2017: శాస్త్ర పరిశోధనా రంగాల్లో జరిగిన 8 కీలక పరిణామాలివే!

ఫొటో సోర్స్, PA
రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొట్టుకోవడంపై రూపొందించిన చిత్రం
రెండు న్యూట్రాన్ నక్షత్రాలు పరస్పరం ఢీకొనడం వల్ల గురుత్వాకర్షణ తరంగాలు పుట్టడాన్ని గుర్తించడం మొదలుకొని, గుంటూరు జిల్లా విస్తీర్ణంలో ఇంచుమించు సగమంత ఉండే ఒక భారీ ఐస్‌బర్గ్ అంటార్కిటికాలో ఐష్ షెల్ఫ్ నుంచి విడిపోవడం వరకు.. సైన్స్, పర్యావరణ అంశాల్లో ఈ ఏడాది అనేక పరిణామాలు సంభవించాయి. వీటిలో అత్యంత ప్రధానమైన, అరుదైన ఎనిమిది పరిణామాలను మరోసారి గుర్తుచేసుకుందాం..
న్యూట్రాన్ స్టార్స్.. గురుత్వాకర్షణ తరంగాలు
రెండు 'మృత నక్షత్రాలు' (న్యూట్రాన్ స్టార్స్) పరస్పరం ఢీకొన్నప్పుడు గురుత్వాకర్షణ తరంగాలు ఉద్భవించినట్లు శాస్త్రవేత్తలు ఈ ఏడాది గుర్తించారు. సాపేక్ష సిద్ధాంతం ప్రాతిపదికగా దాదాపు శతాబ్దం క్రితం గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ప్రతిపాదించారు.
వీటిని ప్రత్యక్ష ఆధారాలతో తొలిసారిగా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు 2016లో ప్రకటించారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న రెండు కృష్ణబిలాలు కలిసిపోయినప్పుడు అంతరిక్షంలోని స్థల, కాలాల్లో ఒక విధమైన ఒంపు ఏర్పడినట్లు 'అడ్వాన్స్డ్ లైగో’ ప్రయోగశాలల సైంటిస్టులు పేర్కొన్నారు.
గురుత్వాకర్షణ తరంగాల ఉనికిని గుర్తించడం ఖగోళశాస్త్రంలో ఒక సరికొత్త శాఖ ఆవిర్భావానికి నాందిగా వ్యాఖ్యానించారు. సుదూర విశ్వంలోని పరిణామాలకు సంబంధించిన సమాచార సేకరణకు ఈ తరంగాలపై ఆధారపడటమే ఈ నూతన శాఖలో ప్రధానాంశం.
న్యూట్రాన్ స్టార్లు ఢీకొని, విలీనమయ్యే ఘట్టం తాలూకు సమాచారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక టెలిస్కోపులు 2017లో గుర్తించాయి.
సుమారు 'వెయ్యి బిలియన్ బిలియన్ కిలోమీటర్ల' దూరంలోని 'హైడ్రా' కాన్స్టలేషన్లో ఉన్న ఒక నక్షత్ర మండలంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి వెల్లడైన విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.
ఉదాహరణకు న్యూట్రాన్ నక్షత్రాలు ఢీకొట్టుకొనే ఘటనల వల్ల విశ్వంలో బంగారం, ప్లాటినం మూలకాలు పుట్టినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
న్యూట్రాన్ నక్షత్రాల సాంద్రత చాలా అధికంగా ఉంది. ఒక టీస్పూన్ భాగం దాదాపు వంద కోట్ల టన్నుల బరువు ఉంది.
ఫొటో సోర్స్, NASA/JPL-CALTECH
కస్సీని వ్యోమనౌకపై రూపొందించిన చిత్రం
ముగిసిన కస్సీని యాత్ర
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ప్రతిష్ఠాత్మకంగా భావించే కస్సీని వ్యోమనౌక సుదీర్ఘ యాత్ర ఈ ఏడాదే ముగిసింది. 2004లో శనిగ్రహ వ్యవస్థలోకి ప్రవేశించిన ఈ అంతరిక్ష నౌక ఈ 13 ఏళ్లలో శనిగ్రహం, దాని ఉపగ్రహాల రహస్యాలు ఎన్నో ప్రపంచానికి చెప్పింది.
అక్కడ వాతావరణ పరిస్థితులు, నీటి వనరులు ఎలా ఉన్నాయి, జీవుల మనుగడ సాధ్యమేనా అనే అంశాలకు సంబంధించి కీలక సమాచారాన్ని కస్సీని చేరవేసింది.
శని గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్‌పై మీథేన్‌తో నిండిన సరస్సులు, సముద్రాల సమాచారాన్ని ఇది సేకరించింది. శని చుట్టూ సంభవించిన పెను తుపానును పరిశీలించింది.
ఇంధనం అయిపోవడంతో ఈ వ్యోమనౌకను ధ్వంసం చేయాలని నాసా నిర్ణయించింది. ఫలితంగా, సెప్టెంబరు 15న శని గ్రహ వాతావరణంలోకి ప్రవేశించగానే కస్సీని విచ్ఛిన్నమైపోయింది. చివరి క్షణం వరకు కూడా ఇది సమాచారం పంపించింది.
ఫొటో సోర్స్, EPA
డొనాల్డ్ ట్రంప్
పారిస్ ఒప్పందం నుంచి వైదొలగిన అమెరికా
అమెరికా, అమెరికా ప్రజల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి తాము వైదొలగాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 1న వైట్‌హౌస్‌లో ప్రకటించారు.
డెమొక్రాట్లు, వివిధ దేశాల నాయకులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
మన గ్రహం లాంటివే మరో ఏడు
మన సౌర వ్యవస్థ వెలుపల 3,500 గ్రహాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటివరకు కనుగొన్నారు. భూమి పరిమాణంలో ఉన్న ఏడు గ్రహాలతో కూడిన ఒక గ్రహ వ్యవస్థను ఈ ఏడాది గుర్తించారు. మూడు గ్రహాలు నివాస యోగ్యమైనవని తేల్చారు.
ఉపరితలంపై నీరు ద్రవరూపంలో ఉండే అవకాశమున్న గ్రహాలకు నివాస యోగ్యత ఉంటుంది. నీరుంటే జీవం ఉండే అవకాశం ఉంటుంది.
ఫొటో సోర్స్, Nature
గ్రహ వ్యవస్థపై రూపొందించిన చిత్రం
లక్ష సంవత్సరాల ముందే..
హోమోసేపియన్లు లోగడ గుర్తించినదాని కన్నా కనీసం లక్ష సంవత్సరాల ముందే ఉన్నట్లు పరిశోధకులు జులైలో వెల్లడించారు.
ఉత్తర ఆఫ్రికాలో లభించిన ఐదుగురు ఆదిమ మానవుల శిలాజాలపై పరిశోధనల ఆధారంగా వారు ఈ అంచనాకు వచ్చారు. ఆధునిక మానవులు కేవలం తూర్పు ఆఫ్రికాలోంచే కాకుండా ఆఫ్రికా ఖండంలోని అన్ని ప్రాంతాల నుంచీ ఒకేసారి పరిణామం చెందుతూ వచ్చి ఉండొచ్చని చెప్పారు.
దక్షిణాఫ్రికాలో లభించిన 15 అస్థిపంజరాలపై పరిశోధనలు జరిపిన పరిశోధక బృందం రెండు లక్షల నుంచి మూడు లక్షల ఏళ్ల కింద హోమోనలెడి అనే ఆదిమ మానవులు ఉండి ఉండొచ్చని ఈ ఏడాది ప్రథమార్ధంలో పేర్కొంది.
ఫొటో సోర్స్, NASA
సంపూర్ణ సూర్యగ్రహణం
అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం
1776లో అమెరికా స్వతంత్ర దేశంగా అవతరించిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాది ఆగస్టు 21న అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.
సూర్యగ్రహణం అమెరికా పశ్చిమ తీరం నుంచి తూర్పు తీరం వరకు కనిపించడం 99 ఏళ్ల తర్వాత ఇదే ప్రథమం.
ఫొటో సోర్స్, ESO/M. Kornmesser
గ్రహశకలం ఓవుమువామువా
గ్రహశకలం
తారాంతర ప్రదేశం(ఇంటర్స్టెల్లార్ స్పేస్) నుంచి గ్రహశకలం ఒకటి మన సౌర కుటుంబంలోకి రావొచ్చని చాలా కాలంగా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తొలిసారిగా దీనిని ఈ ఏడాది గుర్తించారు.
హవాయిలోని పాన్-స్టార్స్ టెలిస్కోప్ సాయంతో అక్టోబరులో ఈ గ్రహశకలం ఆచూకీని గుర్తించారు. దీనికి 'ఓవుమువామువా' అని పేరు పెట్టారు.
ఫొటో సోర్స్, Copernicus Sentinel (2017) ESA/Andrew Flemming
విడిపోయిన ఐస్‌బర్గ్
విడిపోయిన భారీ ఐస్‌బర్గ్
అంటార్కిటికాలో 'లార్సెన్ సీ' ఐష్ షెల్ఫ్ నుంచి జులైలో ఒక భారీ ఐస్‌బర్గ్ చీలిపోయింది. భూభాగానికి అతుక్కుని ఉండి, సముద్రంలో తేలియాడే, అత్యంత దళసరి మంచు భాగాన్ని ఐష్ షెల్ఫ్ అంటారు.
'లార్సెన్ సీ' ఐష్ షెల్ఫ్ ప్రాంతంలో ఒక దశాబ్ద కాలంగా నిలువునా వస్తున్న చీలికను శాస్త్రవేత్తలు గమనిస్తూ వస్తున్నారు. ప్రపంచ చరిత్రలో ఇలా చీలిపోయిన అతిపెద్ద ఐస్‌బర్గ్‌లలో ఇది ఒకటి.
సుమారు ఆరు వేల చదరపు కిలోమీటర్ల మేర ఈ ఐస్‌బర్గ్ విస్తరించి ఉంది. ఇది గుంటూరు జిల్లా విస్తీర్ణంలో ఇంచుమించు సగం ఉంటుంది.
మా ఇతర కథనాలు:
- చెన్నంపల్లి కోటలో గుప్తనిధులు ఉన్నాయా?
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- భారత్‌తో యుద్ధానికి ముందే ప్లాన్ వేసిన మావో?
- చైనా: నూడుల్స్ అమ్మకాల్లో తగ్గుదల సూచిస్తున్న మార్పులు ఏమిటి?
- అంతరిక్షం నుంచి చూస్తే మెరుపులు ఇలా కనిపిస్తాయి!
- ప్రేమకథ: బాలీవుడ్.. జర్మనీ.. ఓ సినిమాటోగ్రాఫర్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)