చైనాలో వివాహేతర సంబంధాల సమస్య: పరిష్కారానికి 33 టెక్నిక్‌లు

  • ఎడ్ బట్లర్
  • బీబీసీ ప్రతినిధి
పడుకుని ఉన్న ఒక యువతి

ఫొటో సోర్స్, Alamy

చైనా సేవా రంగంలో ఒక భిన్నమైన పరిశ్రమ విస్తరిస్తోంది. వివాహేతర బంధం ఏర్పరచుకొన్న వ్యక్తులను వారి జీవిత భాగస్వాముల విజ్ఞప్తి మేరకు ఆ బంధంలోంచి బయటకు తీసుకురావడమే ఇందులోని నిపుణుల పని. భారత కరెన్సీలో చెబితే లక్షల రూపాయలు చెల్లించి, బాధితులు ఈ పని చేయించుకొంటున్నారు. ఈ సాయం కోరేవారిలో అత్యధికులు మహిళలే.

ఈ సేవలు అందించే సంస్థల్లో షాంఘై నగరంలోని 'వీక్వింగ్ లవ్ హాస్పిటల్' అనే సంస్థ ప్రముఖమైనది.

ఈ సంస్థ సాయంతో తన భర్తను వివాహేతర బంధంలోంచి బయటకు రప్పించుకొన్న ఓ నడివయస్కురాలిని ఒక కార్యాలయంలో కలిసి, మాట్లాడాను. ఆమె తన పేరు గోప్యంగా ఉంచాలని కోరారు.

ఈ సంక్షోభం ముగిసిపోయాక, భర్తతో తన బంధం బలపడిందని ఆమె చెప్పారు. ఇంతకుముందు, తమ బంధాన్ని వివాహ బంధం మాత్రమే అనుకొనేదానినని, అయితే ఇది అంతకంటే పెద్దదని గుర్తించానని ఆమె తెలిపారు. జీవితం ఇప్పుడు మెరుగుపడిందని, అసలు జీవితమంటే ఇప్పుడు తాను ఆస్వాదిస్తున్నదేనని ఉద్వేగంగా చెప్పారు.

సానుకూల దృక్పథంతో ఆలోచించడం, భార్యగా మరింత బాగా వ్యవహరించడం లాంటి అంశాలపై ఆమె అనేక వారాలపాటు కౌన్సెలింగ్ తీసుకొన్నారు.

ఫొటో సోర్స్, Alamy

ఆయన నాతో మాట్లాడటం మానేశారు

తన భర్తకు ఆయన వద్ద సెక్రటరీగా పనిచేసే 24 ఏళ్ల యువతితో సంబంధముందని తన దృష్టికి వచ్చిందని, దీనిపై ఆయన్ను నిలదీశానని ఆమె చెప్పారు.

''ఇద్దరం తీవ్రంగా గొడవ పడ్డాం. 'ఎందుకు ఇలా చేస్తున్నావ్' అని అడిగాను. తనది తప్పేనని మొదట ఒప్పుకొన్నారు. ఇద్దరి మధ్య గొడవల తర్వాత ఆయన నాతో మాట్లాడటం మానేశారు. అప్పుడే వీక్వింగ్ సంస్థను సంప్రదించాను'' అని ఆమె తెలిపారు.

వీక్వింగ్ నిపుణులు, సిబ్బంది రంగంలోకి దిగారు. తమ అసలు వివరాలు వెల్లడించకుండా ఆ యువతితో పరిచయం పెంచుకున్నారు.

''నీతో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి నీకన్నా చాలా పెద్దవాడు. నీ వయసుతో పోలిస్తే ఆయనకు రెండింతల వయసు. ఆయన నీకు సరితూగడు'' అనే కోణంలో ఆమెతో మాట్లాడారు. చివరకు ఆయనకు దూరం జరిగేలా ఆమెను ఒప్పించారు.

ఫొటో క్యాప్షన్,

మింగ్ లీ, వీక్వింగ్ లవ్ హాస్పిట్

విడాకుల కన్నా ఇదే నయం

ఈ వివాహేతర సంబంధంలోంచి తన భర్తను బయటకు తెచ్చుకొనేందుకు బాధిత మహిళ వేల డాలర్లు వెచ్చించాల్సి వచ్చింది. అయితే విడాకులు తీసుకొని తన భర్త నుంచి శాశ్వతంగా విడిపోవడం కన్నా ఇది మెరుగైన ప్రత్యామ్నాయమేనని ఆమె భావిస్తున్నారు.

''నేను, నా భర్త కలిసి జీవితంలో చాలా దూరం ప్రయాణించాం. ఈ బంధాన్ని నేను వదులుకోదలచుకోలేదు. నా భర్త నుంచి నేను విడిపోవాలని ఎన్నడూ అనుకోలేదు. నాకు ఆ ఆలోచనే లేదు. పైగా, నా వయసు 50 ఏళ్లకు దగ్గర్లో ఉంది. ఈ వయసులో విడాకులు తీసుకోవడం మంచిది కాదు కూడా'' అని ఆమె వివరించారు.

''మీ భర్తను ఇప్పటికీ ప్రేమిస్తున్నారా? ఇప్పుడు దూరం జరిగిన యువతి స్థానంలో మరో మహిళ ఆయన జీవితంలోకి వచ్చే అవకాశం లేదా'' అని ప్రశ్నించగా- తన భర్తను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని ఆమె బదులిచ్చారు. ఆయనలో తనకు నచ్చే విషయాలు చాలా ఉన్నాయన్నారు. తమ దాంపత్యంలో సమస్య ఎక్కడుందో గుర్తించానని, ఇకపై ఏ సమస్యా లేకుండా కలసి సాగుతామని ఆమె తెలిపారు.

ఫొటో సోర్స్, The People's Daily

ఫొటో క్యాప్షన్,

ఎరుపు రంగులో ఉన్న ప్రాంతాల్లో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయని సూచించే మ్యాప్

10 లక్షల మందికి సేవలు

'వీక్వింగ్' వ్యవస్థాపకులు మింగ్ లీ, షు క్సిన్ 17 సంవత్సరాలుగా ఈ సంస్థను నడుపుతున్నారు. ఇప్పటివరకు తాము పది లక్షల మందికి పైగా క్లైంట్లకు సేవలు అందించామని వారు చెప్పారు.

అంటే ఈ ఒక్క సంస్థ వద్దే సగటున ఏడాదికి సుమారు 59 వేల మంది ఈ సేవలు పొందారు.

వైవాహిక జీవితం సాఫీగా, సంతోషంగా సాగేలా చూసుకోవడం, ఇతర మహిళల పట్ల భర్తకు ఆసక్తి మళ్లకుండా జాగ్రత్త పడటం లాంటి అంశాలపై మహిళలకు మింగ్ లీ కౌన్సెలింగ్ ఇస్తుంటారు.

వివాహ బంధంలో అనేక రకాల సమస్యలు ఉంటాయని షు క్సిన్ ప్రస్తావించారు. 'అఫైర్' తీవ్రమైన సమస్య అని, ఇది కుటుంబానికి మంచిది కాదని, సమాజ స్థిరత్వానికి కూడా మంచిది కాదని తెలిపారు.

ఆ నాలుగు టెక్నిక్‌లే ప్రధానం

పెళ్లైన పురుషుడితో సంబంధం పెట్టుకున్న మహిళను అతడి నుంచి విడిపోయేలా చేసేందుకు 33 టెక్నిక్‌లు ఉన్నాయని షు క్సిన్ తెలిపారు. వీటిలో నాలుగు టెక్నిక్‌లు ప్రధానమైనవని చెప్పారు. ఈ నాలుగింటిలోనూ అవతలివారిని ఎంతో కొంత మభ్యపెట్టడమో, మోసం చేయడమో ఉంటుంది.

అవేంటంటే- అలాంటి మహిళను మరో పురుషుడితో ప్రేమలో పడేలా చేయడం; భర్త పనిచేసే సంస్థను సంప్రదించి, అతడిని మరో నగరానికి బదిలీ చేయించడం; భర్త తల్లిదండ్రులు లేదా స్నేహితులు కలగజేసుకొనేలా చూడటం; అతడి వ్యక్తిత్వం గురించి చెడుగా మాట్లాడటం, వంశపారంపర్యంగా వచ్చే రోగాల ముప్పు గురించి ఆందోళన కలిగేలా చెప్పడం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

షు క్సిన్, వీక్వింగ్ లవ్ హాస్పిటల్

మిగతా 29 టెక్నిక్‌లు ఏమిటని అడగ్గా, అవి తమ వ్యాపార రహస్యాలని, వాటి గురించి మీడియాకు చెప్పలేమని షు క్సిన్ బదులిచ్చారు.

ఇలాంటి సమస్యలను పరిష్కరించే క్రమంలో సంబంధిత సంస్థలు లంచాలు ఇవ్వడం, బెదిరింపులకు దిగడం, బలవంతపెట్టడం లాంటి నేరాలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలతో చైనా మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తుంటాయి. వీటిపై 'వీక్వింగ్' స్పందిస్తూ- తాము ఎన్నడూ చట్టవిరుద్ధంగా వ్యవహరించలేదని పేర్కొంది.

వీక్వింగ్ సంస్థ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో త్వరలోనే నమోదు (లిస్టింగ్) అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.

అది తిరుగులేని టెక్నిక్

షాంఘైలో డాయ్ పెంగ్-జున్ అనే వ్యక్తి కూడా ఇలాంటి సేవలు అందిస్తున్నారు. ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీ సేవల్లో భాగంగా ఆయన ఈ సేవలు అందిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని సిబ్బంది చైనా అంతటా పర్యటిస్తూ విధులు నిర్వహిస్తుంటారు.

వివాహేతర సంబంధాలు తెగిపోయేలా చేయడానికి తిరుగులేని టెక్నిక్ ఒకటుందని ఆయన చెప్పారు.

''అదేంటంటే- అలాంటి మహిళతో మాలో ఎవరో ఒక పురుషుడు స్నేహం చేసి, దగ్గరవుతాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు, వీడియోలు తీసుకుంటాడు. తర్వాత వాటిని మా క్లైంట్‌కు ఇస్తాం. ఆ ఫొటోలు, వీడియోలు అతడి దృష్టికి వెళ్లినప్పుడు తన ప్రియురాలు తన పట్ల నిజాయతీగా, నమ్మకంగా లేదని మా క్లైంట్ భర్త గుర్తిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో అతడు ఆమెకు దూరం జరిగి, తన కుటుంబానికి దగ్గరవుతాడు. ఈ ప్రయత్నం చాలా సందర్భాల్లో ఫలితాన్నిస్తుంది'' అని డాయ్ పెంగ్-జున్ వివరించారు.

ఫొటో క్యాప్షన్,

డాయ్ పెంగ్-జున్

ఇది సహజమని ధనవంతుల భావన

తాము ఎంతో ముఖ్యమైన ప్రజాసేవ చేస్తున్నామని డాయ్ పెంగ్-జున్ చెప్పారు. ఎందుకంటే చైనాలోని సంపన్నుల్లో అత్యధిక పురుషులు వివాహేతర బంధాన్ని కలిగి ఉండటం సహజమని భావిస్తారని తెలిపారు.

ధనవంతుల్లో ఈ ఆలోచనతో కూడిన 'సంప్రదాయం' చైనాలో చాలా కాలం కిందటి నుంచే ఉంది. ఛైర్మన్ మావో ట్సే టుంగ్ హయాంలో దీనిని చట్టవిరుద్ధమని ప్రకటించారు. వివాహ చట్టంలో స్త్రీ, పురుషులకు సమాన హక్కులు కల్పించారు.

1976లో ఛైర్మన్ మావో మరణించారు. తదనంతర కాలంలో మార్కెట్ సంస్కరణలతో ఎంతో మంది వద్ద ఇబ్బడిముబ్బడిగా సంపద వచ్చి పడింది.

ఈ నేపథ్యంలో, డబ్బు, పలుకుబడి ఉన్న చైనీయులు వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం పెరుగుతోంది.

వివాహేతర బంధాల్లో సీపీసీ అధికారులు

ఇలాంటి సంబంధాలు పెట్టుకుంటున్న వారిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) అధికారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అవినీతికి వ్యతిరేకంగా ప్రస్తుత అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీటి ఫలితంగా నేరం నిరూపితమైన సీపీసీ అధికారుల్లో 95 శాతం మందికి వివాహేతర సంబంధాలున్నట్లు చైనా అధికార మీడియాలో వెలువడిన ఒక సర్వే వెల్లడించింది.

మూడేళ్ల క్రితం చైనాలో వివాహేతర సంబంధాలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయో సూచించే ఒక మ్యాప్‌ను 'ద పీపుల్స్ డెయిలీ' పత్రిక ప్రచురించింది.

ఫొటో క్యాప్షన్,

ఇలాంటి సేవలు అందించే ఒక సంస్థకు చెందిన ఇద్దరు సిబ్బంది

తన బృందంలో పనిచేస్తున్న డాయ్ అనే ఒక వ్యక్తిని డాయ్ పెంగ్-జున్ నాకు పరిచయం చేశారు. పెళ్లైన పురుషులతో సంబంధాలు పెట్టుకున్న మహిళలకు దగ్గరవడంలో డాయ్‌కు ప్రత్యేక నైపుణ్యం ఉంది.

ఏ మహిళ ఏం ఆశిస్తున్నారనే భిన్న కోణాల్లో ఆలోచించి అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.

ఉదాహరణకు కొంత మంది విలాసవంతమైన జీవనశైలిని ఇష్టపడతారని, మరికొందరు ఖరీదైన వస్తువులు సమకూర్చాలని, మంచి రెస్టారెంట్లకు వెళ్లాలని కోరుకొంటారని, అలాంటి కోరికలను తాము తీరుస్తామని ఆయన తెలిపారు.

ఇలాంటి చాలా మంది మహిళలకు డబ్బే ప్రధానమని తాను గుర్తించానని ఆయన చెప్పారు.

విడాకుల చట్టాలూ కారణమే

చైనాలో ఈ సమస్య ఇంత తీవ్రంగా ఉండటానికి ఇక్కడున్న విడాకుల చట్టాలు కూడా కొంత మేర కారణమని రచయిత, సామాజికవేత్త ఝాంగ్ లిజియా అభిప్రాయపడ్డారు. విడాకులు తీసుకొని తన నుంచి విడిపోయే భార్యకు.. పెళ్లి అయినప్పుడు తనకున్న సంపదలో చిల్లిగవ్వ కూడా భర్త ఇవ్వక్కర్లేదని చట్టాలు చెబుతున్నాయి. పిల్లల సంరక్షణ బాధ్యతలు కూడా పురుషుడి కుటుంబానికే అప్పగిస్తారు. 2011 నుంచి ఈ నిబంధనలు అమలవుతున్నాయి.

నగరాలను మినహాయిస్తే ఇతర ప్రాంతాల్లో విడాకులు తీసుకొనే మహిళలను చిన్నచూపుతో చూస్తారని ఝాంగ్ లిజియా చెప్పారు.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)