జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా ఒప్పుకోం: యూరోపియన్ యూనియన్

  • 12 డిసెంబర్ 2017
ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు, యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ ఫెడరికా మోగెరినీ Image copyright Reuters

జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించడానికి యూరోపియన్ యూనియన్ తిరస్కరించింది. శాంతి ఒప్పందానికి తుదిరూపునిచ్చే వరకూ తమ సభ్య దేశాలేవీ ఇందుకు అంగీకరించబోవని యూరోపియన్ యూనియన్ (ఈయూ) విదేశాంగ విధానం చీఫ్ ఫెడరికా మోగెరినీ అన్నారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహుతో భేటీ తర్వాత ఫెడరికా మోగెరినీ ఈ ప్రకటన చేశారు. ఈ వ్యవహారంలో అమెరికా వైఖరినే ఈయూ అనుసరించాలని నెతన్యాహు కోరుకుంటున్నారు.

Image copyright Getty Images

బ్రసెల్స్‌లో నెతన్యాహూతో సమావేశం అయిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, 'జెరూసలెంపై అంతర్జాతీయ ఒప్పందానికి' తమ గుర్తింపు కొనసాగుతుందని ఫెడరికా మోగెరినీ స్పష్టం చేశారు.

"ఇరు పక్షాలూ నేరుగా సంభాషణలు జరిపి అంతిమ ఒప్పందానికి వచ్చే వరకూ యూరోపియన్ యూనియన్, దాని సభ్య దేశాలన్నీ అంతర్జాతీయ ఒప్పందాన్ని గౌరవించడానికే కట్టుబడి ఉంటాయి" అని ఆమె తెలిపారు.

Image copyright Getty Images

అమెరికా అంగీకారం ఒక 'వాస్తవికత'

అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహు మాట్లాడుతూ, జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తింపునివ్వడం ఓ 'వాస్తవికత' అని అభివర్ణించారు.

జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసినప్పటి నుంచీ అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే.

Image copyright EPA
చిత్రం శీర్షిక గాజాలో నిరసన ప్రదర్శనలు

అమెరికా అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా మధ్య ప్రాచ్యంలోని అనేక దేశాల్లో మొదలైన నిరసన ప్రదర్శనల పరంపర ఇంకా కొనసాగుతోంది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాకిస్తాన్‌లో నిరసన ప్రదర్శనలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)