అమెరికా: అలబామాలో ట్రంప్ సెనేట్ అభ్యర్థి ఓటమి

  • 13 డిసెంబర్ 2017
గెలిచిన తర్వాత డగ్ జోన్స్ అభివాదం Image copyright Reuters
చిత్రం శీర్షిక అలబామా రాష్ట్రం నుంచి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి సెనెటర్‌గా గెలవటం పాతికేళ్లలో ఇదే తొలిసారి

అమెరికాలోని అలబామా రాష్ట్రం నుంచి సెనేట్ ఉప ఎన్నికలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి డగ్ జోన్స్ గెలిచారు. దేశా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలపరిచిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రాయ్ మూర్ ఈ ఎన్నికలో ఓడిపోయారు. ఇది ట్రంప్‌కు ఎదురుదెబ్బగా అభివర్ణిస్తున్నారు.

మాజీ ప్రాసిక్యూటర్ అయిన డగ్ జోన్స్ (63) గెలుపు.. అమెరికా సెనేట్‌లో రిపబ్లికన్ పార్టీని కూడా దెబ్బకొట్టింది. సెనేట్‌లో మెజారిటీ తగ్గిపోయింది. రిపబ్లికన్ పార్టీ సభ్యుల సంఖ్య 51 మందికి తగ్గగా.. డెమొక్రటిక్ పార్టీ సభ్యుల బలం 49 మందికి పెరిగింది.

అలబామా నుంచి డెమొక్రటిక్ అభ్యర్థి సెనేట్‌కు ఎన్నికవటం గత 25 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి.

జోన్స్ గెలుపు ప్రకటన వెలువడిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ‘‘ఆ స్థానంలో రిపబ్లికన్ పార్టీకి అతి త్వరలోనే మరో అవకాశం వస్తుంది’’ అని కూడా ఆ ట్వీట్‌లో ట్రంప్ వ్యాఖ్యానించారు.

అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ వైదొలగడంతో ఖాళీ అయిన అలబామా సెనెటర్ స్థానానికి మంగళవారం (డిసెంబర్ 12) ఎన్నికలు నిర్వహించారు.

ఈ సీటు కోసం హోరాహోరీగా ఎన్నికల ప్రచారం సాగింది. అయితే టీనేజీ బాలికలతో లైంగికంగా అసభ్యకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలు రాయ్ మూర్‌ను పెను వివాదంలోకి నెట్టివేశాయి. ఆ ఆరోపణలను మూర్ తిరస్కరించారు.

డగ్ జోన్స్ మాజీ న్యాయవాది. 1963లో బర్మింగ్‌హామ్‌లో నల్లజాతి వారి చర్చి మీద బాంబుదాడి చేసి, నలుగురు యువతుల మరణానికి కారణమైన కు క్లక్స్ క్లాన్ సభ్యులు ఇద్దరికి కోర్టులో శిక్షపడటానికి చేసిన కృషితో ఆయన ఖ్యాతి పెరిగింది.

‘‘ఈ పోటీ అంతా గౌరవం, మర్యాదల గురించే సాగింది’’ అని జోన్స్ తన విజయోత్సవ ప్రసంగంలో పేర్కొన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రాయ్ మూర్ ఓటమి అధ్యక్షుడు ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి ఎదురు దెబ్బ

మూర్ అతివాద సంప్రదాయవాది. రాష్ట్ర సుప్రీంకోర్టు నుంచి రెండు సార్లు ఉద్వాసనకు గురయ్యారు. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించాలని ఆయన వాదిస్తారు. రాష్ట్ర రాజ్యాంగం నుంచి విభజనాత్మక భాషను తొలగించడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు.

అయితే.. తాము యుక్తవయసులో ఉన్నపుడు మూర్ తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని పలువురు మహిళలు ఆరోపణలు చేయడంతో ఈ ఎన్నికలపై జాతీయ స్థాయిలో ఆసక్తి పెరిగింది.

ప్రముఖ రాజకీయ నాయకులపై వరుసగా బయటకు వస్తున్న లైంగిక అసభ్య ప్రవర్తన ఆరోపణల క్రమంలోనే మూర్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి ఆరోపణలతో ఇప్పటికే ముగ్గురు రాజకీయ నాయకులు రాజీనామా చేశారు.

Image copyright Getty Images

అభ్యర్థి బలహీనతా..? ట్రంప్ వ్యతిరేకతా..?

ఆంథొనీ జుర్చర్, బీబీసీ న్యూస్ వాషింగ్టన్

అమెరికా సెనేట్‌లో ఇప్పుడు అలబామాకి డెమొక్రటిక్ పార్టీ నేత ప్రాతినిధ్యం వహిస్తారు.

ఏడాది కిందట.. ఇలాంటి ఫలితం అసంభవంగా కనిపించింది. మంగళవారం ఓటర్లు పోలింగ్ కోసం వెళుతున్నపుడు కూడా ఇది సంభవమని అనిపించలేదు.

ఈ అనూహ్య విజయం పర్యవసానాలూ సుస్పష్టం.

సెనేట్‌లో రిపబ్లికన్ మెజారిటీ తగ్గిపోతుంది. డెమొక్రాట్లు 2018 మధ్యంతర ఎన్నికల్లో సభలో పట్టు సంపాదించుకునే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి.

రాయ్‌ మూర్‌కి మద్దతు ఇవ్వటానికి సొంత పార్టీలో ఇతర నాయకులు సంకోచిస్తోంటే.. ఆయనకు పూర్తి మద్దతునిచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఖండించటంగా కూడా ఈ ఫలితాన్ని చూడవచ్చు.

నవంబర్‌లో వర్జీనియా, న్యూ జెర్సీల్లో గవర్నర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ గెలిచినందున.. ట్రంప్ వ్యతిరేక ఎన్నికల గాలి బలపడుతోందని ఆ పార్టీ మద్దతుదారులు కొందరు ఆశిస్తుంటారు.

కానీ, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రాయ్ మూర్‌‌‌‌లో చాలా లోపాలున్నాయి కాబట్టి ఇప్పుడే ఏమీ చెప్పలేం.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)