సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్: టీచర్లు లేని దేశం
- అలెక్స్ డువల్ స్మిత్
- బీబీసీ ఆఫ్రికా ప్రతినిధి

స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతున్న 'రైతు'
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో నాలుగేళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా అక్కడి విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. రానురాను పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారుతుండటంతో స్కూల్ టీచర్లంతా ఉద్యోగాలు మానేశారు. దాంతో తల్లిదండ్రులే పాఠశాలలు నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అపొల్లినైర్ జవొరో. వృత్తి వ్యవసాయం. ఇన్నాళ్లూ పొలంలో పనిచేసుకునే ఆయన, ఇప్పుడు స్కూల్లో పిల్లలకు అక్షరాలు నేర్పుతున్నారు.
దేశ రాజధానికి 25 కిలోమీటర్ల దూరంలోనే వీళ్ల ఊరుంది. అయినా టీచర్లు ఎవరూ రావడంలేదు. దాంతో మూడు నెలలుగా ఆ ఊరిలోని ప్రాథమిక పాఠశాలకు ఈయనే పెద్దదిక్కుగా మారారు.
స్కూలు మూతపడితే భావితరాల జీవితాలు అంధకారమవుతాయన్న విషయాన్ని గ్రహించిన ఆయన, 105 మంది పిల్లలకు విద్యాబుద్ధులను నేర్పేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఇది తరగతి గదే ఇలా తయారైంది
2013 నుంచి సాగుతున్న అంతర్గత పోరు కారణంగా దేశంలో పాలన స్థంభించింది. ఆస్పత్రులు, పోలీసు స్టేషన్లు, విద్యా సంస్థలు అన్నీ చిన్నాభిన్నమయ్యాయి.
దాదాపు 23 లక్షల మంది (దేశ జనాభాలో సగం) వైద్యం కోసం ఎదురుచూస్తున్నారని ఐక్యరాజ్య సమితి అంటోంది.
దేశంలోని దాదాపు 80 శాతం ప్రాంతాల్లో సాయుధ బలగాలు నిత్యం పహారా కాస్తున్నాయి.
పాఠశాల భవనాలే సైన్యానికి బేస్ క్యాంపులుగా మారుతున్నాయి. ఆట స్థలాలు ఫైరింగ్ రేంజ్‌లు అయ్యాయి.
స్కూళ్లలోని బల్లలను, కుర్చీలను సైన్యం వంట చేసుకునేందుకు కాల్చేశారు. బాంబు పేలుళ్లతో అనేక భవనాలు శిథిలాలుగా మారాయి.
దేశ రాజధానికి వెలుపల బ్యాంకులు లేవు. రవాణా సౌకర్యాలూ లేవు. జీతాలు తీసుకునే పరిస్థితి లేదు. దాంతో దాదాపు 14,000 మంది టీచర్లు ఉద్యోగాలకు స్వస్థి పలికారు.
అయితే, ఎలాగైనా పిల్లలకు చదువును దూరం చేయొద్దన్న ఆలోచనతో 500 మంది పేరెంట్ టీచర్లకు ఓ స్వచ్ఛంద సంస్థ శిక్షణ ఇచ్చింది.
మరో 8,000 మంది తల్లిదండ్రులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. చదువుకున్న వాళ్లు దొరకకపోవడం ఇబ్బందిగా మారింది.
"వ్యవసాయం చేసే నేను, దేశ భవిష్యత్తు నాయకులకు చదువు చెబుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకొన్న గొప్ప స్థాయిక వాళ్లంతా ఎదగాలని కోరుకుంటున్నా" అని అంటున్నారు ఈ టీచర్.
ఇలా పెద్దమనసుతో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ముందుకొచ్చిన జవొరోతో పాటు, మరో ముగ్గురికి గౌరవ వేతనంగా నెలకు రూ. 4191 యూనిసెఫ్ ఇస్తోంది.
'పేరెంట్ టీచర్ల' చొరవతో కొన్ని గ్రామాల్లో చిన్నారులు తిరిగి బడిబాట పడుతున్నారు. అయితే ఈ మార్పు చైతన్యవంతులున్న గ్రామాల్లో మాత్రమే కనిపిస్తోంది.
చాలా గ్రామాల్లో చదువు తీవ్ర సంక్షోభంలోనే ఉంది. ప్రస్తుతం దేశంలో ఎంత మంది చిన్నారులు స్కూలుకెళ్తున్నారన్న సమాచారమూ లేదు.
పాములతో సహవాసం
2016 వరకు దాదాపు మూడేళ్లు మిలిటెంట్లు ఎప్పుడు విరుచుకుపడతారో అన్న భయంతో సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉండేది.
" మిలిటెంట్ల అలికిడి వినిపించగానే చెట్లు, పుట్టల వెంట పరుగులు పెట్టేవాళ్లం. చెట్ల పొదల్లో, పాములతో సహవాసం చేస్తూ భయంతో, తిండి లేకుండా దాక్కునేవాళ్లం. అయినా, ఇప్పటికీ ప్రాణాలతో ఉన్నామంటే మా అదృష్టమే" అని జవొరో స్థానిక పరిస్థితులను గుర్తుచేసుకున్నారు.
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళం
ఐక్యరాజ్య సమితి పంపిన బలగాలు రాజధాని నగరం బాంగీలో భద్రత కల్పించేందుకే పరిమితమయ్యాయి. దాంతో ఫాస్టిన్ అఖాంజ్ టడేరా నేతృత్వంలోని ప్రభుత్వం భద్రంగానే ఉంది.
మిగతా ప్రాంతాల్లో మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. క్రైస్తవ వ్యతిరేక తీవ్రవాద సంస్థ సెలెకా, క్రైస్తవ అనుకూల మిలిటెంట్ గ్రూపు యాంటీ- బలాకా మధ్య అనేకసార్లు పరస్పర దాడులు జరిగాయి.
స్థానిక వనరులను స్వాధీనం చేసుకునేందుకు ఇరువర్గాల మధ్య పోరు నిత్యం జరుగుతూనే ఉంది.
ఫొటో సోర్స్, Zack Baddorf
బాంబు దాడుల్లో ధ్వంసమైన పాఠశాల భవనం
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఏం జరిగింది?
- ముస్లిం మిలీషియా గ్రూపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2013లో తిరుగుబాటు చేసింది.
- 'యాంటీ బలక' అనే క్రిస్టియన్ మిలిటెంట్ గ్రూప్ ప్రతి దాడులను ప్రారంభించింది.
- ఇరు వర్గాల మధ్య సాగిన పోరులో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది వలస వెళ్లారు.
- సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో పరిణామాలు ఒక జాతి నిర్మూలనకు దారితీస్తున్నాయంటూ ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది.
- దాదాపు 13,000 మందితో కూడిన ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో పనిచేస్తున్నాయి.
- ఐరాస శాంతి పరిరక్షక దళాలపైనా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)