జోసెఫ్ విర్షింగ్: బాలీవుడ్‌తో ప్రేమలో పడ్డ జర్మన్ సినిమాటోగ్రాఫర్

  • 27 డిసెంబర్ 2017
జోసెఫ్ విర్షింగ్ Image copyright Josef Wirsching Archive
చిత్రం శీర్షిక జోసెఫ్ విర్షింగ్ 17కి పైగా హిందీ, ఉర్దూ సినిమాలకు పనిచేశారు

ఒక పక్క రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. జర్మనీలో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. అలాంటి సమయంలో జర్మనీకి చెందిన ఓ ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ భారతీయ సినిమాలకు పనిచేస్తూ ఇక్కడే ఉండిపోయారు.

జోసెఫ్ విర్షింగ్ జర్మనీకి చెందిన పేరున్న సినీ ఛాయగ్రాహకుడు. బొంబాయి అన్నా, భారతీయ సినీ పరిశ్రమ అన్నా ఆయనకు చాలా ఇష్టం. అందుకే తమ దేశానికి వచ్చి నాజీ సిద్ధాంతాల్ని ప్రచారం చేయాలని పిలుపు అందినా, ఆ పని చేయడం ఇష్టం లేక, అక్కడికి వెళ్లకుండా భారత్‌లోనే ఉండిపోయారు.

జోసెఫ్ పదిహేడుకి పైగా హిందీ, ఉర్దూ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. మూవీ మొఘల్ హిమాన్షు రాయ్, ప్రఖ్యాత నటి దేవికా రాణి ఏర్పాటు చేసిన ‘బాంబే టాకీస్’ స్టూడియోతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం కొనసాగింది.

జోసెఫ్ మ్యూనిచ్‌లో ‘ది లైట్ ఆఫ్ ఏషియా’ అనే మూకీ సినిమాకు పనిచేశారు. ఆ సినిమా నిర్మాణ పనుల్లో భాగంగానే ఆయన 1920ల్లో తొలిసారి భారత్‌కు వచ్చారు.

Image copyright Josef Wirsching Archive
చిత్రం శీర్షిక 1937లో భారత్‌లో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొన్న జోసెఫ్ విర్షింగ్ (కుడివైపు కెమెరా పక్కన ఉన్న వ్యక్తి)

‘ది లైట్ ఆఫ్ ఏషియా’ చిత్రీకరణ పూర్తవగానే జోసెఫ్ జర్మనీకి వెళ్లిపోయారు. కానీ ఆ సమయంలో అక్కడి సినీ పరిశ్రమపై నాజీల సిద్ధాంతాల్ని ప్రచారం చేసే సినిమాలను తీయాలనే ఒత్తిడి పెరిగిపోయింది. ఆ పని జోసెఫ్‌కు ఇష్టం లేదు. దాంతో బాంబే టాకీస్‌తో కలిసి పనిచేయాలనే హిమాన్షు రాయ్ ఆహ్వానం మేరకు ఆయన భారత్‌కు వచ్చేశారు. అలా కమర్షియల్ చిత్రాలకు కొత్త నిర్వచనం చెప్పిన బాంబే టాకీస్ ఎదుగుదలలో జోసెఫ్ భాగమయ్యారు.

‘భారత్‌ - యూరప్ మధ్య జోసెఫ్ విర్షింగ్ తరచూ తన కస్టమైజ్డ్ బెంజ్ ‌కార్‌లో ఫొటోగ్రఫీ సామగ్రిని వెంటబెట్టుకొని తిరిగేవారు’ అంటారు రహాబ్ అల్లానా.

జోసెఫ్ విర్షింగ్‌ పనిచేసిన సినిమాలకు సంబంధించిన అరుదైన ఫొటోల ఎగ్జిబిషన్‌ ఇటీవల గోవాలో జరిగింది. ఆ ఎగ్జిబిషన్‌కు రహాబ్ క్యురేటర్‌గా ఉన్నారు.

‘భారతీయ సినిమా ఎదుగుదలలో జోసెఫ్ పాత్ర కూడా కీలకమైనది’ అంటారు రహాబ్.

Image copyright JOSEF WIRSCHING ARCHIVE
చిత్రం శీర్షిక ‘జవానీ కీ హవా’ సినిమాలో దేవికా రాణి, నజామ్ ఉల్ హుసేన్

జోసెఫ్‌తో కలిసి భారత్‌కు వచ్చిన ఒస్టెన్ అనే దర్శకుడు తిరిగి జర్మనీ వెళ్లిపోయినా, జోసెఫ్ మాత్రం బొంబాయిలోనే వివిధ స్టూడియోల్లో సినిమాటోగ్రఫర్‌గా, ఆపైన డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా పనిచేస్తూ చివరి వరకూ భారత్‌లోనే కాలం గడిపారు.

జవానీ కీ హవా(1935), అచ్చుత్ కన్యా(1936), మహల్(1949), దిల్ అప్నా ప్రీత్ పరాయ్(1960) లాంటి ఎన్నో పేరున్న బాలీవుడ్ చిత్రాలకు జోసెఫ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. 1967లో భారత్‌లోనే ఆయన కన్నుమూశారు. ఆయన మరణానంతరం విడుదలైన ఎవర్‌గ్రీన్ చిత్రం పాకీజా(1972) జోసెఫ్ పనితనానికి ఓ మచ్చు తునక.

Image copyright Josef Wirsching Archive
చిత్రం శీర్షిక ఎవర్‌గ్రీన్ చిత్రం పాకీజాకు జోసెఫే సినిమాటోగ్రఫర్

‘ది విర్షింగ్ ఆర్కైవ్స్’ పేరుతో గోవాలో ఏర్పాటైన ప్రదర్శనలో 1925-1967 మధ్య కాలంలో జోసెఫ్ విర్షింగ్ పనిచేసిన సినిమాలకు చెందిన అరుదైన ఫొటోలున్నాయి.

గోవాలో స్థిరపడ్డ జోసెఫ్ విర్షింగ్ మనవడు జార్జ్ ఈ ఫొటోల్ని సేకరించారు. వీటితో పాటు జోసెఫ్‌కి సంబంధించిన దాదాపు 4వేల వస్తువులు ఆయన దగ్గరున్నాయి.

భారతీయ సినిమాకు అంతకుముందు పరిచయం లేని ఎన్నో కొత్త కెమెరా యాంగిల్స్, చిత్రీకరణ వాతావరణం, భిన్నమైన లైటింగ్‌ని ప్రవేశపెట్టిన వ్యక్తిగా కూడా జోసెఫ్‌కు పేరుంది.

వెండితెర దిగ్గజాలుగా పేరున్న దేవికా రాణి, లీలా చిట్నిస్, అశోక్ కుమార్, దిలిప్ కుమార్ లాంటి వాళ్లను మరింత అందంగా తెరపైన ఆవిష్కరించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.

జోసెఫ్ 50వ వర్ధంతి సందర్భంగా ప్రదర్శించిన ఈ కింది ఫొటోలు.. ఓ విదేశీ సినిమాటోగ్రాఫర్ భారతీయ సినిమాకు చేసిన సేవను మరోసారి గుర్తు చేస్తున్నాయి.

Image copyright Josef Wirsching Archive
చిత్రం శీర్షిక 1938లో వచన్ అనే సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయం
Image copyright Josef Wirsching Archive
చిత్రం శీర్షిక 1925లో.. ‘లైట్ ఆఫ్ ఆసియా’ చిత్రీకరణ బృందం
Image copyright Josef Wirsching Archive
చిత్రం శీర్షిక ఇజ్జత్ సినిమాలో దేవికా రాణి, కమ్తా ప్రసాద్.. ఈ చిత్రాన్ని విర్షింగ్ తీశారు
Image copyright Josef Wirsching Archive
చిత్రం శీర్షిక 1935లో విడుదలైన ‘జవానీ కీ హవా’ సినిమాలోని ఓ దృశ్యం
చిత్రం శీర్షిక దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరాయి(1960) సినిమాలోని ఓ ద‌ృశ్యం

ఫొటోలు: ‘ఏ సినిమాటిక్ ఇమాజనేషన్ - జోసెఫ్ విర్షింగ్ అండ్ బాంబే టాకీస్’ సౌజన్యంతో..

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత అంశాలు