ఉబర్ డిజిటల్ సేవల సంస్థ కాదు, ఒక రవాణా సంస్థ.. యురోపియన్ కోర్టు తీర్పు

  • 20 డిసెంబర్ 2017
స్మార్ట్‌ఫోన్లో ఉబర్ యాప్ Image copyright Getty Images

ఉబర్ డిజిటల్ సేవల సంస్థ కాదు.. ఒక రవాణా సంస్థ అని యురోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఈసీజే) తీర్పు చెప్పింది.

కానీ, తమది రవాణా సంస్థ కాదని.. ఎలక్ట్రానిక్ పద్ధతిలో ప్రజలు ఒకరినొకరు సంప్రదించుకునేలా సహకరిస్తున్న సమాచార సామాజిక సేవా సంస్థ అని ఉబర్ వాదించింది.

బార్సెలోనాలో లోకల్ టాక్సీ నిబంధనలను పాటించాలని ఉబర్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసు కోర్టు వరకూ వచ్చింది.

అయితే, ఈ తీర్పు యూరప్‌లో తమ కార్యకలాపాలపై స్వల్ప ప్రభావం చూపుతుందని ఉబర్ చెబుతుండగా.. నయా ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అంటున్నారు.

‘యూరప్‌లోని చాలా దేశాల్లోని రవాణా చట్ట ప్రకారమే మేం కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ తీర్పుతో పెను మార్పులు రావు’ అని ఉబర్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.

‘పట్టణ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారితో.. వృత్తి నిపుణులు కాని డ్రైవర్లు స్మార్ట్ ఫోన్, లేదా మరే ఇతర మార్గాల్లోనైనా వేతనం కోసం అనుసంధానమైన’ సేవలను యురోపియన్ యూనియన్ చట్ట ప్రకారం ‘రవాణా రంగంలో సేవ’గా పరిగణించాలని ఈ తీర్పులో ఈసీజే పేర్కొంది.

Image copyright EPA

విశ్లేషణ: ఈ తీర్పుతో ఏం జరగొచ్చు?

బీబీజీ బిజినెస్ కరస్పాండెంట్ థియో లెగ్గెట్

‘గిగ్ ఎకానమీ’గా పేరొందిన నయా ఆర్థిక వ్యవస్థ విషయంలో న్యాయస్థానాలు, నియంత్రణ సంస్థలు ఎలా ఇబ్బందులు పడుతున్నాయో చెప్పటానికి ఈ తీర్పు మరో ఉదాహరణ.

ఉబర్ తన సేవలను ప్రారంభించి దశాబ్దం గడుస్తోంది. పలు దేశాల్లో నిబంధనలను తరచూ ఉల్లంఘిస్తోందంటూ నియంత్రణ సంస్థల ఆగ్రహానికి లోనవుతోంది. దీంతో తరచూ తమ వ్యాపార నమూనాను బలవంతంగా మార్చుకుంటోంది.

తాజా తీర్పుతో.. చట్ట పరంగా ఉబర్ ఒక రవాణా సంస్థ అన్నది స్పష్టమైంది. అయితే, ఈ తీర్పుతో తమ వ్యాపారంపై ఇప్పటికిప్పుడు భారీ ప్రభావం ఏమీ పడదని ఉబర్ చెబుతున్నప్పటికీ.. భవిష్యత్తులో ఈ సంస్థ కార్యకలాపాలు, వివిధ దేశాలతో దాని సంబంధాలను ఈ తీర్పు ప్రభావితం చేస్తుంది.

‘కాలం చెల్లిన చట్టాల’ సంస్కరణను ఈ తీర్పు నీరుగారుస్తోందని ఉబర్ ముందునుంచీ చెబుతోంది.

ఒక ఫోన్లో యాప్‌గా.. వినియోగదారులను అనుసంధానించే వేదికగా.. చెప్పుకునే ఇతర ‘గిగ్ ఎకానమీ’ వ్యాపార సంస్థలపైన కూడా ఈ తీర్పు ప్రభావం పడొచ్చు. ఈ సంస్థల్ని న్యాయస్థానాలు వేరే విధంగా చూస్తున్నాయి.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు

ముఖ్యమైన కథనాలు