అమెరికా: గంటకు 130 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు
వాషింగ్టన్ రాష్ట్రంలో ఓ ప్యాసింజర్ రైలు రోడ్డు మీదకు దూసుకు వెళ్లింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 72 మంది గాయపడ్డారు. గాయపడినవారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు.
సియటిల్ నగరం నుంచి పోర్ట్‌లాండ్‌కు వెళ్తోన్న ఈ రైలు వాషింగ్టన్‌లోని ఓ రైల్వే బ్రిడ్జ్‌పై నుంచి కింద ఉన్న రహదారిపైకి ఒరిగిపోయింది.
ఫొటో సోర్స్, Reuters
భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న 7వాహనాలు ఈ ఘటనలో ధ్వంసమయ్యాయి.
అయితే.. రోడ్డు మీద ప్రయాణిస్తున్నవారిలో ఎంత మంది గాయపడ్డారన్న విషయం తెలియరాలేదు.
ఫొటో సోర్స్, Reuters
రైలులో 77 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో 19 మంది సురక్షితంగా బయటపడ్డారు.
ప్రయాణం జరిగిన మలుపులో 48కి.మీ. వేగంతోనే ప్రయాణించాలని అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగా తాము ప్రమాద సూచికలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.
కానీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానిక మీడియా అభిప్రాయపడింది.
ఈ ప్రమాదంపై జాతీయ రవాణా భద్రతా బోర్డు (ఎన్టీఎస్బీ) అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ప్రాథమిక సమాచారం ఆధారంగా.. గంటకు 30 మైళ్ల వేగంతో ప్రయాణించాల్సిన చోట 80 మైళ్ల వేగంతో ఈ రైలు ప్రయాణించింది. తదుపరి విచారణ మరో వారం, పది రోజులు జరగొచ్చు’’ అని చెప్పారు.
ప్రమాదానికి గురైన రైలు ఇంజిన్‌లో సమాచారం ఆధారంగా.. ఈ రైలు ప్రమాదం సంభవించే సమయంలో గంటకు 80 మైళ్లు (130 కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తోంది. ప్రమాదం జరిగిన మలుపు వద్ద రైలు 30 మైళ్ల వేగంతో మాత్రమే ప్రయాణించాల్సి ఉంది.
ఈ విషయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు.
మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రోడ్లు, బ్రిడ్ట్లు, టన్నెల్స్ మొదలైనవాటికి కోట్లు ఖర్చుపెడుతున్నా.. అవి ఎక్కువకాలం నిలవడం లేదని ట్వీట్ చేశారు.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)