చైనా: నూడుల్స్ అమ్మకాల్లో తగ్గుదల సూచిస్తున్న మార్పులు ఏమిటి?

  • సైమన్ అట్కిన్సన్
  • బీబీసీ ఆసియా బ్యూరో ప్రతినిధి
నూడుల్స్ తింటున్న మహిళ
ఫొటో క్యాప్షన్,

నూడుల్స్‌కు అతిపెద్ద మార్కెట్ చైనా

ధర తక్కువగా ఉండటం, తినడానికి సిద్ధం చేసుకోవడం తేలిక కావడం, అదీ చిటికెలో చేసుకొనే వెసులుబాటు ఉండటం వల్ల చైనాలో ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు చాలా కాలంగా మంచి డిమాండ్ ఉంది.

విద్యార్థులు, వలస వచ్చినవారు, ప్రయాణాల్లో ఉన్నవారితోపాటు సత్వరం ఆకలి తీర్చుకోవాలనుకొనేవారు ఎవరైనా వీటిపై ఆధారపడుతుంటారు.

2013లో చైనా, హాంకాంగ్‌లలో కలిపి 4,620 కోట్ల నూడుల్స్ ప్యాకెట్లు అమ్ముడయ్యాయి. వరల్డ్ ఇన్‌స్టంట్ నూడుల్ అసోసియేషన్(డబ్ల్యూఐఎన్ఏ) గణాంకాల ప్రకారం 2016 నాటికి వీటి అమ్మకాలు 3,850 కోట్ల ప్యాకెట్లకు పడిపోయాయి. అంటే మూడేళ్లలో అమ్మకాలు దాదాపు 17 శాతం క్షీణించాయి. ఈ స్థాయి తగ్గుదల అసాధారణం.

నూడుల్స్ ఎక్కువగా అమ్ముడయ్యే మార్కెట్లలో చైనా-హాంకాంగ్, ఇండొనేషియా, జపాన్, వియత్నాం, భారత్, అమెరికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్(యూకే) ఉన్నాయి.

చైనా మొదటి స్థానంలో, ఇండొనేషియా ద్వితీయ స్థానంలో ఉన్నాయి. భారత్ ఐదో స్థానంలో ఉంది.

2015లో మ్యాగీ నూడుల్స్‌ను భారత్‌లో తాత్కాలికంగా ఉపసంహరించాల్సి వచ్చింది.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారత్‌ను ఒక్కటి మినహాయించి చూస్తే, నూడుల్స్ విక్రయాలు అధికంగా ఉండే అన్ని దేశాల్లో అమ్మకాలు కొన్నేళ్లుగా దాదాపు నిలకడగా ఉన్నాయి. చైనాలో తప్ప.

చైనాలో నూడుల్స్ విక్రయాలు భారీగా పడిపోవడానికి కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం, చైనాలో వస్తున్న వివిధ మార్పులను కూడా సూచిస్తుంది. అమ్మకాల్లో క్షీణతకు వివిధ కారణాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఆహారపు అలవాట్లలో మార్పు

కొందరు చైనీయులు నూడుల్స్ కంటే మెరుగైన ఆహారం వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.

నూడుల్స్ అమ్మకాల్లో తగ్గుదల చైనీయుల ఆహారపు అలవాట్లలో మార్పును సూచిస్తోందని 'అకాడమీ ఆఫ్ చైనా కౌన్సిల్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్'కు చెందిన ఝావో పింగ్ చైనా డైలీ పత్రికతో చెప్పారు.

వినియోగదారులు ఎలాగోలా కడుపు నింపుకొంటే చాలులే అని అనుకోకుండా, తాము తీసుకొనే ఆహారం, ఇతరత్రా అంశాల్లో ప్రమాణాలను పెంచుకోవాలనుకొంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

ఫొటో క్యాప్షన్,

వలస కార్మికులు

నగరాలకు తగ్గిన వలసలు

నూడుల్స్ ఎక్కువగా తీసుకొనేవారిలో వలస కార్మికులు ఉంటారు.

ఇంటికి దూరంగా ఉండటం, ఉండే చోట ఇంట్లో మాదిరి వండుకోవడానికి అవసరమైన సామగ్రి, సదుపాయాలు లేకపోవడం, వీలైనంత డబ్బు ఆదా చేసి, ఇంటి వద్ద ఉన్న తమ కుటుంబ సభ్యులకు పంపించాలనే ఆలోచన ఉండటం వల్ల వారు ఎక్కువగా నూడుల్స్‌పై ఆధారపడుతుంటారు.

చైనాలో 2014 వరకు గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్లేవారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. తర్వాత వరుసగా రెండేళ్లపాటు ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. 2017 గణాంకాలు ఇంకా వెలువడలేదు. ఈ ఏడాది కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశముంది.

2015తో పోలిస్తే 2016లో నగరాల్లో ఉన్న వలస కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. 2015తో పోలిస్తే నిరుడు వీరి సంఖ్య 17 లక్షలు తక్కువగా ఉంది. ఈ తగ్గుదల నూడుల్స్ అమ్మకాలపై ప్రభావం చూపించి ఉండొచ్చు.

మెరుగైన మౌలిక సదుపాయాలు

నేను 20 ఏళ్ల క్రితం చైనాలో వివిధ ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు రైళ్లలో వెళ్లేవాడిని. ఈ ప్రయాణాలు కొన్నిసార్లు మూడు రోజులు, అంతకంటే ఎక్కువసేపే ఉండేవి. ప్రయాణాల మధ్యలో ఎక్కువగా నూడుల్సే తినేవాడిని.

అప్పటితో పోలిస్తే రైళ్లు, రైల్వే స్టేషన్లు మెరుగుపడ్డాయి. ప్రయాణాలూ వేగవంతమయ్యాయి. కొత్తగా చాలా ఆహార పదార్థాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో రైల్వేల్లో నూడుల్స్ విక్రయాలు తగ్గిపోయాయి.

మరోవైపు విమానయానం బాగా అభివృద్ధి చెందింది. ఎంతో మంది మధ్యతరగతి చైనీయులకు అందుబాటులోకి వచ్చింది. దేశం లోపల, వెలుపల పర్యటనలకు వెళ్లేవారు చాలా మంది విమానాలు ఎక్కుతున్నారు.

'సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా' లెక్కల ప్రకారం 2016లో దాదాపు 50 కోట్ల జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు జరిగాయి.

స్మార్ట్ ఫోన్ల వాడకం

చైనాలో సుమారు 73 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. వీరిలో 95 శాతం మంది స్మార్ట్ ఫోన్లతో ఇంటర్నెట్ వాడుతున్నారు.

ఇళ్లు, ఆఫీసు లేదా మరేదైనా కానివ్వండి.. మనం ఎక్కడ ఉంటే అక్కడికి నచ్చిన ఆహారం తెప్పించుకొనేందుకు వీలు కల్పించే యాప్‌లు అనేకం ఉన్నాయి.

ఈ పరిణామం కూడా నూడుల్స్ అమ్మకాలపై ప్రభావం చూపిస్తోంది.

విదేశీ సంస్థలు చైనా మార్కెట్‌ను వీడే అవకాశం లేనట్టే!

గతంతో పోలిస్తే చైనాలో నూడుల్స్ విక్రయాలు తగ్గుతున్నా, నూడుల్స్ మార్కెట్‌లో సింహభాగం చైనాదే.

2016లో చైనాలో అమ్ముడైన ప్యాకెట్ల సంఖ్య.. నూడుల్స్ ఎక్కువగా తినే ఏడు దేశాలు - ఇండొనేషియా, జపాన్, వియత్నాం, భారత్, అమెరికా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్‌లలో అమ్ముడైన మొత్తం ప్యాకెట్లకు దాదాపు సమానం.

చైనా నూడుల్స్ మార్కెట్ ఎంత పెద్దదో దీనిని బట్టి అంచనా వేయొచ్చు. (2016లో భారత్‌లో అమ్ముడైన ప్యాకెట్ల సంఖ్య 400 కోట్లపైన ఉంది.)

అమ్మకాల్లో క్షీణత ఉన్నా, స్థూలంగా చూస్తే చైనా నూడుల్స్ మార్కెట్ భారీగా ఉండటం వల్ల అంతర్జాతీయ నూడుల్స్ తయారీ సంస్థలు చైనాను వీడే అవకాశం ఉండకపోవచ్చు.

ఉదాహరణకు జపాన్‌కు చెందిన నూడుల్స్ వ్యాపార సంస్థ నిస్సిన్ ఫుడ్స్‌నే తీసుకుందాం. చైనాలో ఇది ఐదో అతిపెద్ద బ్రాండ్. ఇది ప్రస్తుతం హాంకాంగ్ స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయ్యేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు 930 కోట్ల డాలర్లు సమీకరించాలని ఈ కంపెనీ ఆశిస్తోంది. ఒక జపాన్ సంస్థ హాంకాంగ్ స్టాక్‌మార్కెట్‌లో లిస్టింగ్‌కు మొగ్గు చూపడం అరుదు.

కొందరు వినియోగదారులు నూడుల్స్ తినడం ఆపేశారని, అయితే అత్యధిక వినియోగదారులు తాము తినే ఆహారం నాణ్యత మెరుగుపడాలని కోరుకొంటున్నారని నిస్సిన్ ఫుడ్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కియోటక ఆండో గత వారం సీఎన్‌బీసీతో చెప్పారు. చైనాలో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)