పాకిస్తాన్‌లో తల్లిని, భార్యను కలిసిన కుల్‌భూషణ్ జాదవ్

  • 25 డిసెంబర్ 2017
తల్లి, భార్యతో కులభూషణ్ జాదవ్ Image copyright Pakistan Foreign Office
చిత్రం శీర్షిక తల్లి, భార్యతో కులభూషణ్ జాదవ్

పాకిస్తాన్‌లో గూఢచర్యం ఆరోపణలతో మరణశిక్ష పడిన కులభూషణ్ జాదవ్ ఇస్లామాబాద్‌లో తన తల్లిని, భార్యను కలిశారు.

జాదవ్‌ను కలిసేందుకు వచ్చిన వారిద్దరూ మీడియాతో మాట్లాడలేదని బీబీసీ పాకిస్తాన్ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ తెలిపారు.

కేవలం మీడియాకు నమస్తే చెప్పి వారు జాదవ్‌ను కలవడానికి విదేశాంగ కార్యాలయం లోపలికి వెళ్లారు.

పాకిస్తాన్ విదేశాంగ శాఖ దీనికి సంబంధించిన ఫొటోలను విడుదల చేసింది.

Image copyright Pakistan Foreign Office

జాదవ్ తన కుటుంబసభ్యులను కలిసినప్పుడు భారత డిప్యూటీ హై కమిషనర్ జేపీ సింగ్ కూడా వారి వెంట ఉన్నారు.

జాదవ్‌ను కలిసిన అనంతరం వారిద్దరూ తిరిగి సోమవారమే భారత్ తిరిగి వెళతారని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది.

Image copyright Farhan/BBC
చిత్రం శీర్షిక కులభూషణ్ జాదవ్ తల్లి, భార్య

కులభూషణ్ జాదవ్‌ను ఎప్పుడు పట్టుకున్నారు?

మార్చి 3, 2016న పాకిస్తాన్ ఇంటలిజెన్స్ గూఢచర్యం ఆరోపణలతో జాదవ్‌ను అరెస్ట్ చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో పాకిస్తాన్ మిలటరీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది.

అయితే భారత్ అప్పీలుతో మే నెలలో అంతర్జాతీయ న్యాయస్థానం జాదవ్ మరణశిక్షపై స్టే విధించింది.

Image copyright @ForeignOfficePk
చిత్రం శీర్షిక పాక్ విదేశాంగ కార్యాలయంలో జాదవ్ తల్లి, భార్య

జాదవ్ తన కుటుంబాన్ని కలిసేందుకు అనుమతిని ఇవ్వడంపై పాక్ మీడియాలో అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి.

ఇరుదేశాల మధ్య జరిగిన ఓ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, భారత్‌లో పాక్ హై కమిషనర్ సొహైల్ మహమూద్‌తో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు పాక్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

జాదవ్‌కు కాన్సులార్ యాక్సెస్ ఇవ్వాలన్న భారత్ విజ్ఞప్తిని పాక్ అనేకమార్లు తోసిపుచ్చింది.

తనకు క్షమాభిక్ష ప్రసాదించాలన్న జాదవ్ విజ్ఞప్తి ప్రస్తుతం పాకిస్తాన్ మిలటరీ చీఫ్ జనరల్ ఖమర్ జావేద్ బాజ్వా వద్ద పెండింగ్‌లో ఉంది.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)