లైంగిక వేధింపుల బాధితులకు అండగా హాలీవుడ్ నటీమణులు

  • 2 జనవరి 2018
ఆస్కార్ పురస్కార గ్రహీతలు నటాలీ పోర్ట్‌మన్, ఎమ్మా స్టోన్, కేట్ బ్లాన్‌చెట్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక 'టైమ్ ఈజ్ అప్' ప్రాజెక్టుకు మద్దతు పలుకుతున్న నటీమణుల్లో ఆస్కార్ పురస్కార గ్రహీతలు నటాలీ పోర్ట్‌మన్, ఎమ్మా స్టోన్, కేట్ బ్లాన్‌చెట్ ఉన్నారు

చిత్ర పరిశ్రమతోపాటు పని ప్రదేశాల్లో లైంగిక దాడులు, వేధింపులు, అసమానతలు, అన్యాయాలను ఎదుర్కొనేందుకు, బాధితులకు అండగా నిలిచేందుకు 300 మందికి పైగా హాలీవుడ్ నటీమణులు, రచయితలు, దర్శకులు నడుం బిగించారు.

తమ పోరాటాన్ని ఒక ప్రాజెక్టుగా వారు చేపట్టారు. దీనికి 'టైమ్ ఈజ్ అప్ (Time's Up)' అని పేరు పెట్టుకున్నారు. బాధితులకు న్యాయ సహాయం అందించేందుకు అవసరమైన నిధులను సమీకరిస్తున్నారు.

దీనిపై అమెరికాలోని ప్రముఖ పత్రిక 'ద న్యూయార్క్ టైమ్స్'లో వారు పూర్తి పేజీ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చారు.

హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టీన్‌ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురు ప్రముఖ నటీమణులు ఆరోపణలు చేస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు తెర పైకి వచ్చింది.

Image copyright www.timesupnow.com
చిత్రం శీర్షిక 'టైమ్ ఈజ్ అప్' ప్రతినిధులు మహిళలందరికీ సంఘీభావం తెలుపుతూ తమ వెబ్‌సైట్‌లో లేఖ ఉంచారు

'టైమ్ ఈజ్ అప్' ప్రతినిధులు మహిళలందరికీ సంఘీభావం తెలుపుతూ తాజాగా తమ వెబ్‌సైట్‌లో ఒక లేఖ కూడా ఉంచారు. తాము ఎదుర్కొంటున్న వేధింపులపై గళం విప్పేందుకు మహిళలకు ఉన్న అడ్డంకులను తొలగించాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

లైంగిక వేధింపులు చాలా సందర్భాల్లో కొనసాగుతూనే ఉంటాయని, ఈ వేధింపులకు పాల్పడేవారు అందుకు తగిన ఫలితం అనుభవించేలా చేయలేకపోవడమే దీనికి కారణమని లేఖలో పేర్కొన్నారు.

'టైమ్ ఈజ్ అప్' ప్రాజెక్టుకు మద్దతు పలుకుతున్న నటీమణుల్లో ఆస్కార్ పురస్కార గ్రహీతలు నటాలీ పోర్ట్‌మన్, ఎమ్మా స్టోన్, కేట్ బ్లాన్‌చెట్, రీస్ విదర్‌స్పూన్ తదితరులు ఉన్నారు.

ప్రాజెక్టు అమలుకు రూ.95.57 కోట్లు (ఒకటిన్నర కోట్ల డాలర్లు) సేకరించాలని నిర్ణయించగా, ఇప్పటికే రూ.82.8 కోట్లు సమకూరాయి. పని చేసే చోట లైంగిక వేధింపులను ఎదుర్కొనే మహిళలు, పురుషులకు న్యాయ సహాయం అందించడానికి ఈ సొమ్మును వెచ్చిస్తారు.

ప్రధానంగా న్యాయ వ్యవహారాలకు అయ్యే ఖర్చులను భరించలేని బాధితుల కోసం ఈ నిధులను వినియోగిస్తారు. వీరిలో వ్యవసాయ కార్మికులు, కర్మాగారాల్లోని కార్మికులు, సంరక్షకులు, వెయిటర్ లాంటి ఉద్యోగాల్లో ఉండే మహిళలు, ఇతరులు ఉంటారు.

లింగ వివక్ష, అధికార పంపిణీలో అసమతౌల్యం, వేతనాల్లో స్త్రీ, పురుషుల మధ్య అసమానతలను పారదోలాలని ఈ ఉద్యమం పిలుపునిస్తోంది. మరింత మంది మహిళలు అధికార స్థానాల్లోకి వెళ్లాలని కోరుతోంది.

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)