మల్లికా తనేజా నగ్నంగా ఎందుకు నిరసన తెలుపుతున్నారు?

ఫొటో సోర్స్, Claudia Pajewski
అదొక రంగస్థలం. చుట్టూ ప్రేక్షకులు. మధ్యలో ఓ యువ కళాకారిణి.. నగ్నంగా.
భారత్ లాంటి సంప్రదాయ దేశంలో ఇలాంటిది ఊహించడం కష్టమే.
కానీ నాటక రచయిత, నటి మల్లికా తనేజా దీన్ని నిజం చేస్తున్నారు.
స్త్రీ, పురుషుల సమానత్వం కోసం ఆమె పోరాడుతున్నారు. ఇందుకు దేహాన్ని ఆమె ఆయుధంగా చేసుకున్నారు.
అయితే ఆమె ఎంచుకున్న ఈ మార్గం వల్ల సమానత్వం లభిస్తుందా? ఆమెను ఇందుకు పురికొల్పిన అంశాలేమిటీ?
ఇటువంటి ప్రశ్నలపై బీబీసీ ప్రతినిధి ఆయేషా పెరీరాతో మల్లికా తనేజా తన భావాలు పంచుకున్నారు.
తొలిసారి.. తమాషా
"పదిమందిలో తొలిసారి నగ్నంగా నటించినప్పుడు ఎంతో తమాషాగా అనిపించింది."
"ఈ నాటకాన్ని కెమేరాతో చిత్రిస్తున్న వ్యక్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతను తీసిన వీడియోను చూసినట్లయితే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రేక్షకుల్లో కొందరు 'అయ్యో!' అన్నారు" అంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ తనేజా చిరునవ్వులు చిందించారు.
ఫొటో సోర్స్, Claudia Pajewski
ఆమె వయసు 33 ఏళ్లు.
నగ్నత్వం అనేది తన నాటికల్లో ప్రధాన భాగం కాదని తనేజా అంటారు.
మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు వారు ధరించే దుస్తులకు ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నను ప్రేక్షకుల మదిలో రేకెత్తించేందుకు మాత్రమే ఈ ప్రయత్నమని చెబుతున్నారు.
మరి ప్రజలు ఆలోచిస్తారా?
"ఎందుకు ఆలోచించరు? వంద మంది ఒక మార్గంలో నడుస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి మరో మార్గం ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి గురించి మిగతా వాళ్లు ఆలోచించకుండా ఉండలేరు కదా!"
"ఇదీ అంతే.. పదిమంది మధ్య ఒక దేహం నగ్నంగా నిలబడి ఉంటే ఆలోచనలు రేకెత్తకుండా ఉంటాయా?" అని తనేజా అభిప్రాయపడుతున్నారు.
నాలుగేళ్లుగా ఆమె ప్రదర్శనలు ఇస్తున్నారు.
ప్రదర్శన ప్రారంభంలో ఎనిమిది నిమిషాల పాటు ఆమె నగ్నంగా నిలబడతారు.
నగ్నంగా నిలబడే ఆ కొద్ది నిమిషాలపాటు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.
ఆ క్షణాల్లో తన దేహాన్ని చూస్తూ ఉండే ప్రేక్షకుల ముఖాలలోని భావాలను చదవడానికి ఆమె ప్రయత్నిస్తుంటారు.
ఫొటో సోర్స్, Tomohiro Ohsumi/getty images
నో మొబైల్.. నో కెమేరా
తన ప్రదర్శన విషయంలో ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
మొబైల్ ఫోన్లు, కెమేరాలను ఆమె అనుమతించరు.
అందువల్లే ఆమె నాలుగేళ్ల నుంచి ప్రదర్శనలు ఇస్తున్నా.. ఆమె నగ్నంగా ఉండే చిత్రాలు కానీ, దృశ్యాలు కానీ బయటకు రాలేదు.
ప్రదర్శన ప్రారంభంలో నగ్నంగా ఉండే తనేజా, సమయం గడుస్తున్న కొద్దీ రకరకాల దుస్తులు ధరిస్తూ పోతారు.
చివరకు తలపై హెల్మెట్ కూడా పెట్టుకుంటారు.
ఇవి కేవలం దుస్తులు మాత్రమే కాదు. అవి ఓ మహిళ ఎదుర్కొంటున్న అవరోధాలకు ప్రతీకలు.
ఫొటో సోర్స్, Claudia Pajewski
కొంచెం జాగ్రత్తగా ఉండండి
సాధారణంగా ఇతరుల క్షేమాన్ని కాంక్షించి "కొంచెం జాగ్రత్తగా ఉండండి" అని చెబుతాం.
కానీ నేడు ఈ పదాన్ని మహిళలను అవమానించడానికి ఉపయోగిస్తున్నారని తనేజా అంటున్నారు.
లైంగిక దాడి జరిగినప్పుడు మహిళలనే తప్పు పడుతున్నారు.
జాగ్రత్తగా ఎందుకు ఉండటం లేదని ప్రశ్నిస్తున్నారు.
"అర్ధరాత్రిళ్లు బయటకెందుకు వస్తున్నారు? పురుషులతో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు? మీ వస్త్రధారణ తీరు ఇలా ఎందుకు ఉంది?" అనే ప్రశ్నలు తరచూ మహిళలకు ఎదురవుతున్నాయని తనేజా చెబుతున్నారు.
ఏదైనా అనుకోని ఘటన జరిగితే మహిళలను కూడా బాధ్యులను చేస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో సోర్స్, SAJJAD HUSSAIN/gettyimages
కావాల్సింది పశ్చాత్తాపం కాదు
ఆమె చేసే పోరాటం మహిళలకు సులభంగా చేరువ అవుతుంది. కానీ ప్రధాన లక్ష్యం పురుషులే.
"ప్రదర్శన ముగిశాక ఎందరో పురుషులు నన్ను అభినందిస్తారు. తమ కళ్లు తెరచుకున్నాయని చెబుతారు" అని తనేజా తెలిపారు.
"ఈ ప్రదర్శన చూశాక.. పురుషులుగా ఉన్నందుకు తాము సిగ్గుపడుతున్నట్లు చాలా మంది చెబుతారు. కానీ నాకు కావాల్సింది వారు పశ్చాత్తాప పడటం కాదు.. ఆలోచించడం. దీని గురించి పది మందితో చర్చించడం."
ఫొటో సోర్స్, CHANDAN KHANNA/gettyimages
ఎవరూ ప్రశ్నించరు
తనేజా ఇంకా పెళ్లి చేసుకోలేదు.
ఇతరులపై ఆధారపడే అవసరం ఆమెకు లేదు.
జీవించడానికి అవసరమైన డబ్బు ఆమెకు ప్రదర్శనల ద్వారా వస్తోంది.
అందువల్ల తన పనిని వ్యతిరేకించే వారిని ఆమె ధైర్యంగా ఎదుర్కొనగలుగుతున్నారు.
"మా కుటుంబంలో ఎవరూ నన్ను, నా పనిని ప్రశ్నించరు" అని ఆమె అన్నారు.
ఫొటో సోర్స్, NOAH SEELAM/gettyimages
మామూలు విషయం కాదు
ఇలా మహిళలు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించడమనేది మనం దేశంలో కొత్త కాదు. అలాగని అంత మామూలు వ్యవహారం కాదు.
సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలు తమ తల్లిదండ్రులతో ఉండాలని చాలా మంది అనుకుంటారు.
అయితే నేడు ఎందరో మహిళలు సంప్రదాయ సంకెళ్లను తెంచుకుని బయటకు వస్తున్నారు.
తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. తాను కూడా ఈ మార్గంలోనే నడుస్తున్నట్లు తనేజా అన్నారు.
"నచ్చని విషయాలను వ్యతిరేకించే హక్కు మనకుంది. ఇలా చేయడం వల్ల ఎన్నో పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగని భయపడకూడదు. మనకు జరిగే అన్యాయాన్ని మనమే వ్యతిరేకించకుంటే మరెవరు ఆదుకుంటారు" అని ఆమె ప్రశ్నిస్తున్నారు.
ఫొటో సోర్స్, Claudia Pajewski
ఒక్కసారి చెప్పినా చాలు
తనకు నచ్చని విషయాలకు వ్యతిరేకంగా కనీసం ఒక్క మహిళైనా గళమెత్తితే చాలు. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం దిశగా ఒక అడుగు ముందుకు పడినట్లేనని తనేజా భావిస్తున్నారు.
వ్యక్తుల్లో మార్పు వస్తేనే వ్యవస్థలో మార్పు వస్తుందని ఆమె నమ్ముతారు.
2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది.
దీనికి వ్యతిరేకంగా వేల మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు.
తమపై జరుగుతున్న దాడులపై తమ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ప్రపంచమంతా వినేలా గళమెత్తారు.
ఫలితంగా చట్టాలు మారాయి. లైంగిక దాడిని చూసే కోణం, చర్చించే విధానం మారిపోయింది.
నిర్భయ ఘటన తరువాత ఏడాదికే ముంబయిలో పని మీద బటయకు వెళ్లిన ఒక మహిళా ఫొటో జర్నలిస్ట్‌ను సామూహికంగా రేప్ చేశారు.
ఇలాంటి ఘటనలు ఎన్నో తనేజాలో గూడు కట్టుకుని తను నగ్నంగా ప్రదర్శన ఇచ్చేందుకు పురిగొల్పాయి.
ఫొటో సోర్స్, Claudia Pajewski
అందులో రాజీపడను
కాలం గడుస్తున్న కొద్దీ పది మంది ముందు నగ్నంగా నిలబడటంలో ఉండే ఇబ్బంది తగ్గుతూ పోతోంది.
మనకు తెలిసిన వారికంటే ముక్కూముఖం తెలియని ప్రేక్షకుల ముందు తన దేహాన్ని ప్రదర్శించడం సౌకర్యంగా ఉంటుందని తనేజా అంటారు.
ప్రతి ప్రదర్శనా అంత సులభం కాదు.
"ఒకోసారి నా ఆరోగ్యం సహకరించదు. మరోసారి పీరియడ్స్. ఏది ఏమైనప్పటికీ నేను వెళ్లాలి. ప్రేక్షకుల ముందు నిలబడాలి."
"అయితే ఇది నా శరీరం. దీనిపై హక్కులన్నీ నావే. ఈ విషయంలో మాత్రం రాజీపడను" అని తనేజా గట్టిగా చెబుతున్నారు.
(సమానత్వం కోసం పోరాడుతున్న భారతీయ మహిళల గాథల సిరీస్‌లో ఈ కథనం ఒకటి)
మా ఇతర కథనాలు
- ప్రశాంత నిద్ర కోరుకునే మీకోసమే ఈ 10 విషయాలు
- ‘మగాళ్లు చేస్తే ఒప్పు ఆడవాళ్లు చేస్తే తప్పా?’
- మరో వందేళ్లూ మహిళలకు సమానత్వం కలే!
- ‘పురుషుల ముందే టాయిలెట్‌కి వెళ్లాల్సి వచ్చేది’
- ద్రౌపదిని ఫెమినిస్ట్ అనడం సరైందేనా?
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- 2జీ కుంభకోణం కేసు: ఎలా పుట్టింది? ఏం జరిగింది?
- 2జీ కుంభకోణం కేసు: ‘ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా.. ఒక్క సాక్ష్యం లేదు’
- ప్రమాదకర ప్రాంతానికి వెళ్లొద్దామా!
- Exclusive: పవన్ కల్యాణ్ ఎప్పుడూ కాపులకు మద్దతు తెలపలేదు. కానీ..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)