ్యం వహించేలా, అందరికీ అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడ్డారు.
ఫొటో సోర్స్, Getty Images
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరం
మాడ్రిడ్ ఇబెరియన్ ద్వీపకల్పం మధ్యలో ఉంటుంది.
1991లో అబుజాను నైజీరియా కొత్త రాజధానిగా ప్రకటించారు. భౌగోళికంగా ఇది దేశం మధ్యలో ఉంటుంది.
అన్ని వర్గాలు, మతాలు, ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా దీన్ని నిర్మించారు.
అదే విధంగా తీరప్రాంతంలో ఉన్న తన రాజధాని రియో డి జనిరోను 1961లో బ్రెజిల్ బ్రెసిలియాకు తరలించింది.
బ్రెజిల్ సంప్రదాయాలు ఉట్టిపడేలా కొత్త నగరాన్ని నిర్మించాలన్న ఆలోచనే దీనికి కారణమని ఆర్కిటెక్ట్ ఆస్కార్ నిమియార్ అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, Getty Images
రియో డి జనిరో
2. రాజకీయంగా రాజీ
కొన్నిసార్లు రాజకీయంగా రాజీ పడి దేశ రాజధానుల్ని ఖరారు చేశారు.
1790లో వాషింగ్టన్ డీసీని అమెరికా రాజధానిగా ఎంపిక చేయడంలో ఇదే జరిగింది.
రాష్ట్రాల అప్పులను ఫెడరల్ ప్రభుత్వం భరించాలని అలెగ్జాండర్ హమిల్టన్, ఇతర ఉత్తరాది రాష్ట్రాలు కోరాయి. దక్షిణాదిన రాజధాని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్న థామస్ జెఫర్సన్, జేమ్స్ మాడిసన్లతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నాయి.
దాంతో జార్జ్ వాషింగ్టన్ పొటోమాక్ నదిపై కచ్చితమైన ప్రదేశాన్ని రాజధాని కోసం ఎంపిక చేశారు. అక్కణ్నుంచే వాషింగ్టన్ డీసీ చరిత్ర మొదలైంది.
ఫొటో సోర్స్, Getty Images
ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్బెర్రాలో పార్లమెంటు భవనం
ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ కాదని తెలుసుకుని కొందరు పర్యాటకులు ఆశ్చర్యానికి గురవుతుంటారు.
నిజానికి దేశంలోనే అతిపెద్దదైన సిడ్నీ, మెల్‌బోర్న్‌లు రాజధాని నగరం కావాలని పోటీపడ్డాయి. కానీ, ఈ రెండింటికీ మధ్యలో ఉన్న కాన్బెర్రాను రాజధానిగా నిర్ణయించి, రాజీ చేశారు.
అయితే, ఇది పూర్తిగా నిజం కాదని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.
వేసవి కాలంలో సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో ఎండలు మండిపోవడం వల్ల చల్లగా ఉండే కాన్బెర్రాను ఎంపిక చేసినట్లు మరో వాదన ఉంది.
శ్వేతజాతీయులు చల్లటి వాతావరణంలో జీవిస్తే వృద్ధి చెందుతారని ఆ సమయంలో అందరు రాజకీయ నాయకులు అంగీకరించారని చరిత్రకారుడు డేవిడ్ హిడెన్ ఆస్ట్రేలియన్ జియోగ్రాఫిక్తో చెప్పారు.
ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికా మూడు రాజధాని నగరాల్లో కేప్‌టౌన్ ఒకటి
3. సంక్లిష్ట చరిత్ర
ఒక్కోసారి ప్రాంత చారిత్రక చరిత్ర ఆధారంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు.
1989లో బెర్లిన్ గోడ కూల్చివేత, జర్మనీ పునరేకీకరణ తర్వాత దేశ రాజధానిని నిర్ణయించాల్సి వచ్చింది.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో పశ్చిమ జర్మనీకి బాన్ రాజధానిగా ఉండేది. అలాగే, తూర్పు జర్మనీకి తూర్పు బెర్లిన్ రాజధానిగా ఉండేది.
ఏకీకృత జర్మనీకి ఈ రెండింటిలో దేన్ని రాజధానిగా ప్రకటించాలన్న విషయం సంక్షిష్టంగా మారింది.
1991 జూన్ 20న దీనిపై జర్మనీ పార్లమెంట్ బుండెస్టాగ్‌లో ఓటింగ్ పెట్టారు.
అందులో బెర్లిన్ 337 ఓట్లతో బాన్ నగరంపై విజయం సాధించింది. బాన్‌కు 320 ఓట్లు వచ్చాయి.
ఫొటో సోర్స్, Reuters
బెర్లిన్ గోడ
జర్మనీలో రెండు నగరాలే రాజధాని రేసులో నిలిచాయి. దక్షిణాఫ్రికాలో అయితే మూడు నగరాలు రాజధాని కోసం పోటీ పడ్డాయి.
దక్షిణాఫ్రికాలో ప్రభుత్వ శాఖలు మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. కేప్‌టౌన్‌లో శాసన, ప్రిటోరియాలో కార్యనిర్వహక, బ్లూమ్‌ఫోంటైన్‌లో న్యాయ వ్యవస్థ కొలువై ఉన్నాయి.
అయితే, రాజ్యాంగ ధర్మాసనం మాత్రం జొహనెస్‌బర్గ్‌లో ఉంది.
1910లో నాలుగు బ్రిటిష్ కాలనీలను విలీనం చేసి దక్షిణాఫ్రికా ఏర్పాటు చేసిన సమయంలో రాజధాని విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. అందుకే ఒక్కో శాఖను ఒక్కో ప్రాంతంలో ఏర్పాటు చేశారు.
అయితే, కాన్బెర్రా లేదా బ్రసిలియాల్లో రాజధాని ఏర్పాటు చేయాలంటూ 1994లో జరిగిన ఒక ఉద్యమం రాజధాని వివాదాన్ని మళ్లీ రేకెత్తించింది. కానీ, రాజధానులు మారలేదు.
ఫొటో సోర్స్, Reuters
అస్తానా.. ఒక వ్యక్తి కలల నగరం
4. పాలకుల విచక్షణాధికారం
1997లో అస్తానా నగరం కజకిస్తాన్ రాజధానిగా మారింది. 1991 నుంచి పాలించిన ఆ దేశ అధ్యక్షుడు నూర్సుల్తాన్ నజర్బయేవ్ ఏరికోరి ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించారు. ఇది ఆయన మానస పుత్రిక లాంటి ప్రాజెక్టు.
ఇక్కడ నార్మన్ ఫోస్టర్ డిజైన్ చేసిన ప్యాలెస్ ఆఫ్ పీస్ అండ్ హార్మొనీ, గ్లాస్ పిరమిడ్, 1500 సీట్ల సామర్థ్యం ఉన్న ఒపెరా హౌజ్ ఉన్నాయి.
ఈ నగరాన్ని గతంలో అక్మోలా అని పిలిచే వారు. అక్మోలా అంటే తెల్లని శ్మశానం అని వారి భాషలో అర్ధం. అందుకే దాన్ని అస్తానాగా మార్చారు.
గ్లాస్ పిరమిడ్ కజకిస్తాన్ సంస్కృతికి అద్దం పడుతుంది.
అత్యద్భుత కొత్త రాజధానిలో జనాలు కరవు
ఇప్పుడు మయన్మార్‌గా పిలుస్తున్న ఒకప్పటి బర్మా రాజధాని నాప్యీడా కూడా ఎక్కడో మారుమూల ఉన్నట్లు ఉంటుంది. లండన్ కంటే నాలుగు రెట్లు పెద్దగా ఉంటుంది.
2005లో నాప్యీడా నిర్మించారు. 20వరుసల రహదారులు, విలాసవంతమైన హోటళ్లు, విశాలమైన గోల్ఫ్ కోర్స్, ఎటుచూసినా ఆహ్లాదకరమైన పార్కులు ఉన్నాయి.
ఇన్ని సౌకర్యాలు కల్పించినా జనాలు అతి కొద్ది మంది మాత్రమే అక్కడ ఉంటున్నారు.
దేశ ఆర్థిక రాజధాని యాంగాన్ నగరంలోనే ఎక్కువ మంది ఉంటున్నారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)