ఉత్తర కొరియా: 2018 క్యాలెండర్‌లో కిమ్ కుటుంబం, సైన్యం బదులు ఉత్పత్తులు

  • అలిస్టైర్ కోల్మన్,
  • బీబీసీ మానిటరింగ్
ఉత్తర కొరియా కొత్త క్యాలండర్లో జనవరి 8ని చూపిస్తున్న ఒక టీవీ ప్రజెంటర్

ఫొటో సోర్స్, TBS

ఫొటో క్యాప్షన్,

జనవరి 8వ తేదీని సాధారణ రోజుగానే పేర్కొంటున్న ఉత్తర కొరియా 2018 క్యాలెండర్

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్-ఉన్ తండ్రి, తాత పుట్టిన తేదీలను జాతీయ సెలవు రోజులుగా పరిగణిస్తారు. వారి మరణానికి ముందు నుంచే ఈ విధానం ఉంది. ప్రస్తుత పాలకుడు కిమ్ జాంగ్-ఉన్ విషయంలో మాత్రం ఇలాంటి విధానం లేదు.

కొత్త సంవత్సర క్యాలండర్లో కిమ్ జాంగ్-ఉన్ పుట్టినరోజును పేర్కొనలేదు. ఆయన పుట్టిన రోజు జనవరి 8 అనే ప్రచారం ఉంది. ఈసారి జనవరి 8 సోమవారం రానుంది.

ఆయన తండ్రి దివంగత కిమ్ జాంగ్-ఇల్ పుట్టిన రోజు ఫిబ్రవరి 16ను 'డే ఆఫ్ ద షైనింగ్ స్టార్'గా, తాత కిమ్ ఇల్-సంగ్ పుట్టిన రోజు ఏప్రిల్ 15ను 'డే ఆఫ్ ద సన్'గా ప్రతి సంవత్సరం పాటిస్తారు.

కిమ్ జాంగ్-ఉన్ పుట్టిన తేదీని మాత్రం ఎందుకు అధికారికంగా ప్రకటించలేదు, ఎందుకు సెలవు రోజుగా పరిగణించడం లేదనేది స్పష్టం కాలేదు.

ఫొటో సోర్స్, KCNA

ఫొటో క్యాప్షన్,

2014 జనవరి 8న ప్యాంగ్యాంగ్‌లో కిమ్ జాంగ్ ఉన్, డెన్నిస్ రోడ్‌మన్

2014 జనవరి 8న అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు డెన్నిస్ రోడ్‌మన్ ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత కిమ్ జాంగ్-ఉన్‌ను ఉద్దేశించి బర్త్‌డే పాట పాడారు.

దాదాపు 14 వేల మంది ప్రేక్షకుల్లో కిమ్ జాంగ్-ఉన్ దంపతులు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు.

రోడ్‌మన్ బర్త్‌డే పాట పాడుతున్న వీడియో ఉత్తర కొరియా వెలుపలి వారు ఎంతో మంది చూశారు.

ఉత్తర కొరియా ప్రజలకు మాత్రం కిమ్ కోసం రోడ్‌మన్ 'ఒక ప్రత్యేక గీతం' ఆలపించారనే సమాచారం వరకే వెళ్లింది.

ఫొటో సోర్స్, TBS

ఫొటో క్యాప్షన్,

ఉత్తర కొరియా 2018 క్యాలెండర్లో ఏప్రిల్, మే, జూన్ మాసాల పేజీల్లో ఉన్న చిత్రాలు

సైన్యం స్థానంలో ఉత్పత్తులు

విదేశాల్లో ఉన్న ఉత్తర కొరియా రెస్టారెంట్లలోనూ కొత్త క్యాలండర్లు ఉన్నాయి.

వీటిలో ఎలక్ట్రానిక్స్, క్రీడా ఉత్పత్తులు, రసాయన ఉత్పత్తులు, బూట్లు, మద్యం, ఉత్తర కొరియాలో తయారైన ఇతర ఉత్పత్తుల సమాచారాన్ని ముద్రించారని జపాన్‌లోని 'టోక్యో బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్(టీబీఎస్)' సేకరించిన క్యాలండర్లను బట్టి తెలుస్తోంది.

ఇంతకుముందు వీటిలో సైన్యం గురించి, లేదా కిమ్ కుటుంబం గురించే ఎక్కువగా ముద్రించేవారు.

ఆ తరహా క్యాలండర్ల విక్రయాలు పడిపోతున్నట్లు తాజా మార్పులను బట్టి తెలుస్తోందని దక్షిణ కొరియా రాజధాని సోల్ కేంద్రంగా వెలువడే ఆన్‌లైన్ పత్రిక 'డైలీ ఎన్‌కే' పేర్కొంది. ఈసారి ఉత్తర కొరియా ఉత్పత్తులు, ప్రాకృతిక సౌందర్యం, వంటల గురించి ప్రచారం చేసేలా వీటిని రూపొందించారని చెప్పింది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)