లెబనాన్‌లో అమెరికా కార్యాలయం ఎదుట నిరసనలు

  • 10 డిసెంబర్ 2017
లెబనాన్‌లో అమెరికా రాయబార కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న కొందరు నిరసనకారులు Image copyright EPA
చిత్రం శీర్షిక రాయబార కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న కొందరు నిరసనకారులు

జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై లెబనాన్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.

లెబనాన్ రాజధాని బీరుట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద నిరసనకారులు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. రాయబార కార్యాలయానికి సమీపంలోని వీధుల్లో నిరసనకారులు రాళ్లు రువ్వారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది బాష్పవాయు గోళాలు ప్రయోగించారు.

కంచెను దాటుకొని రాయబార కార్యాలయ కాంప్లెక్సులోకి ప్రవేశించేందుకు కొందరు ఆందోళనకారులు యత్నించారని లెబనాన్ మీడియా పేర్కొంది.

Image copyright AFP
చిత్రం శీర్షిక అమెరికా రాయబార కార్యాలయం వద్ద ఆందోళనలు

నిరసనకారులను ఉద్దేశించి లెబనాన్ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు హన్నా ఘారిబ్ మాట్లాడుతూ- ''అమెరికా పాలస్తీనాకు శత్రువు'' అని ఆరోపించారు.

లెబనాన్‌లో వేల సంఖ్యలో పాలస్తీనా శరణార్థులు ఉన్నారు.

ఇండొనేషియా రాజధాని జకార్తాలోనూ అమెరికా రాయబార కార్యాలయం వెలుపల వేల మంది నిరసన ప్రదర్శలు నిర్వహించారు. ''పాలస్తీనా మా హృదయాల్లో ఉంది'' అనే బ్యానర్లను కొందరు ప్రదర్శించారు.

ట్రంప్ నిర్ణయంపై పాలస్తీనావాసులు, పాలస్తీనా మద్దతుదారులు మూడు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

అమెరికా నిర్ణయాన్ని అరబ్ లీగ్ ఇప్పటికే ఖండించింది. మధ్యప్రాచ్యంలో శాంతి సాధన ప్రక్రియలో అమెరికాపై ఇక ఆధారపడలేమని వ్యాఖ్యానించింది.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)