తాజా ఆంక్షలతో ఉత్తర కొరియా చుక్క పెట్రోల్‌ కోసం తల్లడిల్లాల్సిందే!

కిమ్ జోన్ - ఉన్, డొనాల్డ్ ట్రంప్

బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేసిన ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి తాజాగా మరిన్ని కఠిన ఆంక్షలు విధించింది. అమెరికా ప్రతిపాదించిన ఈ తీర్మానంతో ఉత్తర కొరియా పెట్రోల్ దిగుమతులు 90% మేర తగ్గుతాయి.

అమెరికా రూపొందించిన ఈ ఆంక్షల తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో 'ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి'ని డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు.

ఉత్తర కొరియాపై అదనపు ఆంక్షలు విధించే అంశంపై ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిగింది. ఇందుకు భద్రతా మండలిలోని 15 దేశాలు మద్దతు తెలుపుతూ ఓటు వేశాయి.

దీంతో.. 'ప్రపంచం శాంతిని కాంక్షిస్తోంది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.

ఉత్తర కొరియాకు ప్రధాన వ్యాపార భాగస్వాములైన రష్యా, చైనా దేశాలు కూడా ఆంక్షల తీర్మానానికి మద్దతుగానే ఓటు వేశాయి. ఇప్పటికే ఉత్తర కొరియా మీద ఐక్యరాజ్య సమితితో పాటుగా అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించాయి.

''ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని 15 దేశాలూ ఈ తీర్మానానికి మద్దతుగా ఓటు వేశాయి. ప్రపంచం శాంతిని కాంక్షిస్తోంది. మృత్యువును కాదు!'' అని ట్రంప్ ట్వీట్ చేశారు.

ఉత్తర కొరియా వైఖరి మారకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఈ తీర్మానం స్పష్టం చేసిందని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు.

''ఆధునిక ప్రపంచంలోని దుష్ట శక్తికి ఉత్తర కొరియా ఉదాహరణగా నిలుస్తుంది'' అని ఆమె వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియాపై ఆంక్షలు విధించడంలో తాజా తీర్మానం ఓ కీలకమైన అడుగు అని బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఉత్తర కొరియా నిర్లక్ష్య వైఖరిని నిరసించడంలో ప్రపంచ దేశాలన్నీ ఐక్యమయ్యాయని జాన్సన్ అభిప్రాయపడ్డారు.

కొరియా ద్వీపకల్పం వివాదం చాలా సున్నితమైన అంశమని, ఆ ప్రాంతంలో ఉద్రక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

తాజా ఆంక్షలు :

ఈ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలని ఆశిస్తూ ఈ కింది ఆంక్షలను ప్రతిపాదిస్తున్నట్లు అమెరికా పేర్కొంది.

  • ఏటా పెట్రో బ్యారెల్స్ సరఫరాను 5 లక్షలకు, క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ స‌రఫరాను 40 లక్షలకు పరిమితం చేస్తారు.
  • ఇతర దేశాల్లో పనిచేస్తున్న ఉత్తర కొరియా పౌరులందరూ 24 నెలల గడువులోగా స్వదేశానికి తిరిగివెళ్లాల్సి ఉంటుంది. దీని ద్వారా ఉత్తర కొరియాకు విదేశీ మారక ద్రవ్యాన్ని నియంత్రించవచ్చు.
  • ఉత్తర కొరియాకు చెందిన యంత్రాలు, ఎలక్ట్రిక్ వస్తువుల ఎగుమతులపై కూడా నిషేధం విధిస్తారు.

ప్రపంచ దేశాలు ఒత్తిడి చేసినా ఉత్తర కొరియా తన అణ్వాయుధ ప్రయోగాలను ఆపలేదు. అప్పటినుంచి ఉద్రిక్తతలు మళ్లీ ప్రారంభమయ్యాయి.

అయితే నవంబర్ 28న ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ కారణం చేతనే అమెరికా తాజా ఆంక్షల తీర్మానాన్ని తెరపైకి తెచ్చింది.

వరుస ప్రయోగాల నేపథ్యంలో.. అణ్వాయుధ కార్యక్రమాలను ఆపకపోతే మొత్తం ఉత్తర కొరియానే నాశనం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అందుకు బదులుగా.. ట్రంప్‌కు మతిభ్రమించింది అంటూ ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ స్పందించారు.

గతంలోని ఆంక్షల పరిస్థితి ఏమిటి?

బాలిస్టిక్, న్యూక్లియర్ కార్యక్రమాలను నియంత్రించేందుకే ఈ తాజా ఆంక్షలను విధించామని అమెరికా చెబుతోంది.

ఉత్తర కొరియా నౌకా వ్యాపారం, ఉత్తర కొరియాతో వ్యాపారం చేసే చైనా కంపెనీలు లక్ష్యంగా గతంలో ఈ ఆంక్షలను విధించారు.

సెప్టెంబర్ 3న ఉత్తర కొరియా అణ్వస్త్రాన్ని పరీక్షించింది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా కొన్ని ఆంక్షలు విధించింది. అందులో.. చమురు దిగుమతులు, టెక్స్‌టైల్స్‌ ఎగుమతులపై నిషేధం ముఖ్యమైనవి.

చమురు నిల్వలు, ఆర్థిక రంగాల్లో కొరత సృష్టించి.. అణ్వాయుధ కార్యక్రమాలను నియంత్రించే ప్రయత్నమది.

పాత ఆంక్షల ప్రభావం ఎంత?

అమెరికా దాదాపు దశాబ్ద కాలంగా ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూనే ఉంది.

ఈ ఆంక్షలు తమ అణ్వాయుధ కార్యక్రమాలను మరింత ప్రేరేపిస్తాయని ఉత్తర కొరియా చెప్పింది. ఐక్యరాజ్య సమితి ఒత్తిడికి కూడా తలొగ్గకుండా ఉత్తర కొరియా.. అణు, క్షిపణి ప్రయోగాలను కొనసాగించింది.

  • నవంబర్ 30 2016 :ఉత్తర కొరియా - చైనా మధ్య బొగ్గు వ్యాపారం ప్రధానమైంది. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి.. ఉత్తర కొరియా బొగ్గు ఎగుమతులను 60 శాతానికి తగ్గిస్తూ ఆంక్షలు విధించింది. దీంతోపాటుగా కాపర్, నికెల్, సిల్వర్, జింక్ ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది.
  • తర్వా ఏం జరిగింది?: 2017 మే 14న ఉత్తర కొరియా అత్యాధునిక 'బాలిస్టిక్ రాకెట్' ప్రయోగించింది. ఈ రాకెట్‌కు అణ్వస్త్ర సామర్థ్యం ఎక్కువని ఆ దేశం పేర్కొంది.
  • 2017 జూన్ 2: ఉత్తర కొరియా సీమాంతర నిఘా ఆపరేషన్లు సహా నాలుగు సంస్థలు, 14 మంది అధికారుల పర్యటనలపై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించింది.
  • తర్వా ఏం జరిగింది?: జూలై 4న తన మొదటి ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించామని ఉత్తర కొరియా ప్రకటించింది.
  • 2017 ఆగస్ట్ 6: ఉత్తర కొరియా బొగ్గు, ఓర్, ఇతర ముడి ఖనిజాల ఎగుమతులపై ఐక్యరాజ్య సమితి నిషేధం విధించింది. దీంతో ఉత్తర కొరియాలో పెట్టుబడులు గణనీయంగా పడిపోయాయి. ఫలితంగా 100 కోట్ల డాలర్ల వరకూ ఉత్తర కొరియాకు నష్టం వాటిల్లింది. ఇది ఆ దేశ ఎగుమతుల్లో మూడో వంతు.
  • తర్వా ఏం జరిగింది?: సెప్టెంబర్ 3న హైడ్రోజన్ బాంబ్‌ను పరీక్షించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ బాంబును చిన్న సైజుకు తగ్గించి, దీర్ఘ శ్రేణి క్షిపణుల్లో ఉపయోగించవచ్చునని పేర్కొంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)