సోషల్: ప్రధాని గారూ, మీకు 150 సీట్లు ఎందుకు రాలేదు?

  • 18 డిసెంబర్ 2017
నరేంద్ర మోదీ Image copyright Facebook/Narendra Modi

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది.

ఈ గెలుపుపై పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

"గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ శిరసావహిస్తోంది. రెండు రాష్ట్రాల్లో కొలువు తీరనున్న ప్రభుత్వాలకు శుభాకాంక్షలు. నాపై చూపిన అభిమానానికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

Image copyright Facebook/Prakash Raj

"ప్రియమైన, ప్రధానమంత్రి! విజయం సాధించినందుకు శుభాకాంక్షలు. కానీ మీరు ఈ గెలుపును చూసి నిజంగా సంతోషపడుతున్నారా? మీ అభివృద్ధి మంత్రంతో ఎందుకు క్లీన్ స్వీప్ చేయలేక పోయారు? మీ లక్ష్యమైన 150+ ఏమైంది? " అని సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

Image copyright Twitter/KTR

"గుజరాత్‌లో తిరిగి అధికారంలోకి వచ్చినందుకు, హిమాచల్ ప్రదేశ్‌లో విజయం సాధించినందుకు నరేంద్ర మోదీ, బీజేపీలకు శుభాకాంక్షలు. గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్‌కు కూడా అభినందనలు.

స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరం. ఇక రాజకీయాలకు స్వస్తి పలికి సుపరిపాలనకు బాటలు వేస్తారని ఆశిద్దాం" అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పోస్ట్ చేశారు.

"గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు భారతీయ జనతా పార్టీపై విశ్వాసం ఉంచారు. నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు నమ్మకం ఉందనే దానికి ఇది నిదర్శనం" అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ట్విటర్‌లో అన్నారు.

Image copyright Twitter/Mamatabanerjee

"గుజరాత్ ప్రజలకు అభినందనలు. ఎంతో తెలివిగా తీర్పు ఇచ్చారు. ఈ విజయం బీజేపీకి తాత్కాలిక ఆనందం మాత్రమే ఇస్తుంది. ఆ పార్టీ నైతికంగా ఓడి పోయింది. తమకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా సామాన్యులు ఓటు వేశారు" అని పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోస్ట్ చేశారు.

Image copyright Twitter/lakshmi manchu

"182 సీట్లలో 150 బీజేపీకి ఇవ్వాలని గుజరాత్ ప్రజలను అమిత్‌షా అడిగారు. అయితే ప్రజలు మాత్రం 28 శాతం జీఎస్‌టీ వేశారు. 182*28%=51. 150లో 51 తీసేస్తే 99." ఇది తనకెంతో ఫన్నీగా అనిపించినట్లు టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ పోస్ట్ చేశారు.

"నరేంద్ర మోదీ విధానాలు, సంస్కరణలకు ఆమోదం లభించిందనే దానికి గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం" అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ట్వీట్ చేశారు.

"గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాజకీయ చర్చలకు ఏ మాత్రం కొదువ లేదు. ఊహించినట్లుగానే ఫలితాలు వచ్చినప్పటికీ ఎందుకు స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి?" అని మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్‌లో పేర్కొన్నారు.

"గుజరాత్‌లో రాహుల్ గాంధీ ప్రచారం చేసిన తీరుతో కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయం లభించింది" అని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

"గుజరాత్‌లో పాగా వేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత కష్టపడిందో ఎవరూ గుర్తించడం లేదు? మొత్తం 11 నియోజక వర్గాల్లో పోటీ పడిన అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయినట్లు కనిపిస్తోంది?" అని రాజకీయ విశ్లేషకుడు కంచన్ గుప్తా అన్నారు.

సంబంధిత కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)