భారత్‌కు గుణపాఠం చెప్పాలనే యుద్ధానికి దిగిన మావో

  • రెహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
మావో

ఫొటో సోర్స్, Youtube

మావో గురించి ఒక విషయం ప్రాచుర్యంలో ఉంది. ఆయన పగటి వేళ రాత్రి నుంచి ప్రారంభం అవుతుందనేవాళ్లు. ఆయన రాత్రి మొత్తం పని చేసి, ఉదయాన నిద్రపోయేవారు.

ఎక్కువ సమయం పరుపు మీదే గడిపేవారు. భోజనం కూడా పరుపు మీదే చేసేవారు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన పరుపు కూడా ఆయన వెంటే వెళ్లేది. ఆయన రైలులో వెళితే అక్కడ కూడా దాన్నే వేసుకునేవారు.

1957లో రష్యాకు వెళ్లినపుడు కూడా ఆయన తన వెంట తన పరుపును తీసుకెళ్లారు. వేరే పరుపుపై ఆయనకు నిద్ర పట్టేది కాదు.

ఆయన పొడవాటి బాత్‌రూం గౌన్ ధరించేవారు. ఒట్టి కాళ్లతో తిరిగేవారు.

చైనాలోని ఇండియన్ ఎంబసీలో జూనియర్ ఆఫీసర్‌గా పని చేసిన నట్వర్ సింగ్ చెప్పిన దాని ప్రకారం, 1956లో స్పీకర్ అయ్యంగార్ నేతృత్వంలో ఒక పార్లమెంటరీ బృందం చైనాకు వెళ్లింది. చైర్మన్ మావో పన్నెండు గంటలకు వాళ్లను కలుసుకుంటారని ఉదయం పదిన్నరకు వాళ్లకు చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

నట్వర్ సింగ్‌తో రెహాన్ ఫజల్

మావో ఎంపీలందరికీ వరుసగా షేక్ హ్యాండ్ ఇస్తూ వెళ్లారు. మొదట మావో మూడ్‌లో లేరు. అయ్యంగార్ ప్రశ్నలకు ఒకటి, రెండు ముక్కల్లో సమాధానాలు ఇచ్చారు. అయితే కొంతసేపటి తర్వాత ఆయన మామూలుగా మారిపోయారు.

స్వాతంత్ర్యానంతరం భారత్ పరిస్థితి డోలు లాగా మారిపోయిందని, అమెరికా, రష్యాలు రెండు వైపుల్నుంచీ వాయిస్తున్నాయని అయ్యంగార్ అన్నపుడు ఆయన గట్టిగా నవ్వేశారు.

ఫొటో క్యాప్షన్,

సర్వేపల్లి రాధాకృష్ణన్

మావో బుగ్గలు తట్టిన రాధాకృష్ణన్

ఈ సమావేశం సందర్భంగా మావో ఒక దాని తర్వాత మరొక సిగరెట్ కాలుస్తూనే ఉన్నారు. అక్కడే ఉన్న భారత రాయబారి ఆర్ కే నెహ్రూ కూడా నోట్లో సిగరెట్ పెట్టుకున్నపుడు మావో లేచి నిలబడి, తానే స్వయంగా ఆయన సిగరెట్ వెలిగించారు. అక్కడున్న భారత ఎంపీలు, దౌత్యవేత్తలు మావో చర్యతో నిశ్చేష్టులయ్యారు.

ఆ తర్వాత ఏడాది భారత ఉప రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చైనా వెళ్లినపుడు మావో ఆయనను కలుసుకున్నారు. వాళ్లిద్దరూ చేతులు కలుపుకున్నాక, రాధాకృష్ణన్ మావో బుగ్గలను తట్టారు.

మావో ఆశ్చర్యాన్నో, ఆగ్రహాన్నో వ్యక్తం చేయక ముందే రాధాకృష్ణన్ ''అంతలా ఆశ్చర్యపోకండి. నేను స్టాలిన్, పోప్‌లకు కూడా ఇలాగే చేశాను'' అని పంచ్ లైన్ ఇచ్చారు.

భోజనం సందర్భంగా మావో తన ప్లేట్‌లోంచి కొంత భాగం ఆహారాన్ని తీసి రాధాకృష్ణన్ ప్లేట్‌లో పెట్టారు.

రాధాకృష్ణన్ శాకాహారి అని మావోకు తెలీదు. అయితే రాధాకృష్ణన్ కూడా మావో తప్పు చేసినట్లు తెలీకుండా వ్యవహరించారు. ఆ సమయంలో రాధాకృష్ణన్ వేలుకు గాయమై ఉండింది. మావో దానిని చూసిన వెంటనే తన వ్యక్తిగత వైద్యుణ్ని పిలిచి దానికి మందు వేయించి, పట్టీ మార్పించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రధాని చౌ ఎన్ లై తో మావో

ఎవరైనా విదేశీ నేతలు చైనాకు వచ్చినపుడు, వారితో మావో భేటీ మొదటే నిర్ణయమయ్యేది కాదు. మావోకు ఇష్టమైనపుడు వారికి ఏదో ఉపకారం చేస్తున్నట్లు వారిని పిలిపించేవారు.

'ఇయర్స్ ఆఫ్ రెన్యువల్' అన్న తన పుస్తకంలో అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్, ''నేను చైనా ప్రధాని చౌ ఎన్ లై తో సంభాషిస్తుండగా, హఠాత్తుగా చైర్మన్ మావో నా కోసం వేచి ఉన్నారన్న వార్త వచ్చింది. నేను ఆయనను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా లేదా అనేది ఆయనకు అనవసరం. మా వెంట భద్రతా సిబ్బందిని కూడా ఎవరినీ అనుమతించలేదు. మావోను కలిసిన తర్వాత 'ఈ విధంగా కలవడం జరిగింది' అని ప్రెస్‌కు చెప్పేవాళ్లు.''

''మమ్మల్ని సరాసరి మావో స్టడీ రూంకు తీసుకెళ్లారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశానికి చెందిన పాలకుడి స్టడీ రూం అత్యంత నిరాడంబరంగా ఉంది.''

''ఆ గదిలోని ఒక కుర్చీలో మావో కూర్చుని ఉన్నారు. నేను వెళ్లగానే లేచి సాదరంగా స్వాగతం పలికారు. ఆయనకు సహాయం చేయడానికి ఆయన పక్కన ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆయన చూపులో 'మమ్మల్ని మూర్ఖుల్ని చేయడానికి ప్రయత్నిస్తే ఖబడ్దార్' అన్న అర్థం ఉంది.

1971లో అమెరికా అధ్యక్షుడు నిక్సన్ ప్రపంచ పరిణామాలపై మావోతో చర్చలు జరపాలని భావించినపుడు, 'చర్చలా? అందుకు మీరు మా ప్రధాని వద్దకు వెళ్లాలి. నాతో మీరు కేవలం తాత్విక విషయాల గురించి మాత్రమే మాట్లాడండి' అన్నారు.''

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రిచర్డ్ నిక్సన్‌తో మావో

స్నానం అంటే ఇష్టం లేదు

మావో వైద్యుడిగా ఉన్న జీ షీ లీ 'ద ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఛైర్మన్ మావో' అన్న పుస్తకం రాశారు.

దానిలో ఆయన, ''మావో తన జీవితంలో ఎన్నడూ పళ్లను తోముకోలేదు. రోజూ నిద్ర నుంచి లేవగానే, తాను తాగే టీతో పళ్లను పుక్కిలించి నోరు శుభ్రం చేసుకునేవారు. ఒకానొక సమయంలో ఆయన పళ్లు ఆకుపచ్చ రంగులోకి మారిపోయాయి.'' అని రాసుకొచ్చారు.

స్నానం చేయడమంటే కూడా మావోకు చాలా అయిష్టం. అయితే ఈత అంటే మాత్రం చాలా ఇష్టం. శుభ్రంగా ఉండడానికి ఆయన స్పాంజ్ బాత్ తీసుకునేవారు.

మావో ఎంత లావుగా తయ్యారంటే, నిక్సన్‌ను కలిసే సమయంలో పాత సూట్లు సరిపోకపోవడంతో ఆయన కొత్త సూట్‌ను కుట్టించుకోవాల్సి వచ్చిందని లీ తెలిపారు. నిక్సన్‌తో ఆయన సమావేశం మొదట 15 నిమిషాలు అనుకున్నారు. అయితే అది దాదాపు 65 నిమిషాలు కొనసాగింది. నిక్సన్ వెళ్లిపోగానే మావో తన సూట్ తీసి పారేసి, తన బాత్ రోబ్ వేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

మావో బూట్లు కూడా వేసుకునేవారు కాదు. ఒకవేళ తప్పనిసరి అయితే మాత్రం బట్టలతో చేసిన బూట్లు ధరించేవారు. లాంఛనం కోసం లెదర్ షూస్ వేసుకోవాల్సి వస్తే, అవి వదులు కావడానికి మొదట తన బాడీగార్డులకు ఇచ్చేవారు.

మావో జీవితచరిత్రపై మరో పుస్తకం రాసిన జావో చాంగ్, మావో జ్ఞాపకశక్తి అద్భుతమని తెలిపారు. చదవడం, రాయడమంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయన బెడ్రూంలో పరుపు మీద సగం పుస్తకాలే ఆక్రమించి ఉండేవి. ఆయన ప్రసంగాలు, రాసిన వ్యాసాలు కూడా ఆ పుస్తకాల నుంచి సేకరించినవే. ఆయన నలిగిన దుస్తులు ధరించేవారు, ఆయన సాక్సులకు రంధ్రాలు ఉండేవి.

1962 ఇండో-చైనా యుద్ధంలో మావో పాత్ర చాలా ఉంది. భారత్‌కు గుణపాఠం చెప్పాలని ఆయన భావించారు.

చైనాలో భారత తాత్కాలిక రాయబారిగా ఉన్న లఖన్ మెహరోత్రా, ''భారత్‌తో యుద్ధానికి 'ఫార్వర్డ్ పాలసీ'నే కారణమని చైనా చెప్పుకున్నా, అంతకు రెండేళ్ల ముందరే - అంటే 1960లోనే మావో భారత్‌తో యుద్ధానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు. అంతేకాదు, ఆయన తామేదైనా దేశంపై యుద్ధానికి పూనుకుంటే అమెరికా తైవాన్‌లో లెక్కలు తేల్చుకుంటుందా అని కూడా అమెరికాను అడిగారు. అయితే చైనా తన దేశం లోపల గానీ, బయట గానీ ఏం చేసినా దాంతో మాకు నిమిత్తం లేదు గానీ తైవాన్ రక్షణ విషయంలో మేం కట్టుబడే ఉంటామని అమెరికా చెప్పింది" అని అన్నారు.

''ఆ తర్వాత ఏడాది, ఇదే విషయాన్ని చైనా కృశ్చేవ్‌ వద్ద ప్రస్తావించింది. ఆ సమయంలో టిబెట్‌కు మొత్తం చమురు సరఫరా రష్యా నుంచి జరిగేది. ఒకవేళ భారత్‌తో యుద్ధానికి దిగితే, సోవియట్ రష్యా ఆ సరఫరాను నిలిపివేస్తుందేమో అని చైనా భయం. ఆ విధంగా జరగదని కృశ్చేవ్ హామీ ఇచ్చారు. భారత్‌తో తమకు కూడా తీవ్రమైన భేదాభిప్రాయాలు ఉన్నట్లు కృశ్చేవ్ తెలిపారు. క్యూబాకు తాము మిస్సైళ్లు విక్రయించినా, చైనా అభ్యంతరం చెప్పకూడదని ఒప్పందం కుదుర్చుకున్నారు. ''

''చైనా భారత్‌పై దాడి చేస్తుందని కృశ్చేవ్‌ విశ్వసించారు. అప్పటికే భారత్‌కు మిగ్ యుద్ధవిమానాల సరఫరాపై ఒప్పందం కుదిరింది. అయితే యుద్ధం ప్రారంభం కాగానే, రష్యా యుద్ధవిమానాలను పంపడం ఆలస్యం చేసింది. కానీ చైనాకు మాత్రం పెట్రోల్ సరఫరాను ఆపలేదు. దీనిపై తర్వాత కృశ్చేవ్‌ను ప్రశ్నిస్తే ఆయన 'భారత్ మాకు స్నేహితుడే కానీ చైనా మా సోదరుడు' అని అన్నారు.''

ఫొటో క్యాప్షన్,

లఖన్ మెహరోత్రాతో రెహాన్ ఫజల్

ఇందిరకు అభివాదాలు తెలిపిన మావో

1965లో ఇండో-పాకిస్తాన్ యుద్ధం అనంతరం, చైనా జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ విదేశాంగ శాఖ ఒక విందును ఏర్పాటు చేసింది. మావో కూడా ఆ విందులో పాల్గొన్నారు. ఆనాటి విందులో పాకిస్తాన్‌పై భారత్ ఆక్రమణ ప్రస్తావనకు వచ్చింది. భోజనాల సమయంలో భారత ప్రతినిధి జగత్ మెహతా టేబుల్‌పై కావాలని ఆ ప్రసంగం ఇంగ్లీష్ అనువాదాన్ని పెట్టలేదు.

దీనికి నిరసనగా మెహతా తన పక్కనున్న స్విస్ దౌత్యవేత్త ఎదురుగా ఫ్రెంచి భాషలో ఉన్న ప్రసంగాన్ని చదివి, వెంటనే ఆ విందు నుంచి వాకౌట్ చేయాలని నిర్ణయించుకున్నారు. చైనీయులు దీనిని తమ అధినేతకు జరిగిన అవమానంగా భావించారు.

బయటికి వెళ్లిన జగత్ మెహతా తన కారు వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన, ఆయన భార్య ఆ శీతాకాలపు మంచులో గంటసేపు గడ్డకట్టుకు పోయి నిలుచున్నారు.

1970 మే డే రోజున అన్ని దేశాల రాయబార కార్యాలయ అధిపతులను బీజింగ్‌లోని తియనాన్మెన్ స్క్వేర్క్‌కు ఆహ్వానించారు. చైర్మన్ మావో కూడా అక్కడ ఉన్నారు. రాయబారుల వరుసలో అందరికన్నా చివరగా ఉన్న బ్రజేశ్ మిశ్రా వద్దకు వెళ్లి ఆయన, ''మీ రాష్ట్రపతి గిరిగారికి, ప్రధాని ఇందిరా గాంధీకి నా అభివాదాలు తెలపండి'' అని అన్నారు.

ఫొటో సోర్స్, AFP

ఇంకెంత కాలం ఈ పోరాటం?

‘‘ఆ తర్వాత కొద్ది సేపు ఆగి, 'ఇలా ఎంత కాలం పోరాడదాం చెప్పండి?'’ అని ప్రశ్నించారు. ఆ తర్వాత తన సహజసిద్ధమైన నవ్వుతో, ఒక నిమిషం పాటు బ్రజేశ్ మిశ్రాకు షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండిపోయారు. పాత విషయాలను మర్చిపోవడానికి చైనా సిద్ధంగా ఉందని చెప్పడానికి చైనా ఇచ్చిన మొదటి సంకేతం అది.

తాను మరణించడానికి మూడు నెలల ముందు వరకు కూడా మావో విదేశీ నేతలను కలుస్తూనే ఉన్నారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి చాలా క్షీణించింది.

ఒకసారి థాయ్ ప్రధాని ఆయన గదిలో ప్రవేశించే సరికి మావో గురక తీస్తూ ఉన్నారు. మరోసారి సింగపూర్ ప్రధాని లీ క్వాన్ యూ మావోను కలిసేందుకు వెళ్లగా, ఆయన తల ఒక పక్కకు వాలిపోయి, నోటిలోంచి చొంగ కారుతూ ఉంది. పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోతో తన ఫొటోలను చూసుకున్నాక ఆయన ఇక విదేశీ అతిథులు ఎవరినీ కలవరాదని నిర్ణయించుకున్నారు.

మూడు నెలల తర్వాత మావో మరణించారు.

(మావో 124వ జయంతి సందర్భంగా...)

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)