బెంగళూరు: టెకీ పెళ్లిలో బిట్ కాయిన్ బహుమతులు

  • 13 డిసెంబర్ 2017
ప్రశాంత్, నీతి శ్రీ Image copyright Kashif Masood

బెంగళూరులో జరిగిన ఒక టెక్కీ జంట వివాహం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇదేమి ప్రత్యేక వివాహం కాదు. సాంప్రదాయ వివాహం. కాకపొతే ఈ పెళ్ళికి బహుమతులే ఆకర్షణగా నిలిచాయి. ఈ పెళ్ళికి వచ్చిన అతిధుల చేతుల్లో గిఫ్ట్ ప్యాకెట్ లు కనిపించలేదు.

బెంగుళూరులో జరిగిన ఈ వివాహానికి విచ్చేసిన అతిధులు వధూవరులకు క్రిప్టో కరెన్సీ ని బహుమతులుగా ఇచ్చారు. ఇది అతిధుల నిర్ణయం కాదు.

బెంగుళూరు కి చెందిన ప్రశాంత్ శర్మ (28 ) , నీతి శ్రీ (28 ) ఈ వారాంతం లో బెంగుళూరులో వివాహం చేసుకున్నారు.

ప్రశాంత్, నీతి, బెంగుళూరు లో ఒక స్టార్ట్ అప్ కంపెనీని నడుపుతున్నారు.

ప్రశాంత్ జంషెడ్‌పూర్, నీతి, పాట్నాకు చెందినవారు. పెళ్లికి 190 మంది అతిధులు హాజరయ్యారు. అయితే వీరిలో కేవలం 15 మంది మాత్రమే సాధారణ బహుమతులు ఇచ్చారు.

మిగిలిన అందరూ క్రిప్టో కరెన్సీ ని బహుకరించారని , ప్రశాంత్ బీబీసీ కి చెప్పారు.

"ఈ బహుమతుల విలువ నేను బయటకు చెప్పలేను కానీ, సుమారు లక్ష రూపాయిల విలువ చేసే బహుమతులు లభించాయి".

బెంగుళూరు లాంటి పెద్ద నగరంలో బహుమతి ఎంపికకి అతిధులు ఇబ్బంది పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

మా స్నేహితులు చాలా మంది టెక్నాలజీ రంగం లో పని చేస్తున్నారు. అందుకు మేము బహుమతులను టెక్నాలజీ తో అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నాం. మా తల్లి తండ్రులకి ఈ విషయం చెప్పినపుడు వాళ్ళు కూడా మా నిర్ణయానికి మద్దతు పలికారు అని తెలిపారు.

Image copyright Kashif Masood

"బిట్ కాయిన్ లతో పాటు మేము సాంప్రదాయ బహుమతి కూడా ఇచ్చామని" పెళ్లికి హాజరయిన ఒక అతిధి చెప్పారు.

"ఇది చాలా వినూత్న బహుమతి. నీతి ప్రశాంత్ ఇటువంటి బహుమతులు తీసుకోవాలని బిట్ కాయిన్ ల విలువ పెరిగాక తీసుకున్నది ఏమి కాదు. ఈ తరహాలో బహుమతులు తీసుకోవాలని వాళ్ళు ఒక 2 నెలల ముందే నిర్ణయించుకున్నారు" అని ఐం హై సీఈఓ, నీతి పాత బాస్ ఎన్ రవి శంకర్ చెప్పారు. ఈయన కూడా బిట్ కాయిన్ లను బహుమతి ఇచ్చిన వారిలో ఒకరు.

ఒక ప్రైవేట్ బిట్ కాయిన్ ఎక్స్చేంజి ప్రతినిధులు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొని, అతిధులకు పెట్టుబడి విధానాలు వివరించడం ఈ పెళ్ళిలో మరో విశేషం.

బడుగు వర్గాల పిల్లల చదువు కోసం బహుమతులు

Image copyright Kashif Masood

క్రిప్టో కరెన్సీ విలువ ఒక్క సారిగా పెరగడం వలన ఇది ఎక్కువ కాలం నిలవదని వార్తలు వచ్చాయని, కానీ తనకి బిట్ కాయిన్ల నుంచి సంపాదించాలని ఉద్దేశ్యం ఏమి లేదని ప్రశాంత్ తెలిపారు.

"ఏ వస్తువునైనా మళ్ళీ అమ్మాలనే ఉద్దేశ్యం తో కొంటే మార్కెట్ లో బబుల్ తయారు అవుతుంది. కానీ మేము బిట్ కాయిన్ లను భవిష్యత్ లో ఎలా పని చేస్తాయో చూడాలనే ఉద్దేశ్యం తో తీసుకున్నామని, పేర్కొన్నారు. ముఖ్యం గా బ్లాక్ చైన్ టెక్నాలజీ పై మాకు చాలా ఆసక్తి కలిగించింది" అని అన్నారు.

"మాకు ఇలా వచ్చిన బహుమతులను మేము బడుగు వర్గాల పిల్లల చదువు కి ఇద్దామనుకుంటున్నాం. విద్య దేశం లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని మా నమ్మకం" అని నీతి చెప్పారు

బిట్ కాయిన్ ల పై ప్రభుత్వం పెట్టే నిబంధనల గురించి ఈ జంట పెద్దగా ఆలోచించటం లేదు. "మార్కెట్ లోకి వచ్చే ఎటువంటి కొత్త టెక్నాలజీ అయినా కేంద్రీకృత విధానాలను సరళం చేయాలని అనుకుంటుంది. ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచం లో ఉన్న ప్రభుత్వాలన్నీ వీటి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవాలి" అని ప్రశాంత్ అన్నారు.

Image copyright Alamy

"బిట్ కాయిన్ వాడకం, నిర్వహణ లో పారదర్సకత లేదని రెగ్యులేటర్లు భావిస్తున్నారు. చాలా దేశాల ప్రభుత్వాలు ఈ విధానం పట్ల సుముఖుత వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పాటించాలని అనుకుంటున్నారు" , అని ఆర్ధిక వేత్త ప్రాంజల్ శర్మ అన్నారు

ఇందులో పెట్టుబడులు పెట్టేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సలహా ఇచ్చారు.

"బిట్ కాయిన్ లను ఇండియన్ కరెన్సీ లో కొని ప్రపంచ మార్కెట్ లో అమ్మడం ఎంత వరకు న్యాయ బద్ధమో ఆలోచించాలని" సైబర్ లా అడ్వొకేట్ అన్నారు. ఇలా చేయడం విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం నిబంధనలను వ్యతిరేకిస్తుందని అయన పేర్కొన్నారు.

బిట్ కాయిన్స్ కి భవిష్యత్ ఉంది. వీటి విషయం లో ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అని అన్నారు.

క్రిప్టో కరెన్సీ ని లీగల్ టెండర్ గా ఆమోదించమని రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా పెట్టుబడిదారులకు మూడవ సారి హెచ్చరిక చేసిన రెండు రోజులకే నీతి ప్రశాంత్ ల వివాహం జరగడం విశేషం.

ఇతర కథనాలు

బిట్‌కాయిన్లతో బిలియనీర్లయిపోగలమా?

బోయింగ్ 777 పిన్న పైలెట్.. బెజవాడ అమ్మాయే

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు