జెరూసలేం: ట్రంప్ ప్రకటనను తిరస్కరిస్తూ ఐరాస తీర్మానం

  • 22 డిసెంబర్ 2017
డొనాల్డ్ ట్రంప్ Image copyright Getty Images

జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తించటాన్ని అమెరికా ఉపసంహరించుకోవాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సభ తీర్మానాన్ని ఆమోదించింది.

జెరూసలేం నగర హోదాకు సంబంధించిన ఏ నిర్ణయమైనా చెల్లదని, దానిని రద్దు చేయాలని ఈ తీర్మానం స్పష్టం చేస్తోంది.

భారతదేశం సహా 128 దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. మరో 35 దేశాలు ఓటు వేయకుండా తటస్థంగా ఉండగా.. తొమ్మిది దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి.

అయితే ఈ తీర్మానానికి అమెరికా కట్టుబడి తీరాల్సిన అవసరం లేదు.

ఈ తీర్మానానికి మద్దతు తెలిపిన దేశాలకు ఆర్థిక సాయం ఆపివేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో జరిగిన ఓటింగ్‌లో దీనికి సమితి సభ్యదేశాలు భారీ సంఖ్యలో సమర్థించాయి.

Image copyright Getty Images

ఐరాస సభ్య దేశాలు ఎలా ఓటేశాయి?

ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాలు: అమెరికా, ఇజ్రాయెల్, గ్వాటెమెలా, హోండూరస్, మార్షల్ ఐలాండ్స్, మైక్రోనేసియా, నౌరు, పాలౌ, టోగో.

ఓటింగ్‌లో పాల్గొనని 35 దేశాల్లో కెనడా, మెక్సికోలు ఉన్నాయి.

తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన దేశాల్లో సమితి భద్రతా మండలిలోని అమెరికా మినహా నాలుగు శాశ్వత సభ్య దేశాలు (చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్) ఉన్నాయి. ముస్లిం ప్రపంచంలోని అమెరికా కీలక మిత్ర దేశాలు కూడా ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి.

21 దేశాలు తీర్మానంపై ఓటింగ్‌కు హాజరు కాలేదు.

Image copyright Getty Images

జెరూసలేం హోదాపై వివాదమేమిటి?

జెరూసలేం హోదా అంశం.. పాలస్తీనియన్లతో ఇజ్రాయెల్ ఘర్షణకు కేంద్ర బిందువు.

1967 పశ్చిమాసియా యుద్ధం సందర్భంగా జెరూసలేం నగర తూర్పు భాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. మొత్తం నగరం తన అవిభాజ్య రాజధానిగా ఆ దేశం పరిగణిస్తోంది.

అయితే.. తమ భవిష్యత్తు దేశానికి తూర్పు జరూసలేం రాజధాని అని పాలస్తీనియన్లు వాదిస్తున్నారు. ఈ ప్రాంత హోదా విషయాన్ని.. శాంతి చర్చల్లో తర్వాది దశల్లో చర్చించాల్సి ఉంది.

జెరూసలేం మీద ఇజ్రాయెల్ సార్వభౌమాధికారాన్ని అంతర్జాతీయంగా ఎన్నడూ గుర్తించలేదు. అన్ని దేశాలూ ప్రస్తుతం టెల్ అవీవ్‌లోనే తమ రాయబార కార్యాలయాలను కొనసాగిస్తున్నాయి. అయితే.. అమెరికా రాయబార కార్యాలయాన్ని టెల్ అవీవ్ నుంచి జెరూసలేంకు మార్చే పనిని ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విదేశాంగ శాఖకు నిర్దేశించారు.

ఐరాస తీర్మానం ఏం చెప్తోంది?

మొత్తం 193 సభ్యదేశాల ఐరాస సర్వసభ్య సభ.. అరబ్, ముస్లిం దేశాల విజ్ఞప్తి మేరకు అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జెరూసలేం విషయంలో దశాబ్దాలుగా ఉన్న అమెరికా విధానాన్ని తలకిందులు చేస్తూ ట్రంప్ ఈ నెల మొదట్లో తీసుకున్న నిర్ణయాన్ని అరబ్, ముస్లిం దేశాలు ఖండించాయి.

ఐరాస సర్వసభ్య సభ గురువారం నాడు ఆమోదించిన తీర్మానం వంటిదానినే ఐరాస భద్రతా మండలి కూడా చేయగా అమెరికా దానిని వీటో చేసింది. దీంతో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయాలని పాలస్తీనా కోరింది.

టర్కీ, యెమెన్‌లు ప్రతిపాదించిన ఈ తీర్మానంలో అమెరికా పేరును ప్రస్తావించలేదు. అయితే ‘‘జెరూసలేం హోదాకు సంబంధించి ఇటీవల తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర విచారం’’ వ్యక్తం చేసింది.

‘‘పవిత్ర నగరమైన జెరూసలేం స్వభావం, హోదా, జనాభా కూర్పును మార్చేందుకు ఉద్దేశించిన ఎటువంటి నిర్ణయాలు, చర్యలకైనా చట్టబద్ధత లేదు, చెల్లవు. అటువంటి వాటిని సంబంధిత అంశంపై భద్రతామండలి తీర్మానాలకు అనుగుణంగా కొట్టివేయాలి’’ అని కూడా ఆ తీర్మానం చెప్తోంది.

Image copyright Getty Images

ఇజ్రాయెల్, పాలస్తీనాలు ఏమంటున్నాయి?

’’ఐక్యారాజ్యసమితి ఓ అబద్ధాల సభ‘‘ అని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అభివర్ణించారు. ఈ తీర్మానంపై ఓటింగ్ ఫలితాలను తిరస్కరిస్తామని ప్రకటించారు.

అనంతరం ఆయన ఒక ప్రకటన చేస్తూ.. ‘‘జెరూసలేంకు అనుకూలంగా విస్పష్టమైన వైఖరిని అవలంబిస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌కు ఇజ్రాయెల్ కృతజ్ఞతలు చెప్తోంది. ఇజ్రాయెల్ తరఫున, సత్యం తరఫున ఓటు వేసిన దేశాలకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం’’ అని పేర్కొన్నారు.

ఈ తీర్మానం ‘‘పాలస్తీనా విజయం’’ అని ఆ దేశాధ్యక్షుడు మొహమ్మద్ అబ్బాస్ అధికార ప్రతినిధి ఒకరు అభివర్ణించారు.

Image copyright Getty Images

ఈ తీర్మానాన్ని అమెరికా ఎలా పరిగణిస్తోంది?

తీర్మానంపై ఓటింగ్ జరగటానికి ముందు ఐరాసలో అమెరికా శాశ్వత ప్రతినిధి నిక్కీ హేలీ ప్రసంగిస్తూ.. తుది హోదా అంశాలు వేటిపైనా అమెరికా నిర్ణయం ముందస్తు తీర్పు ఇవ్వడం లేదని, ఉభయ పక్షాలూ అంగీకరించినట్లయితే రెండు దేశాల పరిష్కారాన్ని ఆటంకపరచటం లేదని పేర్కొన్నారు.

‘‘ఒక సార్వభౌమాధికార దేశంగా అమెరికా తన హక్కును ఉపయోగించుకున్నందుకు సర్వసభ్య సభలో ఏకాకిని చేసి దాడిచేసిన ఈ రోజును అమెరికా గుర్తుపెట్టుకుంటుంది’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘అమెరికా మా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంలో ఏర్పాటుచేస్తుంది. మేం ఆ పని చేయాలనే అమెరికా ప్రజలు కోరుకుంటున్నారు. అది సరైన పని. ఐక్యరాజ్యసమితిలో ఏ ఓటూ ఇందులో ఏ మార్పూ చేయబోదు’’ అని స్పష్టంచేశారు.

ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసే దేశాలకు తాను ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తానని ట్రంప్ బుధవారం నాడు హెచ్చరించారు.

‘‘వాళ్లు లక్షలాది డాలర్లు, కోట్లాది డాలర్లు కూడా తీసుకుంటారు. ఆపైన మాకు వ్యతిరేకంగా ఓటు వేస్తారు. సరే. మేం ఆ ఓట్లు చూస్తున్నాం. వాళ్లని మాకు వ్యతిరేకంగా ఓటు వేయనివ్వండి. మాకు చాలా ఆదా అవుతుంది. మేమేం పట్టించుకోం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


Image copyright Getty Images

ట్రంప్ ప్రతీకార చర్యలు చేపడతారా?

బీబీసీ అరబ్ వ్యవహారాల విశ్లేషకుడు సెబాస్టియన్ ఉషర్ విశ్లేషణ

ఐరాస సర్వసభ్యసభ తీర్మానంపై ఓటింగ్ ఫలితం ఊహించినదే: మెజారిటీ దేశాలు ఆ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తాయని అమెరికాకు తెలుసు. కానీ ఊహించినదానికన్నా కాస్త ఎక్కువ దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకపోవడమో, తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయటమో జరగొచ్చు. అది ట్రంప్ ప్రభుత్వానికి కాస్త ఊరటనిస్తుంది.

తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన మైక్రోనేసియా, నౌరు, టోగో వంటి దేశాల విషయంలో పెద్ద ఆశ్యర్యం లేదు. తమకు సాయం చేసే అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఓటు వేయటం ద్వారా వాటికి ఒనగూరేదేమీ లేదు.

ఓటింగ్‌లో పాల్గొనని దేశాల్లో కెనడా, మెక్సికో, పోలండ్‌లు.. అమెరికాతో తమ సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు అలా చేశాయి.

అమెరికా మిత్ర దేశాల్లో శక్తివంతమైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయటాన్ని.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెంప పెట్టులా భావించవచ్చు. అయితే.. ఐరాస ప్రస్తుత యథాతథస్థితికి అనుగుణంగా తాము ఓటు వేశామని ఆ దేశాలన్నీ వాదించవచ్చు. అవి తమ వైఖరిని మార్చుకోవడానికి బలమైన కారణం లేదు.

కానీ.. ఈ తీర్మానానికి మద్దతిచ్చిన దేశాలకు ఆర్థిక సాయంపై పునరాలోచిస్తామన్న తన హెచ్చరికలపై ట్రంప్ ప్రభుత్వం ముందుకు వెళుతుందా అన్నది నిజమైన పరీక్ష. అలాగే.. జెరూసలేంపై అమెరికా నిర్ణయం ప్రకటించిన నాటి నుంచీ కొనసాగుతున్నా ఇంకా విస్తృతం కాని నిరసనలకు ఐరాస తీర్మానం కొత్త ఉత్సాహాన్నిస్తుందా అన్నది కూడా కీలకమైన అంశం.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ముఖ్యమైన కథనాలు

కరోనా వైరస్: ఇన్ఫెక్షన్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆరు మ్యాపుల్లో...

అంతర్జాతీయ పోటీల్లో భారత్ పెట్టుకున్న ఆశల భారాన్ని మహిళా క్రీడాకారులు ఎలా మోస్తున్నారు

కరోనా వైరస్: చైనాలో 106కు చేరిన మరణాలు... ఇతర దేశాల్లో పెరుగుతున్న బాధితులు

ఆఫ్రికా: ప్రధాని భార్య హత్య మిస్టరీ... ఆరోపణల్లో కూరుకుపోయిన ప్రధాని థామస్, ఆయన రెండో భార్య

అఫ్గానిస్తాన్‌లో మా విమానం కూలడం నిజమే: అమెరికా సైన్యం

ఎయిర్ ఇండియా: రూ. 22,863 కోట్ల రుణ భారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం

'దిశ' కేసులో తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద 40 అడుగుల ఎత్తున ఉన్న సీసీ కెమేరా ఫుటేజిలో కీలక దృశ్యాలు

కోబ్ బ్రయాంట్: బాస్కెట్ బాల్ సూపర్ స్టార్, ఆయన 13 ఏళ్ళ కుమార్తె హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం