గూగుల్‌లో మీ వ్యక్తిగత సమాచారం ఏదీ ఉండొద్దంటే ఇలా చెయ్యండి!

ఫొటో సోర్స్, KIRILL KUDRYAVTSEV/getty images
చలికాలం కదా! చలికోటు కొందామనుకున్నాడు సుబ్బారావు. రేట్లు ఎలా ఉన్నాయో గూగుల్‌లో వెతికాడు.
ఆ తరువాత సుబ్బారావు ఎప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసినా.. ఏ వెబ్సైట్ తెరచినా వివిధ రకాల చలికోట్లు, వాటి ధరలకు సంబంధించిన ప్రకటనలు తెరపై కనిపిస్తున్నాయి.
ఈ అనుభవం మీకు కూడా కలిగే ఉంటుంది కదూ!
మరి ఇదెలా సాధ్యం? మనం సెర్చ్ చేసిన సమాచారం వారికెట్లా తెలుస్తోంది?
మన సమాచారం ఇతరులకు తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? పదండి ఆ వివరాలను తెలుసుకుందాం.
వ్యక్తిగత గోప్యత
"గూగుల్ సేవలు వినియోగించుకుంటున్నారా? అయితే మీ డేటా భద్రంగా ఉంటుంది. ఈ విషయంలో మీరు మమ్మల్ని నమ్మొచ్చు."
గూగుల్ ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) నియమ, నిబంధనల్లో సాధారణంగా మీరు చూసే తొలి వాక్యం ఇది.
అయితే మీకు ఒక విషయం తెలిసి ఉండక పోవచ్చు. అదే గూగుల్ "మై యాక్టివిటీ".
గూగుల్‌లో మీరు చేసే ప్రతి పనీ ఇందులో రికార్డవుతుంది.
దీని ఆధారంగానే మీ బ్రౌజింగ్ చరిత్రను ఆయా సంస్థలు తెలుసుకుంటున్నాయి.
ఇందుకు తగినట్లు ప్రకటనలు ఇస్తుంటాయి.
డిలీట్ చేయడం ఎలా?
ఈ రోజుల్లో ఆన్లైన్ ప్రపంచంలో విహరించే వాళ్లకు దాదాపు జి-మెయిల్ ఉంటుంది. అంటే మీకు గూగుల్‌లో ఒక ఖాతా ఉందన్నమాట.
గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో ఈ ఖాతా అనుసంధానమై ఉంటుంది.
గూగుల్‌లో మీరు ఏం వెతికినా, ఏం చేసినా ప్రతిదీ రికార్డు అవుతుంది.
ఏ ప్రాంతంలో ఉన్నా.. కంప్యూటర్ ఏదైనా.. ఈ డేటాను "మై యాక్టివిటీ" సేకరిస్తుంది.
ఈ డేటాను తొలగించాలంటే ఇదిగో ఇక్కడ ఉన్న మై యాక్టివిటీ లింక్‌ను తెరవండి.
ఫొటో సోర్స్, Captura de pantalla
మై యాక్టివిటీ లింక్‌పై క్లిక్ చేయగానే "గూగుల్ మై యాక్టివిటీ" అనే విండో ఓపెన్ అవుతుంది.
ఈ విండో పై భాగంలో సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది.
దీని ద్వారా మీరు వెతికిన వెబ్సైట్ల వివరాలను తెలుసుకోవచ్చు. వాటిని డిలీట్ చేయొచ్చు.
లేదా తేదీల వారీగా కూడా బ్రౌజింగ్ హిస్టరీని తొలగించవచ్చు.
లేదా మొత్తం సమాచారాన్ని ఒకేసారి డిలీట్ చేసే ఏర్పాటు కూడా ఉంటుంది.
ఈ సమాచారాన్ని డిలీట్ చేసేటప్పుడు గూగుల్ మిమ్మల్ని తదుపరి పరిణామాలపై హెచ్చరిస్తుంది.
బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేయడం ద్వారా పెద్ద నష్టమేమీ ఉండదు. మీ గూగుల్ ఖాతా, ఇతర అప్లికేషన్ల పనితీరుపై ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపదు.
నెట్ న్యూట్రాలిటీకి వ్యతిరేకంగా అమెరికా నిర్ణయం తీసుకుంది? ఇంతకు నెట్ న్యూట్రాలిటీ అంటే?
యూట్యూబ్
యూట్యూబ్‌లో మీరు వెతికే ప్రతి వీడియో సమాచారాన్ని కూడా గూగుల్ రికార్డు చేస్తుంది.
ఈ చరిత్రను కూడా సులభంగా డిలీట్ చేయొచ్చు. ఇందుకు యూట్యూబ్ సెర్చ్ హిస్టరీ లింక్‌పై క్లిక్ చేయండి.
ఎడమ వైపున "హిస్టరీ" ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత "క్లియర్ ఆల్ సెర్చ్ హిస్టరీ", "క్లియర్ వాచ్ హిస్టరీ" వాటిని ఎంచుకోవాలి.
లేదా మీరు కోరుకున్న సమాచారాన్ని డిలీట్ చేయొచ్చు.
ఫొటో సోర్స్, YouTube
వాణిజ్య ప్రకటనలు
మీరు వెతికే ప్రతి సమాచారాన్ని గూగుల్ తెలుసుకుంటుంది.
అంతేకాదు ఇతర సంస్థలకు ఈ సమాచారాన్ని అందిస్తుంది.
ఇందువల్లే మీ బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా మీకు ప్రకటనలు వస్తుంటాయి.
అయితే ప్రకటనల సంస్థలు మీ సమాచారాన్ని చూడకుండా చేయొచ్చు.
ఫొటో సోర్స్, Google - Mark Shea
ఇందుకు గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. ఆ తరువాత "పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవసీ" విభాగంలోకి వెళ్లాలి.
అక్కడ "యాడ్స్ సెట్టింగ్స్"పై క్లిక్ చేసి "మేనేజ్ యాడ్స్ సెట్టింగ్స్"ను ఎంచుకోవాలి.
ఇక్కడ "యాడ్స్ పర్సనలైజేషన్" అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని డీ యాక్టివేట్ చేయాలి.
ఫొటో సోర్స్, Google - Mark Shea
అయితే ప్రకటనలు రాకుండా బ్లాక్ చేసే సదుపాయం లేదు.
ఫొటో సోర్స్, Google - Mark Shea
గూగుల్ లొకేషన్
ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే గూగుల్ మ్యాప్స్‌లో టైం లైన్ అనే ఆప్షన్ ఉంటుంది.
మీరు సందర్శించే ప్రాంతాల సమాచారాన్ని గూగుల్ ఇందులో రికార్డు చేస్తుంది.
గూగుల్ మ్యాప్స్ టైం లైన్ లింక్ తెరచి గూగుల్ మ్యాప్స్ హిస్టరీని డిలీట్ చేయొచ్చు.
ఇక్కడ లొకేషన్ ట్రాకింగ్‌ను కూడా ఆఫ్ చేయొచ్చు.
వేస్ట్ బాస్కెట్ బటన్‌పై క్లిక్ చేసి కోరుకున్న డేటాను డిలీట్ చేసే అవకాశం కూడా ఉంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)