మేకఫీ యాంటీ వైరస్ వ్యవస్థాపకుడి ట్విటర్ ఖాతా హ్యాక్!

  • 1 జనవరి 2018
జాన్ మెక్ కెఫీ Image copyright Getty Images

సైబర్ సెక్యూరిటీలో అగ్రగామిగా ఉన్న ‘మేకఫీ’ వ్యవస్థాపకుడు జాన్ మేకఫీ ట్విటర్ అకౌంట్‌ను కొందరు హ్యాక్ చేశారు.

తన ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు ఆయన వెల్లడించారు. హ్యాక్ చేశాక తన అకౌంట్‌ ద్వారా కొన్ని క్రిప్టో కరెన్సీలను ప్రచారం చేశారని ఆయన తెలిపారు.

అయితే.. ఏకంగా సెక్యూరిటీ గురుగా పేరొందిన మేకఫీ వ్యవస్థాపకుడి ఖాతానే హ్యాక్ కావడం సంచలనం సృష్టించింది. దీంతో ఆ కంపెనీ విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తాయి.

అయితే ఈ అనుమానాలను, ప్రశ్నలను మేకఫీ తోసిపుచ్చారు. ట్విటర్ సెక్యూరిటీ తన నియంత్రణలో లేదన్నారు. తన మొబైల్ ఫోన్ వల్లనే సమస్య ఉత్పన్నమై ఉండొచ్చన్నారు.

Image copyright John McAfee

ఈ నెల ప్రారంభం నుంచి.. వర్చువల్ కరెన్సీ రంగంలో దేనిపై పెట్టుబడులు పెట్టాలన్న అంశంపై ఆయన రోజువారీగా సూచనలు, సిఫారసులు చేస్తున్నారు.

ఇప్పటి నుంచి వారానికి ఒకసారి మాత్రమే సలహాలు, సూచనలు ఇస్తానని మేకఫీ ప్రకటించారు. ఆ మరుసటి దినమే ఆయన ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. జనవరి 1న తదుపరి సూచనలు వెలువడాల్సి ఉంది.

ఫలానా క్రిప్టో కరెన్సీలపై పెట్టుబడులు పెట్టాలంటూ హ్యాకర్లు మేకఫీ అకౌంట్ ద్వారా ప్రచారం చేశారు.

కొన్ని కరెన్సీలపై పెట్టుబడులను ఆకర్షించేందుకు హ్యాకర్లు ఈయన అకౌంట్‌ను ఎన్నుకున్నారు.

మరోవైపు.. ఈ అంశంపై మాట్లాడేందుకు ట్విటర్ నిరాకరిస్తూనే, తన మార్గ నిర్దేశకాలను మరోసారి నొక్కి చెప్పింది.

బీబీసీతో మేకఫీ మాట్లాడుతూ, తాను భద్రతా విధానాలను పాటించానని, అయినప్పటికీ కొందరు అకౌంట్‌ను హ్యాక్ చేయగలిగారన్నారు.

''నా మొబైల్ ఆన్ చేసి చూస్తే.. అందులో వేరే ఏదో ఫోటో ఉండడంతో హ్యాకింగ్ జరిగిందని అనుకున్నా.'' అని ఆయన అన్నారు.

హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉండే.. ప్రపంచ అత్యుత్తమ ''హ్యక్ ప్రూఫ్'' మొబైల్ ఫోన్లు తయారు చేయడంలో మేకఫీ బిజీగా ఉన్నారు.

ఈ ఫోన్లు ఫిబ్రవరి నెలలో విడుదల కానున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Image copyright MGT

క్రిప్టో గురు

1980లో జాన్ మేకఫీ తన పేరు మీదనే ఓ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ప్రపంచంలోనే మొట్టమొదటి యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.

అంతేకాకుండా వందల కోట్ల రూపాయల వ్యాపార రంగానికీ పురుడు పోసింది. దీంతో జాన్ మేకఫీ పేరు ప్రపంచానికి తెలిసింది.

జాన్ మేకఫీ తన వ్యాపారాన్ని ఇంటెల్ సంస్థకు అమ్మివేశారు. కానీ ఇప్పటికీ సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులను ఆయన అభివృద్ధి చేస్తూనే ఉన్నారు.

ఈయన బిట్ కాయిన్ రంగంలో కూడా ప్రవేశించారు. వర్చువల్ కరెన్సీ రంగంలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించే విధానాన్ని ఆయన అభివృద్ధి చేస్తున్నారు. అందుకే ఈయన్ను 'క్రిప్టో గురు' అని కూడా కొందరు సంబోధిస్తున్నారు.

మేకఫీ అకౌంట్ హ్యాక్ అయ్యాక.. ఇతర సెక్యూరిటీ సంస్థలు మేకఫీపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నాయి.

మా ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)