ఉత్తర కొరియాతో ఇప్పటికీ మాట్లాడే దేశాలు ఎన్ని? వాటి సంబంధాలు ఎలా ఉన్నాయి?

  • అలెక్స్ అలీవర్, ఇవాన్ గ్రాహం
  • లోవీ ఇన్‌స్టిట్యూట్

ఉత్తర కొరియా ఏకాకి అని, దాదాపు అన్ని దేశాలతోనూ ఉత్తర కొరియాకు సంబంధాలు లేవనే రీతిలో ప్రచారం సాగుతుంటుంది.

వాస్తవానికి ఉత్తర కొరియాకు సుమారు 50 దేశాలతో దౌత్య సంబంధాలు ఉన్నాయి. మరి ఆ దేశాలు ఏవి, వాటితో ద్వైపాక్షిక సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయి?

ఉత్తర కొరియా 1948లో ఏర్పడింది. అప్పటి నుంచి 160కి పైగా దేశాలతో దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంది.

ప్రస్తుతం చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్ సహా 48 దేశాల్లో ఉత్తర కొరియాకు చెందిన 55 దౌత్య కార్యాలయాలు, కాన్సులేట్లు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

భారత్, యునైటెడ్ కింగ్‌డమ్(యూకే), జర్మనీ, స్వీడన్ సహా 25 దేశాలు ఉత్తర కొరియాలో తమ దౌత్య కార్యాలయాలు నడుపుతున్నాయి.

ఉత్తర కొరియాతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్న మొదటి దేశాల్లో చైనా, రష్యా ఉన్నాయి.

ఫొటో క్యాప్షన్,

లండన్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయం

సంబంధాలపై అమెరికా ఒత్తిడి

ఉత్తర కొరియాతో సంబంధాలు తెంచుకోవాలని కొంత కాలంగా ప్రపంచ దేశాలను అమెరికా ఒత్తిడి చేస్తోంది.

ఉత్తర కొరియాతో ''అన్ని దేశాలు అన్ని సంబంధాలను తెంచుకోవాలి'' అని ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ కోరారు.

గత కొన్ని నెలల్లో స్పెయిన్, కువైట్, పెరూ, మెక్సికో, ఇటలీ, మయన్మార్ దేశాలు తమ భూభాగంలోంచి ఉత్తర కొరియా రాయబారులను, ఇతర దౌత్యవేత్తలను వెనక్కు పంపించేశాయి.

పోర్చుగల్, ఉగాండా, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) దేశాలు ఉత్తర కొరియాతో సంబంధాలను తాత్కాలికంగా తెంచుకున్నాయి.

ఫొటో క్యాప్షన్,

బీజింగ్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయ ప్రాంగణం

సంబంధాలు పెంచుకుంటున్న 20 దేశాలు

పలు దేశాలు సంబంధాలు పెంచుకొంటున్నాయి కూడా! ఈ జాబితాలో హంగేరీ, టర్కీ, ఆస్ట్రేలియా సహా 20 దేశాలు ఉన్నాయి.

నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో అనేక ఆఫ్రికా దేశాలకు ఉత్తర కొరియా తోడ్పాటు అందిస్తోంది. పలు ఇతర దేశాలతో ఇంధనం, వ్యవసాయం రంగాల్లో సహకారంపై చర్చలు జరుపుతోంది.

ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ(ఓఈసీడీ)లో 35 సభ్యదేశాలు ఉండగా, కేవలం ఆరు దేశాలకు మాత్రమే ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో దౌత్య కార్యాలయాలు ఉన్నాయి.

ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన 35 ఆర్థిక వ్యవస్థలకు ఓఈసీడీ ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఉత్తర కొరియాతో అమెరికా, జపాన్, దక్షిణ కొరియా ఎన్నడూ దౌత్య సంబంధాలను ఏర్పరచుకోలేదు.

అమెరికా, ఆసియాలోని కొన్ని అమెరికా మిత్రపక్షాలు ఉత్తర కొరియాకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని ఇతర దేశాల నుంచి సేకరించుకుంటాయి. జర్మనీ, యూకే, స్వీడన్ లాంటి దేశాలు అమెరికాకు సమాచారం అందిస్తుంటాయి.

ఫొటో క్యాప్షన్,

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్

ఆదాయార్జనలో కీలక భూమిక

ఆసియా, ఐరోపా, మధ్యప్రాచ్యం, ఆఫ్రికాల్లోని ఉత్తర కొరియా దౌత్య కార్యాలయాలు దేశానికి ఆదాయార్జనలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఈ ఆదాయంలో అక్రమ మార్గాల్లో వచ్చేది కూడా ఉంటుంది.

ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు, ఇతర ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడంలోనూ ఈ కార్యాలయాల పాత్ర ఉంది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఈ కార్యాలయాలు నెలవయ్యాయనే ఆరోపణలూ తీవ్రంగా ఉన్నాయి.

తమ దేశాల్లోని ఉత్తర కొరియా దౌత్య కార్యాలయాల భవనాలను స్థానిక వ్యాపార సంస్థలకు అక్రమంగా లీజుకు ఇచ్చారని పలు ఐరోపా దేశాలు ఆరోపణలు చేవాయి.

గతంలో పాకిస్తాన్‌లో ఉత్తర కొరియా దౌత్యవేత్త నివాసంలో దొంగతనం జరిగింది. భారీ అక్రమ మద్యం వ్యాపారంలో ఆయన పాత్ర ఉందనే అనుమానాలు అప్పట్లో వ్యక్తమయ్యాయి.

క్యూబా, వెనెజెవెలా, లావోస్ లాంటి కొన్ని సోషలిస్టు/కమ్యూనిస్టు దేశాలకు, ఉత్తర కొరియాకు మధ్య సైద్ధాంతిక సారూప్యాలు ఉన్నాయి.

ప్రస్తుతం వీటి మధ్య సంబంధాలు సిద్ధాంతం కంటే అమెరికా వ్యతిరేక విధానంపైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.

ఫొటో క్యాప్షన్,

కౌలాలంపూర్‌లోని ఉత్తర కొరియా రాయబార కార్యాలయం

సెలూన్ పోస్టర్‌లో కిమ్ ఫొటో వాడినందుకు..

విదేశాల్లోని ఉత్తర కొరియా దౌత్య అధికారులు తమ ప్రభుత్వానికి అనుకూలంగా మద్దతు కూడగట్టేందుకు, తమ దేశంపై ప్రతికూల భావనలను తొలగించేందుకు కృషి చేస్తుంటారు.

వారి ప్రయత్నాలు కొన్నిసార్లూ చిత్రంగానూ అనిపిస్తాయి. నిరుడు ఏప్రిల్‌లో బ్రిటన్‌లో జరిగిన ఒక ఘటనను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.

హెయిర్ కట్‌కు సంబంధించి లండన్‌లో ఒక సెలూన్ రూపొందించిన పోస్టర్‌లో ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్ చిత్రాన్ని వాడారు. ఇది ఉత్తర కొరియా దౌత్యవేత్తలకు కోపం తెప్పించింది.

పోస్టర్‌ పెట్టిన మరుసటి రోజే ఇద్దరు దౌత్య అధికారులు సెలూన్‌కు వెళ్లి నిర్వాహకులను ప్రశ్నించేందుకు ప్రయత్నించారు.

''ఇది ఉత్తర కొరియా కాదు, ఇంగ్లండ్.. ఇది ప్రజాస్వామ్య దేశం'' అని చెప్పి సెలూన్ నిర్వాహకులు వారిని వెనక్కు పంపించేశారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాయబార కార్యాలయం సెలూన్‌కు సమీపానే ఉంటుంది. నడిచైతే పది నిమిషాల్లో చేరుకోవచ్చు.

కొరియా సమస్యను పరిష్కరించేందుకు దౌత్యమే ఉత్తమ మార్గమని, దౌత్య మార్గాలను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని ప్యాంగ్యాంగ్‌లో దౌత్య కార్యాలయాలను నిర్వహిస్తున్న జర్మనీ లాంటి దేశాలు భావిస్తున్నాయి.

ఈ విశ్లేషణాత్మక కథనాన్ని ఆస్ట్రేలియాలోని అంతర్జాతీయ విధాన అధ్యయన సంస్థ 'లోవీ ఇన్‌స్టిట్యూట్'లో దౌత్యం, ప్రజాభిప్రాయం విభాగం డైరెక్టర్ అలెక్స్ అలీవర్, అదే సంస్థలో అంతర్జాతీయ భద్రత విభాగం డైరెక్టర్‌ ఇవాన్ గ్రాహం సహకారంతో బీబీసీ అందిస్తోంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)