ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ లోగోపై విమర్శలు.. విశ్వనాథన్ ఆనంద్‌దీ అదే మాట

  • 22 డిసెంబర్ 2017
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్-2018 లోగో Image copyright Shuka Design/World Chess
చిత్రం శీర్షిక ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్-2018 లోగో

చెస్ అనగానే తెలివితేటలు, ఆటలకు సంబంధించిన అంశాలే స్ఫురిస్తాయి. కానీ.. ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్-2018 లోగో చూడగానే అలాంటివేమీ గుర్తుకు రావడం లేదని, శృంగార భంగిమలను గుర్తుకు తెస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్త్రీపురుషులిద్దరు పెనవేసుకుని కూర్చుని చదరంగం ఆడుతున్నట్లుగా ఉన్న ఈ లోగోపై అంతర్జాతీయ చెస్ ఆటగాళ్లు సైతం విమర్శలు కురిపిస్తున్నారు.

చదరంగాన్ని ఇంత అసభ్యంగా చూపించడమేంటని గ్యారీ కాస్పరోవ్ వ్యాఖ్యానించారు.

భారత ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ దీనిపై ట్విటర్‌లో స్పందిస్తూ 'ఈ లోగో చదరంగాన్ని ఆడ్ పొజిషన్‌లోకి నెట్టింది'' అని అన్నారు.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్-2018 లోగో ఆటను ఆడ్ పొజిషన్‌లోకి నెట్టిందని విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చేశారు

'ఇలాంటి పొజిషన్‌లో చెస్ ఆడడం కష్టమే'

ఈ లోగోపై చెస్ ఆటతో సంబంధం లేనివారూ వ్యంగాస్త్రాలు సంధిస్తున్నారు. అమెరికా కవయిత్రి హీథర్ క్రిసిల్ తాను చేసిన ట్వీట్‌లో ''నేను చదరంగం ఆడను. కానీ, నా దేహాన్ని సరైన స్థితిలో ఎలా ఉంచాలో చెప్పేలా ఉన్న చిత్రం గీసినందుకు ధన్యవాదాలు'' అంటూ వ్యంగ్య వ్యాఖ్య చేశారు.

ఇంకో నెటిజన్ అయితే.. ''నాకైతే ఇలాంటి పొజిషన్‌లో చదరంగం ఆడడం చాలా కష్టం'' అని ట్వీట్ చేశారు.

సాధారణ చదరంగం బోర్డు కంటే ఇందులో ఉన్నది చిన్నగా ఉండడంతో కొందరు ట్వంటీ20 క్రికెట్‌తో పోల్చారు.

పైగా ఇందులో 8 గడులకు బదులుగా 6 గడులు మాత్రమే ఉండడాన్ని మరికొందరు తప్పుపట్టారు.

Image copyright SusanPolga/Twitter
చిత్రం శీర్షిక అమెరికాకు చెందిన మహిళా గ్రాండ్ మాస్టర్ సుసాన్ ట్వీట్

ఆటగాళ్ల అభ్యంతరం

ఆస్ర్టేలియా గ్రాండ్‌మాస్టర్ డేవిడ్ స్మెర్డాన్ ''ఇది జోక్ కాదు'' అంటూ ట్వీట్ చేశారు. మరో క్రీడాకారిణి సుసాన్ పోల్గార్ చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు.

చదరంగం ఆడేవారిలో 50 శాతం కంటే అధికులు చిన్నారులని.. చెస్‌ని ఇష్టపడే యువతకు కూడా ఇది సరైన సందేశం కాదని వ్యాఖ్యానించారు.

ఈ లోగోకు మద్దతుగా మాట్లాడినవారూ ఉన్నారు. అందరూ ఈ లోగో గురించే మాట్లాడుకుంటున్నారని, అంటే, ఇది విజయవంతమైనట్లేనని పలువురు అభిప్రాయపడ్డారు.

అయితే, 'వరల్డ్ చెస్' మాత్రం దీనిపై తన స్పందనేమీ వెల్లడించలేదు. లోగో గురించి కానీ, ఆ డిజైన్ ఎంపిక చేయడానికి గల కారణాల గురించి కానీ మాట్లాడలేదు.

Image copyright Twitter
చిత్రం శీర్షిక తెలుగు నెటిజన్ల కామెంట్లు

తెలుగు నెటిజన్లు ఏమంటున్నారు..?

ఇక సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే తెలుగు ప్రజలు కూడా దీనిపై స్పందించారు. సుదర్శన్ కొప్పిశెట్టి అనే ఫేస్‌బుక్ యూజర్ ''ఇదేమైనా చెస్ ఆడుతున్నట్లు ఉందా?'' అని వ్యాఖ్యానించారు.

చెస్ బోర్డు పట్టుకున్న విధానం సరిలేదని, చిత్రం స్పష్టతనివ్వలేదని దివిటి వెంకటేశ్వర్లు అనే యూజర్ అభిప్రాయపడ్డారు.

''కామసూత్ర పుస్తకం ముఖచిత్రంలా ఉంది'' అంటూ బసంత్ చౌదరి అనే ట్విటర్ యూజర్ అన్నారు.

గుండ్లపల్లి వెంకటేశ్వర్లు అనే మరో యూజర్ ''శోభనం గదిలో చదరంగం'' అంటూ ఈ లోగోపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

రమేశ్ అనే ఇంకో నెటిజన్ ''లోగో బాగానే ఉంది కానీ, ఆ పొజిషన్ బాగులేదు'' అని కామెంట్ చేశారు.

'హాయ్ హైదరాబాద్' అనే ట్విటర్ అకౌంట్‌తో ఒకరు ఈ లోగో ఏమాత్రం బాగులేదని కుండబద్దలు కొట్టేశారు.

లోగోలో ఉన్న మనుషుల చిత్రాలకు కాళ్లు వేయకుంటే సరిపోతుందని.. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పరని కీర్తి చంద్ర అనే ట్విటర్ యూజర్ సూచన చేశారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)