ప్రెస్‌రివ్యూ: పోలవరం నిర్మాణ కంపెనీ ట్రాన్స్ట్‌ట్రాయ్‌పై కెనరా బ్యాంకు దివాళా నోటీసు

  • 30 డిసెంబర్ 2017
చిత్రం శీర్షిక పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌

పోలవరం ప్రాజెక్టు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌పై కెనరా బ్యాంకు నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్సీఎల్టీ)ని ఆశ్రయించింది.

ఆ సంస్థ దివాలా తీసినట్లుగా ప్రకటించాలని, కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియను చేపట్టాలని బ్యాంకు కోరిందని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

ట్రాన్స్‌ట్రాయ్‌ రూ.725 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఈ నెల 22 నాటికి రూ.489 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, బ్యాంకు పూచీకత్తు కింద రూ.379 కోట్లే ఉంచిందని పేర్కొంది.

ట్రైబ్యునల్‌ త్వరలోనే ఇన్‌సాల్వెన్సీ ప్రక్రియ ప్రారంభించనుందని ఈ కథనం చెప్పింది.

ట్రాన్స్‌ట్రాయ్‌ను దివాలా సంస్థగా ప్రకటిస్తే ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సంస్థకు మున్ముందు బ్యాంకుల నుంచి పరపతి పుట్టే అవకాశమే ఉండదని పేర్కొంది.

Image copyright KTRTRS/facebook

ప్రారంభించిన నెల రోజుల్లోనే 34 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి దేశంలోనే అత్యంత విజయవంతమైన మెట్రోగా హైదరాబాద్ మెట్రో రైలు నిలిచిందని తెలంగాణ మంత్రి కె.తారకరామారావు(కేటీఆర్) అభిప్రాయపడ్డారు.

నిత్యం సుమారు 1.13 లక్షల మంది హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారని ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారని 'నమస్తే తెలంగాణ' పేర్కొంది.

22 శాతం మంది కార్డుల ద్వారానే ప్రయాణిస్తున్నారని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు. ఇప్పటివరకు లక్షన్నర మెట్రో స్మార్డు కార్డులు అమ్ముడయ్యాయని ఆయన తెలిపారు. నిత్యం రెండు వేల కార్డులు అమ్ముడవుతున్నాయన్నారు. త్వరలో మంత్లీ పాస్ ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఆర్టీసీ, ఎంఎంటీఎస్‌లతో కలిసి కామన్‌పాస్ విధానంపైనా కసరత్తు జరుగుతోందన్నారు.

నాగోల్ నుంచి మియాపూర్ వరకుగల 24 స్టేషన్లలో ప్రకాశ్‌నగర్ మినహా అన్ని స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశామని, ప్రయాణికులు పార్కింగ్‌ను సరిగా ఉపయోగించుకోవడం లేదని ఎన్‌వీఎస్ రెడ్డి చెప్పారు. నాగోల్-మియాపూర్ మార్గంలో మెట్రో ప్రారంభమయ్యాక రోడ్లపై ఎనిమిది వేల వాహనాలు తగ్గినట్లు తెలిసిందన్నారు. మార్చి తర్వాత ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా సర్వీసుల సంఖ్య పెంచుతామని తెలిపారు. అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీకి, అమీర్‌పేట నుంచి ఎల్బీ నగర్‌కు మెట్రోను జూన్ చివరి వారంలో అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పినట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది.

Image copyright tdp.ncbn.official/facebook

'మీ ఊళ్లోకొస్తా.. ధర్నా చేస్తా'

మరుగుదొడ్డి కట్టించుకోకపోతే ధర్నా చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

'జన్మభూమి-మా ఊరు'పై కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌లో స్వచ్ఛాంధ్రపై చంద్రబాబు చర్చించారు. ఆ సమయంలో- చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలు మరుగుదొడ్ల నిర్మాణంలో వెనకబడటంపై ఈ మూడు జిల్లాల కలెక్టర్లతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.

''జన్మభూమి-మా ఊరు కార్యక్రమం పూర్తికాగానే మరుగుదొడ్ల నిర్మాణంలో వెనకబడిన చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లోని గ్రామాలకు వస్తా. ఆ ఊళ్లోనే నిద్రపోతా. కలెక్టర్‌ను పక్కన పెట్టుకుని మీ కోసం ధర్నా చేస్తా. మార్చి 31లోపు బహిరంగ మలవిసర్జన రహిత(ఓడీఎఫ్‌) గ్రామాలుగా మారాల్సిందే. ఎలాంటి మినహాయింపులు లేవు' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారని 'ఈనాడు' తెలిపింది.

గడువులోపు మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కలెక్టర్లు తెలిపారు.

'జన్మభూమి-మా ఊరు' పండుగలా నిర్వహిస్తే కోడిపందేల ఆలోచన రాదని పశ్చిమగోదావరి కలెక్టర్‌తో మాట్లాడుతున్న సమయంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు.

'పాఠశాలల ఫీజులు ఏటా 10 శాతం పెంచుకోవచ్చు'

తెలంగాణలోని ప్రైవేటు పాఠశాలలు ఎలాంటి అనుమతి లేకుండానే ఏటా 10 శాతం వరకు ఫీజులు పెంచుకోవచ్చని ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ప్రతిపాదించిందని 'సాక్షి' తెలిపింది.

''10 శాతం కంటే ఎక్కువగా ఫీజులను పెంచుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. 2016-17 విద్యాసంవత్సరం నాటికి ఉన్న ఫీజులు ప్రామాణికంగా కొత్త నిబంధనలను అమలు చేయాలి. పాఠశాలల ఆదాయ, వ్యయాలను పరిశీలించి ఫీజులకు అనుమతి ఇచ్చేందుకు జోనల్ ఫీజుల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేయాలి'' అని కమిటీ సిఫార్సు చేసినట్లు ఈ కథనం వివరించింది.

Image copyright YOSHIKAZU TSUNO/AFP/GettyImages)
చిత్రం శీర్షిక మాంటెక్‌ సింగ్ అహ్లూవాలియా

ద్రవ్యోల్బణం కన్నా నిరుద్యోగమే సమస్య: అహ్లూవాలియా

భారత్‌కు ప్రస్తుతం ద్రవ్యోల్బణం కన్నా నిరుద్యోగమే అసలు సమస్య అని ప్రముఖ ఆర్థికవేత్త, ప్రణాళికాసంఘం మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా చెప్పారని 'ఈనాడు' తెలిపింది.

''ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉంది. ఇది సమస్య కానే కాదు. ఆందోళన అవసరం లేదు. లేబర్‌ బ్యూరో తాజా నివేదిక ప్రకారం వ్యవసాయ రంగంలో 84.6 లక్షల ఉద్యోగాలు తగ్గాయి. తయారీ, విద్యుత్‌ ఉత్పాదన, నిర్మాణ రంగంలోనూ 28.1 లక్షల ఉద్యోగాలు తగ్గాయి. సేవా రంగంలో కొత్తగా 66.5 లక్షల ఉద్యోగాలు వచ్చినా తగ్గింది మొత్తం మీద 1.127 కోట్లు అని గుర్తించాలి. వృద్ధిరేటును సాధ్యమైనంత త్వరగా ఎనిమిది శాతానికి తెచ్చుకుని నిరుద్యోగ సమస్య నుంచి బయటపడాలి. అత్యధికం ఆధారపడిన వ్యవసాయ రంగం ద్వారా ఉపాధి లభించాలి. నోట్ల రద్దు ప్రభావం ఇప్పుడు లేదు. వచ్చే ఏడాదికి జీఎస్టీ సమస్యలు తొలగి సత్ఫలితాలు లభిస్తాయి'' అని అహ్లూవాలియా అన్నారని ఈ కథనం తెలిపింది. బ్యాకింగ్‌ రంగంలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదని ఆయన చెప్పారని పేర్కొంది.

మా కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)