అమెరికాలో మాట్లాడే భారతీయ భాషల్లో తెలుగుది ఎన్నో స్థానం?

 • 16 డిసెంబర్ 2017
ప్రపంచ తెలుగు మహాసభలు Image copyright Telangana govt.

హైదరాబాద్‌లో ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్న సందర్భంగా.. తెలుగుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు మీ కోసం.

 • తెలుగులోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దానికి చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలి తెలుగు పదం 'నాగబు'.
 • హైదరాబాద్ రాజ్యంలో తెలుగు, భాష సాంస్కృతిక పునర్వికాసానికి కృషి చేసిన వారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఊరూరా గ్రంథాలయాల్ని స్థాపించి, నిరక్షరాస్యులైన ప్రజలకు విజ్ఞానాన్ని ప్రసాదించాలని, తెలుగు సాహిత్యం గొప్పతనాన్ని తెలియజేయాలని గ్రంథాలయ ఉద్యమానికి గట్టి పునాదులు వేసిన వారు లక్ష్మణరావు.
 • తెలుగులో వ్యావహారిక భాషోద్యమానికి ఆద్యులు గిడుగు రామ్మూర్తి. వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం ఆయన 'తెలుగు' అనే మాసపత్రికను నడిపారు.
 • తెలుగులో యాత్రా సాహిత్యానికి ఆద్యులు ఏనుగుల వీరాస్వామయ్య. ఆయన 1938లోనే తన కాశీయాత్ర చరిత్ర విశేషాలు పుస్తకరూపంగా వెలువరించిన వ్యక్తిగా సుప్రసిద్ధులు.
 • వేమన పద్యాలను సేకరించి, ప్రచురించి, ఆంగ్లంలో అనువదించి ఖండాంతర వ్యాప్తి చేశారు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తొలి తెలుగు శబ్దకోశాన్ని ఆయనే పరిష్కరించి ప్రచురించారు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితులయ్యారు.
Image copyright facebook
చిత్రం శీర్షిక డా.సి.నారాయణరెడ్డి
 • మొట్టమొదటి బైబిల్ ప్రతిని 1812లో ప్రచురించారు. రెవరెండ్ బెంజిమన్ స్కల్జ్ బైబిల్‌ను తెలుగులోనికి అనువదించారు. ఆయన రాత ప్రతులను జర్మనీలోని హాలీలో ప్రచురించారు.
 • ఆంధ్ర ప్రదేశ్‌లో 1966లో అధికార భాషా చట్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షులుగా వావిలాల గోపాలకృష్ణయ్య (1974-77) పని చేశారు.
 • ఇప్పటివరకు ముగ్గురు తెలుగు రచయితలు జ్ఞానపీఠ్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. 1970లో విశ్వనాథ సత్యనారాయణ, 1988లో డా.సి.నారాయణరెడ్డి, 2012లో రావూరి భరద్వాజ ఈ పురస్కారాన్ని సాధించారు.
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionపరభాషీయుల నోట మన తెలుగు మాట .. సరదాగా!
 • 1975లో మొట్టమొదటి తెలుగు మహాసభలు హైదరాబాద్‌లో జరిగాయి. రెండో తెలుగు మహాసభలు 1981 మలేసియాలోని కౌలాలంపూర్‌లో , మూడో మహాసభలను1990 మారిషస్‌లో నిర్వహించారు. 2012లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్నవి ఐదో ప్రపంచ తెలుగు మహాసభలు.
 • నిజామాబాద్‌ అసిస్టెంట్‌ సెషన్స్‌ జడ్జి మంగారి రాజేందర్‌ (జింబో) తెలుగు భాషలో తీర్పు వెలువరించిన తొలి న్యాయమూర్తి. ఫిబ్రవరి 19, 2002న ఆయన తెలుగులో తీర్పు వెలువరించి తెలుగులో తీర్పు వెలువరించిన తొలి న్యాయమూర్తిగా ఘనతకెక్కారు.
 • అక్టోబర్, 1991లో యూనికోడ్ కన్సార్టియం మొదటి వెర్షన్‌లో తెలుగు లిపికి యూనికోడ్ స్టాండర్డ్ ఇచ్చింది.
Image copyright facebook
 • తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా సౌజన్యంతో రూపొందిన ఉచిత ఆన్ లైన్ డిక్షనరీ ‘ఆంధ్రభారతి తెలుగు నిఘంటు శోధన’. ఈ ఆన్ లైన్ డిక్షనరీలో ముప్పైకి పైగా నిఘంటువుల సమాచారం చేర్చారు.
 • తెలుగు వికీపీడియా 10 డిసెంబర్, 2003లో ప్రారంభమైంది. బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జున తెలుగు వికీపీడియాకు శ్రీకారం చుట్టారు. తెలుగు వికీపీడియా మొదటి లోగోను రూపొందించింది కూడా ఆయనే.
 • అమెరికాలో ఎక్కువమంది మాట్లాడే మాతృభాషల్లో మూడోది తెలుగు. అక్కడ భారతదేశానికి చెందిన భాషల్లో ఎక్కువగా హిందీ మాట్లాడేవారు ఉండగా, రెండో స్థానంలో గుజరాతీ, తెలుగు మూడో స్థానంలో ఉన్నాయి. అమెరికాలో నివసిస్తున్నవారిలో ఇంటివద్ద సుమారు 3,65,566 మంది తెలుగులోనే మాట్లాడుతారని ఓ సర్వే నివేదిక వెల్లడించింది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

సంబంధిత అంశాలు