బ్రెగ్జిట్ బిల్లు: అధికార పార్టీ ఎంపీల తిరుగుబాటు

  • 14 డిసెంబర్ 2017
థెరెసా మే Image copyright Getty Images

యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగటానికి సంబంధించిన కీలక బిల్లు విషయంలో ప్రధానమంత్రి థెరెసా మే కు పార్లమెంటులో ఎదురుదెబ్బ తగిలింది.

ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు సవరణ చేస్తూ సొంత పార్టీకి చెందిన 11 మంది ఎంపీలు ఓటు వేశారు. తద్వారా.. ఈయూతో బ్రిటన్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మీద తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్లమెంటుకు అప్పగించారు.

దీనివల్ల ఈయూ నుంచి సాఫీగా వైదొలగే అవకాశాలు దెబ్బతింటాయని థెరెసా సర్కారు వాదిస్తోంది.

బ్రిగ్జిట్ ఒప్పందంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వారిని బుజ్జగించటానికి ప్రభుత్వం చివరి నిమిషంలో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

సవరణ బిల్లు నాలుగు ఓట్ల తేడాతో (309 - 305) ఆమోదం పొందింది.

Image copyright Getty Images

అయితే ఇది చిన్న ఆటంకమేనని, 2019లో ఈయూను బ్రిటన్ వీడకుండా ఈ పరిణామం నివారించలేదని మంత్రులు పేర్కొన్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన కన్జర్వేటివ్ ఎంపీలలో ఎనిమిది మంది మాజీ మంత్రులు కావటం విశేషం.

వారిలో ఒకరైన స్టీఫెన్ హామ్మాండ్‌ను ఓటింగ్ ముగిసిన తర్వాత కన్జర్వేటివ్ వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు.

బ్రెగ్జిట్ విషయంలో బలమైన హామీలు ఇచ్చినప్పటికీ.. పార్లమెంటులో ఎదురుదెబ్బ తగలటం నిరాశాజనకంగా ఉందని ప్రభుత్వం వర్గాలు పేర్కొన్నాయి.

బ్రెగ్జిట్ అంశంపై చర్చించేందుకు ఈయూ నాయకుల శిఖరాగ్ర సదస్సు జరుగనున్న నేపథ్యంలో.. ఈ ఓటమి థెరెసా మే అధికారాన్ని బలహీనపరుస్తుందని లేబర్ పార్టీ నాయకుడు జెరిమీ కోర్బిన్ వ్యాఖ్యానించారు.

Image copyright Getty Images

ఈ పరిణామం ప్రభావం ఏమిటి?

పార్లమెంటులో ఇబ్బందికరమైన ఓటమిని ఎదుర్కొన్న థెరెసా మే గురువారం బ్రసెల్స్‌లో జరగబోయే ఈయూ నాయకుల శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతారు.

అయితే ఈ ఓటమి ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై బ్రిటన్ మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది నిరాశ కలిగించే పరిణామమే అయినప్పటికీ.. మొత్తంగా చూస్తే దీని ప్రభావం ఏమీ ఉండదని ఇద్దరు మంత్రులు పేర్కొన్నారు.

మరొక మంత్రి మాత్రం ఇది బ్రెగ్జిట్‌కు చేటు చేస్తుందని వ్యాఖ్యానించారు.

Image copyright House of Commons
చిత్రం శీర్షిక సభలో చర్చ సందర్భంగా అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మధ్య వాదోపవాదాలు జరిగాయి

అధికార పార్టీ ఎంపీల మధ్య వాదోపవాదాలు

ఈ సవరణ మీద ఓటింగ్ విషయంలో అధికార కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. తిరుగుబాటు ఎంపీలతో ప్రతిపక్ష సభ్యులు జతకలిశారు. సవరణ రూపకర్తలు ప్రభుత్వం చేతులు కట్టేయటం ద్వారా ‘బ్రెగ్జిట్‌‘ను క్లిష్టతరం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శకులు ఆరోపించారు.

సవరణ మీద ఓటింగ్ ఫలితాలు వెలువడిన తర్వాత.. ‘‘ఈయూ నుంచి ఉపసంహరణ ప్రక్రియపై నియంత్రణను పార్లమెంటు తన చేతుల్లోకి తీసుకుంది’’ అని తిరుగుబాటు ఎంపీ, మాజీ మంత్రి నిక్కీ మోర్గన్ ట్వీట్ చేశారు.

తిరుగుబాటు చేసిన టోరీ ఎంపీలకు ఇకపై పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఇవ్వకూడదని కన్జర్వేటివ్ ఎంపీ నడైన్ డోరీస్ వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే.. అధికార కన్జర్వేటివ్ ఎంపీ జాన్ స్టీవెన్సన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీలు ఇద్దరు ఫ్రాంక్ ఫీల్డ్, కేట్ హో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు.

Image copyright Getty Images

ఏమిటీ సవరణ?

యూరోపియన్ సమాఖ్య నుంచి బ్రిటన్ 2019 మార్చిలో వైదొలగాల్సి ఉంది. ఆ తర్వాత ఈయూ - బ్రిటన్‌ల మధ్య సంబంధాలు ఎలా ఉండాలనే అంశం మీద చర్చలు జరుగుతున్నాయి.

ఈయూ నుంచి వైదొలగటానికి సంబంధించి ప్రభుత్వ వ్యూహంలో ఈయూ ఉపసంహరణ బిల్లు కీలకమైనది.

బ్రిటన్‌లో ఈయూ చట్టం సర్వాధికారానికి ముగింపు పలకటం, అలాగే ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటం సజావుగా సాగేందుకు వీలుగా ప్రస్తుతమున్న ఈయూ చట్టాన్ని బ్రిటన్ చట్టంలోకి చేర్చటం వంటివి ఈ బిల్లులోని ముఖ్యాంశాలు.

ఈయూ నుంచి వైదొలగేటపుడు బ్రిటన్‌లోని వ్యాపారాలు, వ్యక్తులకు ఆటంకాలు కలుగకుండా ఉండేలా చట్టంలో లోటుపాట్లు లేకుండా చూడాలన్నది ఈ బిల్లు లక్ష్యమని ప్రభుత్వం చెప్తోంది.

Image copyright Getty Images

బ్రెగ్జిట్ అనంతరం ఆయా చట్టాలను బ్రిటన్ పార్లమెంటు అవసరమైనపుడు, అవసరమైన విధంగా సవరించటం, మెరుగుపరచటం, ఉపసంహరించటం చేయవచ్చునని పేర్కొంది.

ఈ బిల్లుపై ప్రస్తుతం బ్రిటన్ పార్లమెంటులో చర్చ జరుగుతోంది. అందులోని పలు అంశాలను మార్చుతూ సవరణలు బ్రిటన్ ఎంపీలు వందలాది ప్రయత్నాలు చేస్తున్నారు.

బ్రెగ్జిట్‌ విషయమై ఈయూతో ఏ ఒప్పందాన్నైనా పార్లమెంటు ఆమోదం పొంది చట్టం చేయాలని.. అందుకు వీలుగా ఈయూ ఉపసంహరణ బిల్లులో సవరణ చేయాలన్నది కీలకమైన డిమాండ్.

ఆ డిమాండ్ మేరకు సవరణ బిల్లును ప్రతిపాదించిన అధికార పార్టీ తిరుగుబాటు సభ్యులు తొలిసారి విజయం సాధించారు.

పార్లమెంటులో ఆమోదం పొందిన తాజా సవరణను ప్రభుత్వం తర్వాతి స్థాయిలో తిప్పికొట్టలేకపోతే.. ఈయూతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం అమలు చేయటానికి ముందు కొత్త పార్లమెంటు చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)