2జీ కుంభకోణం కేసు: ఎలా పుట్టింది? ఏం జరిగింది?

  • 21 డిసెంబర్ 2017
కనిమొళి, రాజా Image copyright Getty Images
చిత్రం శీర్షిక ఈ కేసులో నిందితులంతా నిర్దోషులేనని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది

దాదాపు ఏడేళ్లనాటి "2జీ" కుంభకోణం కేసులో తీర్పు వచ్చింది.

టెలికాం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కూతురు కనిమొళి సహా నిందితులందరినీ దిల్లీలోని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఓసారి 2జీ స్పెక్ట్రం కుంభకోణం ఏమిటి? ఇందులోని ప్రధాన ఘట్టాలను చూద్దాం.

స్పెక్ట్రం అంటే?

తరంగాల ద్వారా టెలికమ్యూనికేషన్ ప్రసారాలు జరుగుతాయి. ఈ తరంగాలనే స్పెక్ట్రం అంటారు.

2జీ స్పెక్ట్రం అనేది రెండో తరం టెలికమ్యూనికేషన్లకు సంబంధించినది.

Image copyright Getty images

కుంభకోణం ఏమిటి?

మొబైల్‌ ఫోన్ల ద్వారా మనం మాట్లాడుకోవాలన్నా, ఇంటర్నెట్, ఇతర వైర్‌లెస్ సేవలకు ఈ స్పెక్ట్రం అవసరం.

ఈ స్పెక్ట్రం కోసం టెలికాం సంస్థలు ప్రభుత్వానికి నిర్దేశిత రుసుము చెల్లించి అనుమతులు తీసుకుంటాయి.

ఇలా అనుమతులు ఇవ్వడంలో అవినీతి చోటు చేసుకుందనేది ప్రధాన ఆరోపణ.

ఎన్ని కోట్లు?

నిబంధనలు ఉల్లంఘించి అనుమతులు జారీ చేయడం వల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు కాగ్ 2010లో చెప్పింది.

ప్రధాన ఘట్టాలు..

Image copyright CHANDAN KHANNA/getyimages
చిత్రం శీర్షిక 2007లో రాజా టెలికాం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు

2007

మే: కేంద్ర టెలికాం శాఖ మంత్రిగా డీఎంకే నేత ఎ.రాజా బాధ్యతల స్వీకారం

ఆగస్టు: 2జీ స్పెక్ట్రం లైసెన్సుల జారీ, టెలికాం సర్కిళ్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం

అక్టోబరు: 46 సంస్థల నుంచి 575 దరఖాస్తులు

నవంబరు: 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో పారదర్శకత పాటించాలని, లైసెన్సుల ఫీజును సవరించాలని కోరుతూ టెలికాం మంత్రి రాజాకు ప్రధాని మన్మోహన్ సింగ్ లేఖ

Image copyright Facebook/DoT

2008

జనవరి: "ఫస్ట్ కం ఫస్ట్" విధానంలో అనుమతులు జారీ చేయనున్నట్లు టెలికాం శాఖ ప్రకటన

సెప్టెంబరు: 45 శాతం వాటాను ఎతిసలాత్‌కు విక్రయించిన స్వాన్ టెలికాం

నవంబరు: టాటా టెలీసర్వీసెస్‌లో సుమారు 26 శాతం వాటాను కోనుగోలు చేసిన డొకోమో. దాదాపు 60 శాతం వాటాను టెలినార్‌కు విక్రయించిన యునిటెక్

2009

మే: లూప్ టెలికాం సంస్థకు స్పెక్ట్రం కేటాయించడంలో నిబంధనల ఉల్లంఘన చోటు చేసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను విచారించాల్సిందిగా సీబీఐని ఆదేశించిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ)

అక్టోబరు: కొందరు టెలికాంశాఖ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, కంపెనీలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ

నవంబరు: లాబీయిస్ట్ నీరా రాడియా, టెలికాం మంత్రి రాజాల మధ్య మాటామంతీ నడవడంతోపాటు టెలికాం శాఖ విధానాల్లో కార్పొరేట్ సంస్థలు జోక్యం చేసుకున్నట్లు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం విచారణలో వెల్లడి

Image copyright MONEY SHARMA/gettyimages
చిత్రం శీర్షిక రాజాను విచారించాలంటూ సుప్రీం కోర్టులో సుబ్రమణియన్ స్వామి పిటిషన్ వేశారు

2010

సెప్టెంబరు: 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో రూ.70,000 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం, రాజాలకు సుప్రీం కోర్టు ఆదేశం

సెప్టెంబరు: టెలికాం మంత్రి రాజాను విచారించేలా ప్రధానిని ఆదేశించాలంటూ సుప్రీం కోర్టులో సుబ్రమణియన్ స్వామి పిటిషన్

సెప్టెంబరు: ఫెమా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సుప్రీం కోర్టుకు తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్

నవంబరు: 2జీ కేటాయింపుల్లో అవకతవకల వల్ల ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చిన కాగ్ నివేదిక

నవంబరు: టెలికాం మంత్రి పదవికి రాజా రాజీనామా. కపిల్ సిబల్‌కు అదనపు బాధ్యతలు

Image copyright STRDEL/gettyimages
చిత్రం శీర్షిక షాహిద్ బల్వా

2011

ఫిబ్రవరి: రాజా, డీబీ గ్రూప్ ప్రమోటర్ షాహిద్ బల్వా అరెస్ట్

ఫిబ్రవరి: డీఎంకే‌కు చెందిన కలైంగర్ టీవీకి షాహిద్ బల్వా అక్రమంగా నిధులు తరలించినట్లు దిల్లీ హై కోర్టుకు తెలిపిన సీబీఐ

మార్చి: 2జీ కుంభకోణం విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు

ఏప్రిల్ 2: సీబీఐ తొలి ఛార్జ్ షీట్

ప్రధాన నిందితులు: రాజా, ఆయన ప్రైవేటు కార్యదర్శి ఆర్‌కె చండోలియా, టెలికాం శాఖ మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురా

ప్రధాన కంపెనీలు:రిలయన్స్ కమ్యూనికేషన్స్, స్వాన్ టెలికాం, యునిటెక్ వైర్‌లెస్ (తమిళనాడు)

Image copyright MONEY SHARMA
చిత్రం శీర్షిక సీబీఐ ఛార్జ్ షీట్‌లో కనిమొళి పేరును చేర్చింది

ఏప్రిల్ 25: సీబీఐ రెండో ఛార్జ్ షీట్

ప్రధాన నిందితులు: డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె కనిమొళి

నవంబరు: విచారణ ప్రారంభం

డిసెంబరు: సీబీఐ మూడో ఛార్జ్ షీట్

నిందితులు: ఎస్సార్ గ్రూప్ ప్రమోటర్లు అన్షుమన్ రుయా, రవి రుయా; ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్ (స్ట్రాటజీ, ప్లానింగ్) వికాస్ సరా; లూప్ టెలికాం ప్రమోటర్లు కిరణ్ ఖైతాన్, ఆమె భర్త ఐ.పి. ఖైతాన్

కంపెనీలు: లూప్ టెలికాం, లూప్ మొబైల్, ఎస్సార్ టెలి హోల్డింగ్

2012

ఫిబ్రవరి: టెలికాం మాజీ మంత్రి రాజా హయాంలో జారీ చేసిన 122 లైసెన్సుల రద్దు

ఆగస్టు: తగిన ప్రాథమిక ఆధారాలు లేవంటూ, పి.చిదంబరాన్నివిచారించాలన్న అభ్యర్థనలను తోసిపుచ్చిన సుప్రీం కోర్టు

Image copyright MONEY SHARMA/getty images
చిత్రం శీర్షిక కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం

2013

డిసెంబరు: లోక్‌సభకు 2జీ నివేదికను సమర్పించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ

2014

ఏప్రిల్: రాజా, కనిమొళిలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్

మే: ప్రధానికి తెలిసే అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు కోర్టుకు రాజా వాంగ్మూలం

Image copyright MONEY SHARMA/getty images
చిత్రం శీర్షిక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్

2017

ఏప్రిల్: ప్రత్యేక కోర్టు విచారణ పూర్తి

డిసెంబరు 21: అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందంటూ రాజా, కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేల్చిన ప్రత్యేక కోర్టు

(ఆధారం: ఈడీ వర్సెస్ ఎ.రాజా కేసు తీర్పు, టెలికాం మంత్రిత్వశాఖ, కాగ్)

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)