‘రోబోల వల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగాలు పోయే ప్రమాదం’

  • 29 డిసెంబర్ 2017
రోబో

రోబోల మూలంగా రాబోయే దశాబ్దాలలో కొన్ని ఉద్యోగాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని బ్రిటన్‌కు చెందిన ఒక పరిశోధనా సంస్థ చెబుతోంది.

'ఆటోమేషన్‌'తో పెరుగనున్న వేతన అసమానతలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగాలని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్' (ఐపీపీఆర్) విజ్ఞప్తి చేసింది.

అయితే రోబోలతో ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లే ప్రమాదం లేదని ఐపీపీఆర్ అభిప్రాయపడింది.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక రోబోలతో పెరగనున్న వేతనాల్లో అసమానతలు

రోబోలతో రాబోయే దశాబ్దాలలో కొన్ని తక్కువ నైపుణ్యం అవసరమయ్యే ఉద్యోగాలు అంతరించి పోయే ప్రమాదం ఉందని, అదే సమయంలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఎక్కువ వేతనాలను డిమాండ్ చేసే అవకాశం ఉందని పేర్కొంది.

ఐపీపీఆర్ అనే ఈ మేధో సంస్థ - ఆటోమేషన్‌తో యూకేలో ఉత్పాదకత అభివృద్ధి ఏటా 0.8-1.4 శాతం, 2030 నాటికి జీడీపీ 10 శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఎక్కువ వేతన ఉద్యోగాలతో పోలిస్తే, తక్కువ వేతన ఉద్యోగాలను ఆటోమేషన్ చేసే సాంకేతిక అవకాశం ఐదుసార్లు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆటోమేషన్‌ వల్ల కలిగే లాభాలు అందరికీ సమానంగా అందుబాటులోకి రాకపోవచ్చని అది పేర్కొంది.

Image copyright AFP

లాభాల రూపంలోకి మిగులు

ఆటోమేషన్ వల్ల ప్రధానంగా నష్టపోయే మూడు రంగాలు:

  • రవాణా రంగం (63 శాతం ఉద్యోగాలను ఆటోమేషన్ చేసే అవకాశం)
  • ఉత్పత్తి రంగం (58 శాతం)
  • టోకు మరియు చిల్లర అమ్మకాలు (65 శాతం)

దీని వల్ల అత్యాధునిక యంత్రాలను ఉపయోగించే సామర్థ్యం కలిగిన ఉద్యోగుల జీతాలు పెరిగి, ఆదాయ అసమానతలు పెరిగే అవకాశం ఉంది.

''మా పరిశోధన ప్రకారం ప్రతి ఏడాది సుమారు 25 లక్షల కోట్ల రూపాయల వేతనాలకు సమానమైన ఉద్యోగాలను ఆటోమేషన్ చేయడానికి ఆస్కారం ఉంది'' అని ఐపీపీఆర్ ప్రతినిధి కారిస్ రాబర్ట్స్ తెలిపారు.

''ఆటోమేషన్ వల్ల కొన్ని కొత్త రకం ఉపాధులు అందుబాటులోకి వచ్చి, వేతనాలు కొంత పెరిగినా, ఎక్కువ భాగం మాత్రం లాభాల రూపంలోకి మారుతుంది'' అని ఆమె తెలిపారు.

ఆటోమేషన్ చేయడానికి అవకాశం ఉన్న ఉద్యోగాలు పేదలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉన్నాయని, అవి కూడా మహిళలు, మైనారిటీ జాతులకు చెందినవని ఆమె వెల్లడించారు.

దీనిని అరికట్టేందుకు, ఆటోమేషన్ వల్ల కలిగే లాభాలు అందరికీ అందేలా చూసేందుకు ప్రభుత్వం నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)