ఆస్కార్ 2018: ఎవరి చేతుల్లో మెరవనుందో!

  • 10 డిసెంబర్ 2017
ఆస్కార్ అవార్డ్ Image copyright Carlo Allegri

మరో మూడు నెలల్లో ఆస్కార్ వేడుకలు. ఈసారి జరగబోయే వేడుకలకు ఓ ప్రత్యేకత ఉంది. నిరుడు చప్పగా నడిచిన ఆస్కార్ అవార్డ్ ప్రదానోత్సవం ఈసారి ఉత్కంఠంగా సాగనుంది. అందుకు కారణం హేమాహేమీలు నటించిన, దర్శకత్వం వహించిన సినిమాలు బరిలో నిలవడమే.

2016లో 'లా.. లా... ల్యాండ్' సినిమాను ఆస్కార్ వరిస్తుందని అందరూ భావించారు. సినిమాల మధ్య పోటీ తక్కువగా ఉండటం కూడా అందుకు కారణం. కానీ అలా జరగలేదు. కారణాలు ఏవైనా.. ప్రస్తుత పరిస్థితులు అలా లేవు. ఆస్కార్‌ను సొంతం చేసుకునేందుకు చాలా సినిమాలే పోటీ పడుతున్నాయి.

'నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ' లాంటి విమర్శకుల బృందం ఆస్కార్ అవార్డ్ ఎంపిక ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తోంది. 2018 ఆస్కార్ అవార్డులకు ఎంపికైన సినిమాలపై వీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే సినిమాల మధ్య గట్టి పోటీ ఉందనే అర్థం. విభిన్న అంశాలకు చెందిన కథా వస్తువులు బరిలో ఉన్నాయనే అర్థం.

2018 ఆస్కార్ బరిలో ఉన్న సినిమాలు

'డన్‌కర్క్'

క్రిస్టొఫర్ నోలన్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆస్కార్ బరిలో ముందువరుసలో ఉందని చెప్పవచ్చు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా, చరిత్రలో జరిగిన కీలక సంఘటనలను కళ్లకు కడుతుంది.

Image copyright Warner Bros

సానుకూలం :డన్‌కర్క్ సినిమా ప్రేక్షకులతోపాటు విమర్శకులనూ మెప్పించింది.

ప్రతికూలం :ఈ సినిమా ఇప్పటికే 'లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్' నుంచి బెస్ట్ ఎడిటింగ్ అవార్డును పొందింది. కానీ న్యూయార్క్ ప్రాంతంలో ఈ సినిమాకు ఆదరణ లభించలేదు.

అవకాశాలు : ఈ సినిమా 'ఉత్తమ చిత్రం'గా ఎంపికవ్వడానికి అవకాశాలున్నాయి. దీంతోపాటు బెస్ట్ డైరెక్టర్ అవార్డును కూడా పొందొచ్చు. కానీ క్రిస్టొఫర్ నోలన్‌ డైరెక్షన్ కేటగిరీలో ఇంతవరకూ ఒక్కసారి కూడా ఆస్కార్ నామినేషన్ పొందలేదు.

' పోస్ట్'

'స్టీవెన్ స్పీల్‌బర్గ్' దర్శకత్వం వహించిన సినిమా ద పోస్ట్. 'టామ్ హాంక్స్' 'మెరిల్ స్ట్రీప్' ప్రధాన పాత్రల్లో నటించారు. యుద్ధం నేపథ్యంలో మీడియా స్వేచ్ఛ ఈ సినిమాలోని ప్రధానాంశం. ఈ సినిమా ఆస్కార్ వేడుకల్లో అందర్నీ ఆకట్టుకోనుంది.

Image copyright Entertainment One

సానుకూలం :'నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ' ఇప్పటికే ఈ సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించింది. ఉత్తమ చిత్రంతోపాటుగా ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటి అవార్డులనూ ఈ సినిమాకే ఇవ్వాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ప్రతికూలం : న్యూయార్క్ ప్రజలు, లాస్ ఏంజెల్స్ విమర్శకుల నుంచి ఎటువంటి సానుకూలతనూ ఈ సినిమా సాధించలేకపోయింది.

అవకాశాలు : ఒకవైపు మెరిల్ స్ట్రీప్.. మరోవైపు టామ్ హాంక్స్.. ఇద్దరూ ఇద్దరే! ఈ మధ్యకాలంలో ఆస్కార్‌కు దూరమైన టామ్ హాంక్స్‌కు ఈసారి ఆస్కార్ లభించే అవకాశం ఉంది. ఇక మెరిల్ స్ట్రీప్ విషయానికొస్తే.. సహజంగానే ఆమెకు ఆస్కార్ రాదని ఎవరూ భావించరు!

'త్రీ బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి'

ఈచిత్రంలో 'ఫ్రాన్సెస్ మెక్‌డొనాల్డ్' అద్భుతమైన నటన కనబరిచారు. ఇది ఓ హాస్యకథ అయినా అంతర్లీనంగా ఓ ట్రాజెడీ కథ. ఇందులో విషాదాన్ని గొంతులో దిగమింగుకున్న తల్లిలా ఫ్రాన్సెస్ అద్భుతంగా నటించారు.

Image copyright Twentieth Century Fox

సానుకూలం : 'టోరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌'లో ఈ సినిమా 'ఆడియన్స్ అవార్డు'ను గెలుపొందింది. దీంతో.. ఈ సినిమాకు మరిన్ని అవార్డులు వచ్చే అవకాశాలు బలపడినట్లే.

ప్రతికూలం : అమెరికా ప్రేక్షకుల నుంచి ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశం ఆస్కార్ అవార్డ్ గెలుపొందే అవకాశాలను బలహీనపరుస్తోంది.

అవకాశాలు : ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డులు గెలుపొందే అవకాశం ఉంది. ఇక ఫ్రాన్సెస్ మెక్‌డొనాల్డ్ ఆస్కార్ బరిలో హాట్‌ ఫేవరెట్‌.

'కాల్ మి బై యువర్ నేమ్'

ఇద్దరు వ్యక్తుల మధ్య నడిచే సున్నితమైన ప్రేమ కథ ఈ సినిమా. ఇటలీ నేపథ్యంలో కథ సాగుతుంది.

Image copyright Sony

సానుకూలం :లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్ అసోసియేషన్ ఉత్తమ చిత్రంగా ప్రకటించింది.

ప్రతికూలం : అనేక కేటగిరీలలో ఈ సినిమా తన ప్రతిభను కనబరిచింది. కానీ ఆస్కార్ బరిలో మాత్రం ముందు వరుసలో నిలవలేదు. తిమోథీ ఛాలమెత్ నటనకు అవార్డు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

అవకాశాలు :ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేట్ కావచ్చు. మరోవైపు 'గేరీ ఓల్డ్‌మన్‌'కు బెస్ట్ యాక్టర్ అవార్డ్ దక్కే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అతనితో ఎవరైనా పోటీ పడగలరంటే.. అది ఛాలమెత్ మాత్రమే!

'లేడీ బర్డ్'

యుక్తవయసుకు వచ్చిన ఓ అమ్మాయి కథ లేడీ బర్డ్. 'సర్షా రోనన్' కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకు 'గ్రెటా గెర్విగ్' దర్శకురాలు.

Image copyright Universal

సానుకూలం :మంచి విమర్శలను సంపాదించిన చిత్రం లేడీ బర్డ్. 'రాటెన్ టొమాటోస్' వెబ్‌సైట్ ఈ సినిమాకు 100శాతం రేటింగ్ ఇచ్చింది.

ప్రతికూలం :ఆస్కార్ అకాడమీ అవార్డు ఓటర్లు సాధారణంగా ఉత్తమ చిత్రం విషయంలో విమర్శకుల అభిప్రాయంతో ఏకీభవించరు.

అవకాశాలు : నటుల మధ్య గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో కూడా 'సర్షా రోనన్'కు ఉత్తమ నటి అవార్డు దక్కే అవకాశాలున్నాయి. ఇక సర్షాకు తల్లి పాత్రలో నటించిన 'లోరీ మెట్‌కాఫ్' 'ఉత్తమ సహాయ నటి' బరిలో ఉన్నారు.

'ద షేప్ ఆఫ్ వాటర్'

ఓ మూగ యువతి, నీటిలో ఉండే ఓ ప్రాణికి మధ్య నడిచే లోకాతీతమైన కల్పిత గాథ ద షేప్ ఆఫ్ వాటర్ సినిమా. యువతి పాత్రలో 'సాల్లీ హాకిన్స్' నటించారు.

Image copyright Twentieth Century Fox

సానుకూలం :'వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్'లో ప్రిమియర్ షోను ప్రదర్శించినపుడు ద షేప్ ఆఫ్ వాటర్ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.

ప్రతికూలం :ప్రధాన స్రవంతి సినిమాలకు ఆమడ దూరంలో ఉండటంతో ఈ సినిమాకు ఎక్కువ అవార్డులు దక్కడం అనుమానమే.

అవకాశాలు :'సాల్లీ హాకిన్స్' ఉత్తమ నటి అవార్డు రేసులో ఉన్నప్పటికీ హాట్ ఫేవరెట్ మాత్రం ఫ్రాన్సెస్ మెక్‌డొనాల్డ్.

'గెట్ ఔట్'

దురదృష్టవశాత్తూ ఓ ఆపదలో చిక్కుకుపోయే 'క్రిస్ వాషింగ్టన్' పాత్రలో లండన్‌కు చెందిన 'డేనియల్ కలూయా' నటించారు.

Image copyright Universal

సానుకూలం :ఈ సినిమా భారీ వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయ్యింది. ఈ అంశం అవార్డ్ సాధించడంలో తోడ్పడుతుంది.

ప్రతికూలం :ఈ సినిమా చాలా ముందుగా రిలీజ్ అవ్వడంతో మరుగున పడిపోయింది.

అవకాశాలు : 'జోర్డన్ పీల్' స్క్రీన్‌ప్లే పలువుర్ని ఆకట్టుకుని గుర్తింపు సంపాదించింది. ఆస్కార్‌ 'ఉత్తమ చిత్రం' విభాగంలో ఓ పది సినిమాలను నామినేట్ చేస్తే.. అందులో తప్పకుండా ఈ సినిమా చోటు సంపాదించుకుంటుంది.

'డార్కెస్ట్ అవర్'

'విన్‌స్టంట్ చర్చిల్' పాత్రలో గేరీ ఓల్డ్‌మన్ నటించారు.

Image copyright Universal

సానుకూలం :విస్‌స్టంట్ చర్చిల్ పాత్రలో గేరీ ఓల్డ్‌మన్ నటించారు. ఈయన నటనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరొచ్చింది.

ప్రతికూలం :విమర్శకుల మన్ననలు పొందడంలో ఈ సినిమా ఇంకా వెనుకబడే ఉంది.

అవకాశాలు : సినిమా ప్రీమియర్ దగ్గర నుంచి గేరీ ఓల్డ్‌మన్ ఆస్కార్ ఉత్తమ నటుడు విభాగంలో హాట్‌ఫేవరెట్‌గా నిలిచారు.

'ది ఫ్లోరిడా ప్రాజెక్ట్'

ఫ్లోరిడా జీవితాలను ఓ అమ్మాయి దృష్టికోణం నుంచి చిత్రించిన కథే ఈ సినిమా.

Image copyright Altitude Films

సానుకూలం : ఈ సినిమాకు సానుకూలమైన విమర్శలు దక్కాయి. ముఖ్యంగా.. ఈ సినిమాలో నటించిన చిన్నపిల్లల నటనకు ప్రశంసలు అందాయి.

ప్రతికూలం : ఓ మంచి సినిమాగా ఈ చిత్రాన్ని పరిగణించకుండా బహుశా.. గొప్ప నటనను ప్రదర్శించిన సినిమాగా ఈ చిత్రాన్ని పరిగణిస్తారేమో!

అవకాశాలు : ఉత్తమ సహాయ నటుల జాబితాలో 'విల్లెమ్ డిఫో' ముందు వరుసలో ఉన్నారు.

సినీ ప్రపంచం ప్రతి ఏటా ఆసక్తిగా ఎదురు చూసే సందర్భం ఆస్కార్ వేడుకలు. ఈ కార్యక్రమం మార్చి 4, 2018న జరుగనుంది.

ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాల మధ్య పోటీ విషయంలో పరిస్థితులు గత సంవత్సరం కంటే భిన్నంగా కన్పిస్తున్నాయి.

ఈ ఉత్కంఠకు తెరపడాలంటే ఇంకా మూడు నెలలు వేచి చూడాల్సిందే.!

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)