2017 మొత్తంగా... ఈ చిత్రాల్లో మీకోసం!
ఒక సంవత్సరం మొత్తాన్నీ కేవలం ఫొటోలలో ఎలా చెప్పగలరు? గెటీ ఇమేజెస్‌కు చెందిన కెన్ మైనార్డిస్.. తన ఫొటోగ్రాఫర్లు తీసిన కొన్ని ఉత్తమ ఫొటోలను ఎంపిక చేసి, 2017 గురించి అవి తనకు ఏం చెప్తాయో తన మాటల్లోనే వివరిస్తున్నారు.

ఫొటో సోర్స్, Kevin Frayer/ Getty Images
బంగ్లాదేశ్‌లోని కాక్స్ బాజార్లో.. ఆహార సాయం అందించటానికి వచ్చిన ఓ ట్రక్కు మీదకు ఒక రోహింగ్యా శరణార్థి ఎక్కాడు. ఇటువంటి ఫొటోలు మనల్ని కదిలించటం లేదు.. ఎందుకంటే విషాదకరంగా ఇటువంటి దృశ్యాలను మనం చాలా తరచుగా చూస్తున్నాం. పరిస్థితి ఎంత విషాదకరంగా ఉందో అర్థమయ్యేలా చెప్పడానికి.. ఓ చిన్నారి కేంద్ర బిందువుగా ఉన్న ఇటువంటి ఫొటో అవసరనమని నేను అనుకుంటున్నా. కెవిన్ ఫ్రేయర్ ఈ ఫొటో చూస్తే.. ఒక చిన్నారి సాయం కోసమో తిండి కోసమే అడుక్కుంటున్న దృశ్యం తల్లిదండ్రులుగా మన గుండెను పిండేస్తుంది. అందుకే ఇలాంటి ఫొటోలు తీసే కృషిని కొనసాగించటం చాలా ముఖ్యం.
ఫొటో సోర్స్, Al Bello/ Getty Images
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన మియామీ ఓపెన్ పోటీల్లో టేలర్ టౌన్సెండ్తో ఆడుతున్న అమాండా అనిసిమోవా టెన్నిస్ బంతిని తిప్పికొడుతున్నారు. టెన్నిస్ ఫోర్‌హ్యాండ్ షాట్‌ను ఎలా ఫొటో తీయాలో, దానికి లైటింగ్ ఎలా ఇవ్వాలి, సరిగ్గా ఎలా తీయాలి అనేది ఎవరికైనా బోధించాలనుకుంటే.. ఈ ఫొటో ఆ పాఠంలో ఉంటుంది. క్రీడల ఫొటోగ్రఫీ మీద ఏళ్లతరబడి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించటం వల్ల అల్ బెల్లో ఈ అద్భుతమైన ఫొటో తీయగలిగారు.
ఫొటో సోర్స్, Christopher Polk/ Getty Images
ఆస్కార్ అవార్డుల వేదిక వెనుకకు కేవలం ముగ్గురు ఫొటోగ్రాఫర్లను మాత్రమే అనుమతించారు. అలాంటి అనుమతి పొందిన క్రిస్టొఫర్ పోల్క్.. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఎమ్మా స్టోన్, లియనార్డో డికాప్రియోలు ఆప్యాయతను పంచుకుంటున్న ఈ విశిష్ఠమైన ఫొటో తీయగలిగారు. ఈ ఫొటోలోని తెరవెనుక కోణం.. దీనిని 1950ల్లో తీసిన అద్భుతమైన ఫొటోలా కనిపించేలా చేస్తోంది.
ఫొటో సోర్స్, Ryan Pierse/ Getty Images
సిడ్నీలోని ప్రఖ్యాత బోండీ బీచ్‌లో.. ఒక సర్ఫర్ తన సర్ఫింగ్ బోర్డు మీద నుంచి పడిపోతున్న దృశ్యాన్ని ఫొటోగ్రాఫర్ ర్యాన్ పియర్స్ కెమెరాలో బంధించారు. ఈ ఫొటో కాంబినేషన్ అల భారీతనాన్ని.. తద్వారా ప్రకృతి ముందు మనిషి స్థాయిని వీక్షకులకు పట్టిచూపుతోంది. ఆ సర్ఫర్ తన సర్ఫింగ్ బోర్డు మీద నియంత్రణ కోల్పోయి, అలలోకి జారిపడుతున్న ఈ దృశ్యం.. ఏ క్షణమైనా మన తలరాతను నిర్ణయించే శక్తి ప్రకృతికి ఉందన్న భయం మనకు కలుగుతుంది.
ఫొటో సోర్స్, Chip Somodevilla/ Getty Images
అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో చార్లట్స్‌విల్ వద్ద మితవాద అమెరికన్లు, తమ వ్యతిరేక ప్రదర్శనకారులతో ఘర్షణపడ్డారు. కొంతమంది బేస్‌బాల్ బ్యాట్లతో వీరంగమాడుతుంటే, ఇంకొందరు రక్షణ దుస్తులు తొడుక్కుని సిద్ధమై వచ్చిన అత్యంత ప్రమాదకర పరిస్థితులవి. చిప్ సోమోద్విలా స్వయంగా ఆ ప్రమాదంలో నిల్చుని చాలా దగ్గరి నుంచి ఈ ఫొటో తీశారు.
ఫొటో సోర్స్, Bruce Bennett/ Getty Images
న్యూజెర్సీలోని నెవార్క్ నగరంలో జరిగిన ఐస్ హాకీ మ్యాచ్‌లో.. పిట్స్బర్గ్ పెంగ్విన్స్ క్రీడాకారుడు పాట్రిక్ హార్న్క్విస్ట్, న్యూజెర్సీ డెవిల్స్ క్రీడాకారుడు కోరీ ష్నీడర్ను తప్పించుకుని గోల్ చేశారు. క్రీడల ఫొటోగ్రఫీలో రెండు ముఖ్యమైన కోణాలున్నాయి. వాటిలో బ్రూస్ బెనెట్ సిద్ధహస్తులయ్యారు. ఆట ఫలితానికి ఎంతో కీలకమైన ఘటనను ఫొటో తీయటం ఒకటైతే.. జనం టెలివిజన్‌లో చూడలేని దృష్టి కోణాన్ని ఫొటో తీయటం రెండోది. గోల్లో బ్రూస్ ఒక రిమోట్ కెమెరాను ఉంచి సరైన సమయంలో ఈ ఫొటో తీశారు.
ఫొటో సోర్స్, Kevin Mazur/ Getty Images
వినోద పరిశ్రమ చాలా అస్థిరంగా ఉంటుంది. మాంచెస్టర్ ఎరీనా మీద ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత నిర్వహించిన ‘ఒన్ లవ్ మాంచెస్టర్’ సంగీత విభావరి చాలా ఉత్తమమైనదిగా ప్రశంసలందుకుంది. ఈ కార్యక్రమం జరుగుతున్నపుడు వేదికపైకి రావటానికి అనుమతి పొందిన ఒకే ఒక ఫొటోగ్రాఫర్ కెవిన్ మాజుర్.. ఆరియానా గ్రాండ్ భావోద్వేగం నుంచి బయటపడుతున్న ఈ క్షణాన్ని ఆయన తన కెమెరాలో బంధించగలిగారు. వేదిక వద్ద ఉన్న ఫొటోగ్రాఫర్లందరికీ ఆమె వీపు కనిపిస్తున్నపుడు.. కెవిన్ వేదిక మీద నుంచి ఈ ఫొటో తీయకపోయినట్లయితే ఈ దృశ్యం ఎన్నటికీ కనిపించేది కాదు.
ఫొటో సోర్స్, Jes Aznar/ Getty Images
ఫిలిప్పీన్స్‌లోని మారావి నగర శివార్లలో పెళ్లికూతురు కాటీ మాలాంగ్ తన ఫ్రెండ్స్‌తో సెల్ఫీ దిగుతున్న దృశ్యమిది. ఈ నగరంపై మే నెలలో ఒక దాడి జరిగనప్పటి నుంచీ.. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్)తో సంబంధమున్న సాయుధుల పాక్షిక నియంత్రణలో నగరముంది. జెన్ అజ్నర్ తీసిన ఈ ఫొటో నాకు రెండు విషయాలను గుర్తుచేస్తుంది: ఈ చిత్రాన్ని కంపోజ్ చేసిన పద్ధతి అది ఒక పెయింటింగ్ అనిపించేలా ఉండటం ఒకటైతే.. సాయుధ సంఘర్షణల్లోని మనుషులు సెల్ఫీలు తీసుకునే క్రమంలో మనుషులుగా కనిపించటం రెండోది.
ఫొటో సోర్స్, David Becker/ Getty Images
రూట్ 91 హార్వెస్ట్ కంట్రీ మ్యూజిక్ ఫెస్టివల్‌ను కవర్ చేయాలని డేవిడ్ బెకర్‌ను పంపించారు. కానీ.. తుపాకీ కాల్పుల మోత వినిపించటం మొదలవగానే ఆయన వేగంగా తన దృష్టిని మళ్లించి ఈ భయానక విషాదాన్ని ఫొటోలు తీయగలిగారు. వార్తల పొటోగ్రఫీలో ఒక సామెత ఉంది: ఇటువంటి పరిస్థితుల్లో గొప్ప ఫొటోలు తీయలేకపోయారంటే మీరు కావలసినంత దగ్గరగా లేరని అర్థం. తుపాకీ కాల్పులకు డేవిడ్ ఎంత దగ్గరగా ఉన్నారో, తుపాకీ కాల్పుల దిశగా పరిగెత్తి వెళ్లడానికి ఆయనకున్న ధైర్యం ఎంతటిదో.. ఈ ఫొటో చెప్తోంది.
ఫొటో సోర్స్, Tristan Fewings/ Getty Images
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా గాయని రిహానా ఓ స్క్రీనింగ్‌కు హాజరయ్యారు. ఈ ఫొటోను బహుశా వందలాది మంది ఫొటోగ్రాఫర్లు తీసివుంటారు. కానీ ఒక రెడ్ కార్పెట్ మీద ఉన్నపుడు ట్రిస్టన్ ఫేవింగ్స్.. లైట్‌ను ఉపయోగించిన తీరు చాలా అద్భుతంగా ఉండటంతో.. చాలా అందమైన ఫ్రేమ్ వచ్చింది.
ఫొటోలన్నీ కాపీరైట్‌కు లోబడినవి.
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)