‘పారిస్ డీల్’కి అమెరికా తిరిగొస్తుంది: మాక్రోన్

  • 12 డిసెంబర్ 2017
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కరచాలనం చేస్తున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రోన్. Image copyright Reuters

వాతావరణ మార్పులపై పోరాడేందుకు చేసిన పారిస్ ఒప్పందంలోకి డొనాల్డ్ ట్రంప్ అమెరికాను మళ్లీ తీసుకువస్తారని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రోన్ అన్నారు.

కానీ ఈ ఒప్పందంలో నిబంధనలను సడలించాలన్న డొనాల్డ్ ట్రంప్ వాదనను ఒప్పుకోబోమని తెలిపారు.

వాతావరణ మార్పులపై మంగళవారం పారిస్‌లో సదస్సు జరిగింది.

ఈ సదస్సు అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ సి.బి.ఎస్. ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

వాతావరణ మార్పుల అంశంలో అంతర్జాతీయ ఒప్పందంపై అమెరికా సంతంకం చేసింది.

గతంలో ఆ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. ఈ వైఖరిని మాక్రోన్ ఖండించారు.

''పారిస్ ఒప్పందంపై అమెరికా ఇదివరకే సంతకం చేసింది. కానీ ఒప్పందం నుంచి వైదొలగింది. ఇది దూకుడు చర్య. ఈ అంశం గురించి మాట్లాడేందుకు ఇతరులకు అవకాశం కూడా ఇవ్వలేదు. అమెరికా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. కానీ కూటమి నుంచి బయటకు వెళ్లలేకపోయింది.'' అని మాక్రోన్ అన్నారు.

Image copyright AFP/Getty Images

భూతాపాన్ని పారిశ్రామిక విప్లవానికి ముందు రోజుల కంటే 2 సెంటిగ్రేడ్‌లు తగ్గించాలన్నది పారిస్ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం దిశగా ప్రపంచ దేశాలను నడిపించాలని మాక్రోన్ అభిలాష.

సి.బి.ఎస్.తో ఆయన మాట్లాడుతూ.. భూతాపం విషయంలో భవిష్యత్ తరాల ముందు తాను దోషిగా నిలబడాలని అనుకోవడంలేదన్నారు. అందుకే భూతాపం సమస్యను పరిష్కరించేందుకు ఓ చిన్న ప్రయత్నం చేస్తున్నానన్నారు.

మంగళవారం జరిగిన సమావేశంలో 50మంది సీనియర్ మంత్రులు, దేశాధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలోనైనా 'ఉద్గార ప్రమాణాల'ను తగ్గించే అంశంలో తగినంత ప్రోత్సాహం లభిస్తుందని శాస్త్రజ్ఞులు ఆశించారు.

ఆర్థిక రంగ కీలక అంశాల్లో కొన్ని ముఖ్యమైన ప్రకటనలు వెలువడనున్నాయి :

  • సౌర శక్తి, గాలి మరలతో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసుకునేందుకు పేద దేశాలకు ఆర్థిక సాయం చేయాలి.
  • కొత్తగా ఏర్పడే బొగ్గు గనులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయకూడదు.
  • సంస్థలు తమ శిలాజ ఇంధన నిక్షేపాలను వెల్లడించాలి. ఉద్గార ప్రమాణాలను తగ్గించేందుకు ప్రభుత్వాలు సిద్ధపడితే.. ఈ నిక్షేపాల విలువ కూడా తగ్గుతుంది.
Image copyright Getty Images

షిప్పింగ్ పరిశ్రమను నియంత్రించే మరో కీలక ప్రకటన కూడా వెలువడనుంది. ఇంతవరకూ బహుళజాతి విధానాలతో ఈ పరిశ్రమ.. వివిధ రకాల నిబంధనల నుంచి తప్పించుకుంటూ వస్తోంది.

రాత్రికి రాత్రి సంభవించిన ఈ పరిణామాలతో.. 'ఎక్సాన్' ఆయిల్ దిగ్గజ సంస్థ.. వాతావరణ మార్పుల ప్రభావం తన వ్యాపారంపై ఏవిధంగా ప్రభావం చూపిస్తుందో అంచనా వేస్తామని ప్రకటించింది.

సాంకేతిక పరమైన మార్పులు, వాతావరణ సంబంధమైన పాలసీలు కంపెనీ వ్యవహారాలపై ఏవిధంగా ప్రభావం చూపిస్తాయో..ఏటా అంచనా వేయాలన్నారు.

ఈ ప్రతిపాదనను 'న్యూయార్క్ స్టేట్ ఎంప్లాయీస్ రిటైర్‌మెంట్ ఫండ్' తెరపైకి తెచ్చింది. కంపెనీల్లో యూనియన్‌కు 62శాతం వాటా ఉంది.

ఈ సదస్సులో ఏదైనా ముందడుగు పడిందా లేదా అన్న అంశంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)