2017: అనూహ్య సంఖ్యల్లో సంవత్సరం

  • 31 డిసెంబర్ 2017
Cigarrette

2017లో జనవరి నుంచి జరిగిన సంఘటనలను వివరించే ఒక మార్గం.. ప్రతి ఒక్కరికీ పెద్దగా తెలిసి ఉండని సంఖ్యల వైపు చూడటం. అందుకే కొన్ని ఆశ్చర్యకరమైన సంఖ్యలను ఇక్కడ ఇస్తున్నాం.

రోజుకు 44 సిగరెట్లు

న్యూఢిల్లీ నివాసులు నవంబర్ ఆరంభంలో నగరాన్ని ఆవరించిన కాలుష్యపూరిత గాలిని పీల్చటం ద్వారా ఇన్ని సిగరెట్లతో సమానమైన ‘ధూమపానం’ చేసినట్లు ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

గాలి నాణ్యత విషయానికి వస్తే.. ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరిత 20 నగరాల జాబితాలో భారతదేశంలోని 10 నగరాలు ఉన్నాయి.

37,993 బాంబులు

అమెరికా సారథ్యంలోని సంకీర్ణం జనవరి నుంచి అక్టోబర్ వరకూ ఇరాక్, సిరియాల మీద వదిలిన బాంబులు, క్షిపణులు. రష్యా కూడా పలు దాడులు చేసింది. కానీ ఎన్ని బాంబులు వేసిందన్న వివరాలు వెల్లడించలేదు.

అమెరికా, రష్యాలు చెప్పిన సంఖ్య కన్నా చాలా ఎక్కువ మంది పౌరులే చనిపోయారన్న వాదనలు ఉన్నాయి. ఏదేమైనా.. సిరియా, ఇరాక్‌ల నుంచి స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ బృందాన్ని ఈ దాడులు తరిమేశాయి.

127 జ్వాలాముఖిలు

ఇండొనేసియాలో ఉన్న సచేతన అగ్నిపర్వతాలు. ప్రపంచంలో అత్యధిక అగ్నిపర్వతాలున్న దేశమూ ఇదే. ఈ జ్వాలా పర్వతాల్లో ఒకటైన మౌంట్ అగుంగ్ నవంబర్‌లో బద్దలైంది.

వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సివచ్చింది.

1.7 లక్షల మంది జనం

లైంగిక వేధింపులను ఖండిస్తూ ట్విటర్‌లో #metoo హ్యాష్‌ట్యాగ్ ఉపయోగించారని పలు నివేదికలు చెప్తున్నాయి.

హాలీవుడ్‌లో మూవీ మొగల్ హార్వే వైన్‌స్టీన్ కుంభకోణం బయటపడ్డ నేపథ్యంలో సోషల్ మీడియాలో సాగిన ఈ ఉద్యమంలో 85 దేశాల మహిళలు ఇందులో భాగమయ్యారు.

సున్నా

మయన్మార్‌లో రోహింజ్యా ప్రజలపై హింసను నోబెల్ శాంతి బహుమతి విజేత, బర్మా అధినాయకురాలు ఆంగ్ సాన్ సూచీ ఎన్నిసార్లు నిర్ద్వంద్వంగా ఖండిచారనే సంఖ్య. ఆ హింసను ఖండించాలని సహ నోబెల్ శాంతి బహుమతి విజేతలు పిటిషన్ ద్వారా అభ్యర్థించినా అంతర్జాతీయ సమాజం ఎన్నిసార్లు పిలుపునిచ్చినా ఫలితం లేదు.

డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సహాయ సంస్థ అంచనా ప్రకారం.. 2017లో కనీసం 6,000 మంది రోహింజ్యా ముస్లిం మైనారిటీలు హత్యకుగురయ్యారు. వారిలో ఐదేళ్ల లోపున్న చిన్నారులు 730 మంది ఉన్నారు. ఈ సంక్షోభం ‘బూటకపు వార్త’ అని, అదంతా ‘తప్పుడు సమాచారపు మంచుకొండ’ అని సూచీ సెప్టెంబర్‌లో అభివర్ణించారు.

812 ఫుట్‌బాల్ మైదానాలు

అంటార్కిటికాలోని లార్సన్ - సి గ్లేసియర్ (హిమనీనదం) నుంచి జూలైలో విరిగిపోయిన ఎ68 మంచుతునక.. రాబోయే 12 ప్రపంచ కప్‌లలో ఆడే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు అన్నిటినీ ఏకకాలంలో నిర్వహించేంత విశాలమైనది.

ఈ సహజ ప్రక్రియ భూగోళ తాపోన్నతి వల్ల వేగవంతం అయివుండవచ్చునని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

1600%

బిట్ కాయిన్ యూనిట్ విలువ 2017 డిసెంబర్‌లో 20,000 డాలర్ల వరకూ పెరిగింది. 2016తో పోలిస్తే 1600% వార్షిక వృద్ధి రేటు నమోదు చేసింది.

6,00,00,000 ఒలింపిక్ స్విమింగ్ పూల్స్ నీరు

అమెరికా మీద ఆగస్టులో విరుచుకుపడ్డ హరికేన్ హార్వీ 150 లక్షల కోట్ల లీటర్ల నీటిని గుమ్మరించింది. ఈ తుపాను ప్రభావం ప్రధానంగా హూస్టన్, టెక్సస్‌ల మీద ఉంది.

ఈ నీటితో.. అధికారిక కొలతలతో (50 మీటర్ల పొడవు, 25 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతు) కూడిన ఆరు కోట్ల ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్‌‌ను నింపవచ్చు.

17 మంది

2017లో (డిసెంబర్ 22 వరకూ) చనిపోయిన ప్రముఖుల సంఖ్య ఇది. ప్రముఖులకు ఇది ప్రాణాంతక సంవత్సరంగా మారిందని డెత్‌లిస్ట్.నెట్ వెబ్‌సైట్ చెప్తోంది. ప్రముఖుల మరణాలు, సంతాపసందేశాలను సేకరించటం ఈ వెబ్‌సైట్ ప్రత్యేకత.

ప్లేబాయ్ మేగజీన్ వ్యవస్థాపకుడు హ్యూ హెఫ్నర్, కమెడియన్ జెర్రీ లూయిస్, బిలియనీర్ డేవిడ్ రాకర్‌ఫెలర్, మ్యూజిక్ లెజెండ్స్ టామ్ పెటీ, ఫాట్స్ డొమినో, గ్లెన్ క్యాంప్‌బెల్, టీవీ నటి మేరీ టైలర్ మూర్ తదితరులు ఈ ఏడాది వీడివెళ్లారు.

మూడు శాతం

ప్రపంచ రాజకీయ ఇబ్బందుల కన్సల్టెంట్ సంస్థ యురేసియా పోల్ విడుదల చేసిన అంతర్జాతీయ సర్వే ప్రకారం.. బ్రెజిల్ అధ్యక్షుడు మైఖేల్ టెమర్‌కు దేశంలో గల ప్రజా మద్దతు రేటు ఇది.

సర్వే చేసిన అన్ని దేశాల కన్నా ఇదే అథమం. బ్రెజిల్‌లో తాజా సర్వేలో కొంత మెరుగుపడి 6 శాతానికి పెరిగినప్పటికీ.. అది ఆయనను ఈ పట్టికలో ఒక్కస్థానం కూడా పెంచలేకపోయింది.

ఇలస్ట్రేషన్లు: ఇస్మాయిల్ మొనీర్

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)