వైన్‌స్టీన్‌పై నా అనుమానం నిజమైంది: హాలీవుడ్ నటి సోర్వినో

మీరా సోర్వినో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మీరా సోర్వినో

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నహాలీవుడ్‌ సినీ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌పై మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి.

తన కెరీర్‌ను ఆయన దెబ్బతీశారని హాలీవుడ్ నటి మీరా సోర్వినో ఆరోపించారు. ఆయన కారణంగా సినిమాల్లో తనకు కొన్ని ముఖ్యమైన పాత్రలు దక్కకుండా పోయాయనే విషయం తెలిశాక చాలా బాధ కలిగిందని ఆమె చెప్పారు.

వైన్‌స్టీన్‌కు చెందిన మిరామాక్స్ సంస్థ నిర్దేశాల మేరకు సోర్వినోతోపాటు మరో నటి ఆష్లే జుడ్‌ను 'విస్మరించాల్సిన నటుల జాబితా'లో చేర్చినట్లు 'ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సిరీస్ చిత్రాల దర్శకుడు పీటర్ జాక్సన్ ఇటీవల వెల్లడించారు. ఈ నేపథ్యంలో సోర్వినో తాజా వ్యాఖ్యలు చేశారు.

వైన్‌స్టీన్ తమను లైంగికంగా వేధించారని సోర్వినో, ఆష్లే ఇద్దరూ ఇంతకుముందు ఆరోపించారు. అయితే, వారి పట్ల తాను తప్పుగా ప్రవర్తించలేదని, వారికి అవకాశాలు ఇవ్వొద్దని చెప్పలేదని వైన్‌స్టీన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రముఖ దర్శకుడు పీటర్ జాక్సన్

'ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సిరీస్ చిత్రాల ముందస్తు సన్నాహాలను తొలుత వైన్‌స్టీన్‌కు చెందిన మిరామాక్స్ సంస్థ చూసింది. తర్వాత వీటిని న్యూ లైన్ సినిమా సంస్థ చేపట్టింది.

ఈ సినిమాల్లో పాత్రలకు సోర్వినో, ఆష్లే జుడ్‌లను తీసుకోవాలనే ఆసక్తి తనకు ఉండేదని పీటర్ జాక్సన్ కొద్ది రోజుల కిందట stuff.co.nz వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే వారిద్దరితో కలిసి పనిచేయడం తలనొప్పి వ్యవహారమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని తీసుకోవద్దని మిరామాక్స్ సంస్థ చెప్పిందని ఆయన వెల్లడించారు. బహుశా ఇది 1998లో జరిగిందని చెప్పారు.

సోర్వినో, ఆష్లే జుడ్ ప్రతిభావంతులైన నటులని, వీరి గురించి వైన్‌స్టీన్ సంస్థ కావాలనే తమకు తప్పుడు సమాచారం ఇచ్చిందనే అనుమానం కలుగుతోందని ఆయన వెల్లడించారు.

వైన్‌స్టీన్ సంస్థ ఇచ్చిన సమాచారం నిజమైనదేనని తాము నమ్మడం వల్ల వారిద్దరిని పరిగణనలోకి తీసుకోలేదని, న్యూ లైన్ సినిమా సంస్థతో జరిపిన చర్చల్లోనూ వారి పేర్లను ప్రస్తావించలేదని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

హార్వే వైన్‌స్టీన్‌

పీటర్ జాక్సన్‌కు ధన్యవాదాలు: సోర్వినో

పీటర్ జాక్సన్ వ్యాఖ్యలపై సోర్వినో 'ట్విటర్'లో స్పందిస్తూ- ''ఈ విషయం తెలిసినప్పుడు నాకు దుఃఖం వచ్చింది. వైన్‌స్టీన్ నా కెరీర్‌‌కు నష్టం కలిగించారనే అనుమానం నాకు ఎప్పట్నుంచో ఉంది. అది నిజమని ఇప్పుడు తేలింది. నిజాయతీతో వ్యవహరించినందుకు పీటర్ జాక్సన్‌కు ధన్యవాదాలు'' అన్నారు.

'ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్' సిరీస్ సినిమాల సన్నాహాలకు సంబంధించి తనను సంప్రదించారని, తనకు ఏయే పాత్రలపై ఆసక్తి ఉందో కూడా అడిగి తెలుసుకున్నారని, కానీ తర్వాత తనకు ఎలాంటి కబురూ రాలేదని ఆష్లే జుడ్ వెల్లడించారు.

'ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్' నటీనటుల ఎంపికను చేపట్టింది న్యూ లైన్ సినిమా సంస్థ అని, మిరామాక్స్ కాదని వైన్‌స్టీన్ తరపున ఆయన ప్రతినిధి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

వైన్‌స్టీన్ నిర్మించిన రెండు ఇతర సినిమాల్లో ఆష్లే జుడ్ నటించారని ప్రకటనలో తెలిపారు. సోర్వినోను కూడా ఇతర సినిమాలకు పరిగణనలోకి తీసుకొన్నారని చెప్పారు.

ఫొటో సోర్స్, Michael Loccisano/Getty Images

ఫొటో క్యాప్షన్,

ఆష్లే జుడ్

వైన్‌స్టీన్ వివరణను తోసిపుచ్చిన పీటర్ జాక్సన్

'ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్' నటీనటుల ఎంపికలో సోర్వినో, ఆష్లే జుడ్‌లను విస్మరించడంలో తన పాత్ర లేదన్న వైన్‌స్టీన్ వివరణను పీటర్ జాక్సన్ కొట్టిపారేశారు.

18 నెలలపాటు సన్నాహక పనులను మిరామాక్స్‌తో కలిసి చేపట్టామని, అప్పట్లో నటీనటుల ఎంపిక గురించి హార్వే వైన్‌స్టీన్, బాబ్ వైన్‌స్టీన్, వారి ప్రతినిధులతో చాలాసార్లు చర్చించామని 'ఎంటర్‌టైన్‌మెంట్ వీక్లీ'తో ఆయన చెప్పారు.

వైన్‌స్టీన్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అక్టోబరులో ఆరోపణలు చేసిన నటీమణుల్లో సోర్వినో, ఆష్లే జుడ్ కూడా ఉన్నారు. ఆ ఆరోపణలను వైన్‌స్టీన్ తోసిపుచ్చారు.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)