న్యూయార్క్‌లో దాడి యత్నం: బంగ్లాదేశీయుడి అరెస్ట్

  • 12 డిసెంబర్ 2017
బాంబు పేలుడు ఘటన తర్వాత పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్ వద్ద పోలీసు భద్రత Image copyright Getty Images
చిత్రం శీర్షిక పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్‌కు వెళ్లే సబ్‌వేలో బాంబు పేలుడులో అనుమానితుడు సహా నలుగురు గాయపడ్డారు

అమెరికాలోని న్యూయార్క్ నగర ప్రధాన బస్ టెర్మినల్ వద్ద బాంబు దాడికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సోమవారం ఉదయం రద్దీ సమయంలో మన్‌హటన్‌లోని పోర్ట్ అథారిటీ టెర్మినల్ వద్ద బాంబు పేలుడుతో న్యూయార్క్ నగరం ఉలిక్కిపడింది.

ఈ ఘటనకు సంబంధించి బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన అకాయేద్ ఉల్లా అనే 27 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అతడు తన శరీరానికి ‘లో-టెక్ పేలుడు పరికరా’న్ని అమర్చుకుని పేల్చుకున్నాడని.. ఆ పేలుడులో అతడు గాయపడ్డాడని అధికారులు చెప్పారు. సబ్‌వేలో జరిగిన ఈ పేలుడులో మరో ముగ్గురు కూడా స్వల్పంగా గాయపడ్డారు.

Image copyright CBS
చిత్రం శీర్షిక 27 ఏళ్ల అకాయేద్ ఉల్లా బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చాడు

ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత రద్దీ బస్ టెర్మినల్ ఇది. ఏటా 6.5 కోట్ల మందికి సేవలందిస్తుంది. ఈ ఘటనతో పరిసరాల్లోని సబ్‌వే స్టేషన్ల నుంచి ప్రజలను ఖాళీచేశారు. పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

ఉదయం 07:30 గంటలకు ఈ పేలుడు సంభవించిందని ఆండ్రీ రోడ్రిగ్ (62) న్యూయార్క్ టైమ్స్ పత్రికకు తెలిపారు.

‘‘దాదాపు 60 మంది జనం పరిగెడుతుండటం చూశాను. అందరూ ఎంతగా భయపడిపోయారంటే పడిపోయిన ఒక మహిళకు సాయం చేయటం కోసం ఎవరూ ఆగలేదు’’ అని మరో ప్రత్యక్ష సాక్షి అలీస్యా వ్లోద్కోవ్‌స్కీ రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.

అకాయేద్ ఉల్లాగా చెప్తున్న వ్యక్తి పేలుడులో దుస్తులు చినిగిపోయి, శరీరం పైభాగం రక్తమోడుతూ నేలపై పడివున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

అతడు ఒంటరిగానే ఈ దాడికి ప్రయత్నించినట్లు భావిస్తున్నామని నగర మేయర్ బిల్ డి బ్లాసియో పేర్కొన్నారు.

న్యూయార్క్ సిటీలోని బ్రూక్లిన్‌లో అనుమానితుడు అకాయేద్ ఉల్లా ఇంటిని పోలీసులు సోదా చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

అతడు 2011లో ఫ్యామిలీ వీసాతో అమెరికాకు వలస వచ్చాడు. తమ దేశంలో అతడికి ఎలాంటి నేర చరిత్రా లేదని బంగ్లాదేశ్ పేర్కొంది. అతడు గత సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ వెళ్లివచ్చాడు.

అతడు ఇటీవలి వరకూ ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేసి ఉండొచ్చని న్యూయార్క్ పోస్ట్ కథనం చెప్తోంది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక బాంబు పేలుడు అనంతరం న్యూయార్క్ నగరంలోని పలు ప్రాంతాలను పోలీసులు మూసివేశారు

వలస విధానంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ఆంక్షలు ఇప్పటికే అమలులోకి వచ్చివున్నట్లయితే ‘‘ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తి దేశంలోకి అడుగుపెట్టగలిగేవాడే కాదు’’ అని అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికార ప్రతినిధి సారా సాండర్స్ పేర్కొన్నారు.

‘‘వలస సంస్కరణల విషయంలో, మన జాతీయ రక్షణ, ప్రజా భద్రతల విషయంలో అధ్యక్షుడితో కలిసి కాంగ్రెస్ పనిచేయాల్సిన అవసరాన్ని ఈ దాడి బలంగా చెప్తోంది’’ అని ఆమె సోమవారం మీడియాతో వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక న్యూయార్క్‌లో 2017 అక్టోబర్‌లో ట్రక్కుతో జరిపిన ఉగ్రదాడిలో ఎనిమిది మంది చనిపోయారు

న్యూయార్క్‌లో ఇటీవలి ఉగ్రవాద ఘటనలు

  • అక్టోబర్ 2017: ఉజ్బెకిస్తాన్ నుంచి వలస వచ్చిన ఒక వ్యక్తి ట్రక్కును పాదచారులపైకి నడిపాడు. ఆ దాడిలో ఎనిమిది మంది చనిపోయారు. అతడిపై హత్య, ఉగ్రవాదం అభియోగాలు మోపి విచారిస్తున్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడి తర్వాత న్యూయార్క్ పై జరిగిన భారీ దాడి ఇదే.
  • మార్చి 2017: మన్‌హటన్‌లో ఒక నల్లజాతీయుడిని శ్వేతజాతీయుడైన అమెరికా మాజీ సైనికుడొకరు కత్తితో పొడిచి చంపాడు. ఆఫ్రికన్ అమెరికన్లను తాను ద్వేషిస్తానని అతడు పేర్కొన్నాడు. అతడిపై ఉగ్రవాద చర్యగా హత్య అభియోగం నమోదు చేశారు.
  • సెప్టెంబర్ 2016: ఒక అఫ్ఘాన్-అమెరికన్ వ్యక్తి న్యూయార్క్, న్యూజెర్సీల్లో ప్రెషర్ కుకర్ బాంబులు పెట్టాడు. అతడిపై పోలీసులు కాల్పులు జరుపగా.. అతడు కోలుకుని కోర్టులో విచారణను ఎదుర్కొంటున్నాడు.
  • అక్టోబర్ 2014: ముస్లిం మతానికి మారిన ఒక వ్యక్తి ఇద్దరు పోలీసు అధికారులపై కత్తితో దాడి చేయటంతో పోలీసులు అతడిని కాల్చి చంపారు. అతడిది ‘ఉగ్రవాద చర్య’ అని పోలీసులు పేర్కొన్నారు.
  • మే 2010: నగరంలో అత్యంత రద్దీగా ఉండే పర్యాటక ప్రాంతం టైమ్స్ స్క్వేర్‌లో పోలీసులు ఒక కారు బాంబును గుర్తించి నిర్వీర్యం చేశారు. ఆ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన అమెరికా పౌరుడు ఒకరిని అరెస్ట్ చేయగా.. కోర్టు అతడికి అదే ఏడాది జీవిత ఖైదు విధించింది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కుల్‌భూషణ్ జాధవ్: పాకిస్తాన్ అరెస్ట్ చేసిన భారత పౌరుడి కేసులో నేడు అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు... ఇప్పటివరకూ ఏం జరిగింది

తిరుమల: వీఐపీ బ్రేక్ దర్శనాలు ఏమిటి.. దీని మీద వివాదం ఎందుకు

బిహార్ వరదల్లో మునగడానికి భారత్, నేపాల్ మధ్య గొడవలే కారణమా

అనంతపురం హత్యలు: గురుపౌర్ణిమ రోజు గుప్తనిధుల కోసమే ఈ హత్యలు చేశారా

ప్రెస్‌ రివ్యూ: ‘కాపులు బీసీలా.. ఓసీలా చంద్రబాబే చెప్పాలి’

ముంబయి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం... 12 మంది మృతి

ధోనీ కూడా రిటైర్మెంట్ విషయంలో సచిన్, కపిల్ దేవ్‌ల దారిలోనే వెళ్తున్నాడా

"ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా" విశ్వభూషణ్ హరిచందన్