ఢమాల్: ఒక్క రోజులో మూడోవంతు విలువ కోల్పోయిన బిట్ కాయిన్

  • 24 డిసెంబర్ 2017
బిట్ కాయిన్ Image copyright Getty Images

బిట్ కాయిన్ ఒక్క రోజులో దాదాపు 3.8 లక్షల రూపాయల మేర విలువ కోల్పోయింది. అంటే ఇది మొత్తం విలువలో మూడో వంతు కోల్పోయింది.

బిట్ కాయిన్ తాజా విలువ ప్రస్తుతం దాదాపు 9 లక్షల రూపాయల మేర ఉంది. ఇలా భారీగా విలువ పతనం కావడంతో కొన్ని ఎక్స్ఛేంజీలు శుక్రవారం లావాదేవీలను ఆపేశాయి.

ఈ ఏడాది మొదట్లో దీని విలువ దాదాపు రూ.65వేలుగా ఉండేది. చివరకు దీని విలువ 10 లక్షలకుపైగా పెరిగింది.

ముఖ్యంగా నవంబరు నుంచి దీని విలువ రెట్టింపు అయింది. దీంతో పలువురు దీని కొనుగోలుకు ఆసక్తి చూపారు.

ఇలా కొనుగోలు ఆసక్తి పెరగడంతో దీని విలువ డిసెంబరులో భారీగా పెరిగింది.

అయితే గత వారం రోజులుగా ఇది విలువను కోల్పోతూ వస్తోంది.

అయితే ఇలాంటి భారీ మార్పులకు ఇన్వెస్టర్లు సిద్ధంగా ఉండాల్సిందేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Image copyright Getty Images

విలువ ఎందుకు పెరుగుతోంది?

అసలు ప్రత్యక్షంగా ఉనికిలోనే లేని ఈ కరెన్సీ విలువ రోజురోజుకూ పెరుగుతూనే ఉండటం ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు జవాబు మరో ప్రశ్నలో ఉందని తెలిసిన వాళ్లంటారు - అసలు బిట్‌కాయిన్‌లో డబ్బు మదుపు చేస్తున్న వారెవరు?

అటానమస్ నెక్స్ట్ అనే ఓ అధ్యయన సంస్థ దీని లోతుల్ని తెలుసుకోవడానికి ప్రయత్నించింది. దీని వెనుకున్నది హెజ్ ఫండ్స్ అని అది ప్రకటించింది.

షేర్లు కొనటం, మళ్లీ వాటిని లాభాలకు అమ్మటం హెజ్ ఫండ్స్ చేసే పని. బిట్‌కాయిన్ విషయంలో కూడా ఈ ఫండ్స్ చేస్తున్నదిదే అని ఆ సంస్థ వెల్లడి చేసింది.

ఫైనాన్షియల్ మార్కెట్లలో హెజ్ ఫండ్‌ అనేది అధిక రాబడులు పొందేందుకు ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తారు. ఈ ఫండ్స్ ఏకకాలంలో అనేక పెట్టుబడి వ్యూహాలను అనుసరిస్తాయి. తద్వారా రిటర్న్స్ గ్యారంటీగా వచ్చే వీలుంటుంది.

బిట్‌కాయిన్ అమ్మకాలు, కొనుగోళ్లలో ఈ సంవత్సరం హెజ్ ఫండ్స్ భాగస్వామ్యం 30 నుంచి 130కి పెరిగినట్టు అటానమస్ నెక్స్ట్ వెల్లడించింది.

ఈ కారణం వల్లనే బిట్‌కాయిన్ ఎంత భారీగా లాభాలు తెచ్చిపెట్టిందంటే డిస్నీ, ఐబీఎం లేదా మెక్‌డొనాల్డ్ వంటి అత్యధిక లాభాలు ఆర్జించే కంపెనీలు సైతం లాభాలు బిట్‌కాయిన్‌ లాభాల ముందు వెలవెల పోయాయి.

బిట్‌కాయిన్ ప్రస్తుత పెట్టుబడి 16,700 కోట్ల డాలర్లకు చేరిందని, ఇది జనరల్ ఎలక్ట్రిక్ వంటి కంపెనీల విలువకన్నా చాలా ఎక్కువని చార్లీ బిలెల్లో వంటి విశ్లేషకులు చెబుతున్నారు.

ఏడేళ్ల క్రితం ఎవరైనా బిట్‌కాయిన్‌లో 10 డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్టయితే నేడు ఆ మొత్తం విలువ 10 లక్షల డాలర్లకు చేరిందని బిలెల్లో చెబుతారు.

అసలు బిట్ కాయిన్ అంటే ఏంటి? తెలియాలంటే క్లిక్ చేయండి.

మా ఇతర కథనాలు:

#రహస్యం: తియానాన్మెన్ స్క్వేర్ మృతుల సంఖ్య 10,000

#చిత్రావలోకనం: ఫొటోల్లో 2017

#గమ్యం: ఏం చదివితే Job గ్యారెంటీ!

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)