దుబాయ్ రియల్ ఎస్టేట్‌ వ్యాపారంలో భారతీయుల పెట్టుబడులు

  • 30 డిసెంబర్ 2017
మీ పరికరంలో మీడియా ప్లేబ్యాక్ సదుపాయం లేదు.
Media captionదుబాయ్ రియల్ ఎస్టేట్‌లో దూసుకెళ్తున్న భారతీయులు

దుబాయ్‌లో ఆకాశ హర్మ్యాలను చూస్తే అక్కడ రియల్ ఎస్టేట్ ఏ స్థాయిలో దూసుకెళ్తుందో తెలిసిపోతుంది. అందుకే భారతీయులు ఆ రంగంలో 2017లో ఏకంగా రూ.47వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు.

దూబాయ్‌ రియల్ ఎస్టేట్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టే విదేశీయుల్లో భారతీయులదే రెండో స్థానం. 2017లో మొత్తం విదేశీ పెట్టుబడుల్లో 25శాతం వాటా భారతీయులదే.

గతంలో అక్కడి రియల్ ఎస్టేట్‌లో విదేశీయులకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉండేది కాదు. కానీ 2000 సంవత్సరంలో కొన్ని ప్రాంతాల్లో బయటి వాళ్లకు పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తూ ఆ దేశం చట్టం చేసింది. దాంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

వేగంగా అభివృద్ధి చెందుతున్న అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్లో డబ్బులు పెట్టడానికి భారతీయులు ఆసక్తి చూపించారు. అలా పెట్టుబడి పెట్టే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ, ఈ ఏడాది ఆ విలువ ఏకంగా రూ.47వేల కోట్లకు చేరింది.

చిత్రం శీర్షిక ఆహుతి చాలా ఏళ్లుగా దుబాయ్‌ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు

ఆహుతి చగ్, భరత్ రూపాల్ లాంటి కొందరు భారతీయులు చాలా కాలంగా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగమయ్యారు.

‘ఇతర దేశాలతో పోలిస్తే దుబాయ్‌లో వ్యాపారం చేయడం చాలా సులువు. కేవలం రెండు రోజుల్లో ప్రాపర్టీని ఒకరి పేరు నుంచి మరొకరి పేరుకి మార్చుకోవచ్చు. ఇన్వెస్టర్లకు ఇక్కడ మెరుగైన అవకాశాలూ లాభాలూ ఉంటాయి. పెట్టుబడి మంచి రిటర్నులు వస్తాయి’ అంటారు ఆహుతి. ‘మారా’ అనే రియల్ ఎస్టేట్ గ్రూప్‌కి ఆమె ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

చాలా కాలంగా దుబాయ్ రియల్ ఎస్టేట్ ఆకాశమే హద్దుగా ఎదుగుతున్నా, పరిస్థితి ఎప్పుడూ అలానే ఉంటుందని చెప్పలేం. 2008లో రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమవడంతో చాలామంది నష్టపోవాల్సి వచ్చింది. కొన్నాళ్లకు మళ్లీ మార్కెట్ పుంజుకోవడంతో మదుపర్లు లాభాలబాట పట్టారు.

‘మొదట్లో నేను దాదాపు రూ.26కోట్ల రూపాయలను ఇక్కడ పెట్టుబడి పెట్టి మంచి లాభాల్నే అందుకున్నా. కానీ 2008లో మార్కెట్ పడిపోవడంతో ఆదాయం తగ్గింది. ఇప్పుడు పరిస్థితి మెరుగ్గానే ఉంది. మళ్లీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుందని కొందరు అంటున్నా, నేనలా జరుగుతుందని అనుకోవట్లేదు. నిజానికి నేను ఈ మధ్యే ఓ కొత్త భవనాన్ని కూడా కొన్నా’ అని దుబాయ్‌లో తన పెట్టుబడుల గురించి వివరిస్తారు మరో ఇన్వెస్టర్ భరత్.

Image copyright Getty Images
చిత్రం శీర్షిక గతంలో ఎక్కువగా కూలి పనులు కోసమే భారతీయులు దుబాయ్‌కి వెళ్లేవారు

పవన్ బతావియా అనే మరో భారతీయుడు అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. భారతీయులు పెట్టుబడుల కోసమే రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తున్నారనీ, ఓ మోస్తరు పెట్టుబడితో ఎక్కువ అద్దెలొచ్చే ప్రాపర్టీ కోసం వాళ్లు చూస్తున్నారనీ ఆయన చెబుతారు.

ఎక్కువ శాతం భారతీయులు కోటీ, 2 కోట్ల రూపాయల ధరలో దొరికే ప్రాపర్టీ కోసం వెతుకుతారని పవన్ అంటారు.

మొత్తమ్మీద చూస్తే గతంలో ఎక్కువగా కూలి పనులు కోసమే భారతీయులు దుబాయ్‌కి వెళ్లేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ వాళ్లు బలమైన వ్యాపారులుగా ఎదుగుతూ ప్రస్తుతం అక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)