మా త్యాగాలను అమెరికా మరచిపోయింది: పాక్

  • 2 జనవరి 2018
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ Image copyright Getty Images
చిత్రం శీర్షిక పాకిస్తాన్ ఉగ్రవాదులకు 'సురక్షిత ప్రాంతం'గా మారిందన్న ట్రంప్

పాకిస్తాన్ అబద్ధాలు చెబుతూ.. మోసాలకు పాల్పడుతోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయ భద్రతా కమిటీ అత్యవసరంగా సమావేశమైంది.

అమెరికా అగ్రనాయకత్వం చేసిన వ్యాఖ్యలు తమను తీవ్ర నిరాశకు గురి చేశాయని కమిటీ పేర్కొంది.

తమ దేశం చేసిన త్యాగాలను అమెరికా నాయకత్వం విస్మరించిందని ఈ కమిటీ అభిప్రాయపడింది.

కొన్నేళ్లుగా ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్ కృషి చేస్తోందని.. అది అమెరికా ఉన్నత స్థాయి వర్గాలకు కూడా తెలుసని వ్యాఖ్యానించింది.

ఇప్పటికీ అఫ్గానిస్తాన్‌లో అమెరికా చేస్తున్న ఉగ్రవాద అణచివేత పోరాటానికి తమ దేశం మద్దతిస్తూనే ఉందని తెలిపింది.

మంగళవారం పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, అమెరికాలో పాకిస్తాన్ రాయబారితోపాటు పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Image copyright EPA
చిత్రం శీర్షిక పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖకాన్ అబ్బాసీ

ట్రంప్ ట్వీట్‌పై పాక్ మీడియా అభ్యంతరం

మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై పాకిస్తాన్ మీడియా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మరోవైపు.. 'పాకిస్తాన్‌కు ట్రంప్ సరైన రీతిలో సమాధానం ఇచ్చారు' అంటూ అఫ్గానిస్తాన్ మీడియా అభిప్రాయపడింది.

''15 ఏళ్లలో పాకిస్తాన్‌కు అమెరికా మూర్ఖంగా రూ.2.11 లక్షల కోట్లు (3,300 కోట్ల డాలర్లు) సహాయం చేసింది. వాళ్లు మన నాయకులను మూర్ఖుల కింద జమ కట్టి, మనకు అబద్ధాలు చెప్పారు. మోసం చేశారు. అఫ్గానిస్తాన్‌లో మనం ఉగ్రవాదులతో పోరాడుతున్నాం. అదే ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షిత ఆశ్రయాన్ని కల్పిస్తోంది. ఇకపై ఇది సాగదు'' అని నూతన సంవత్సరం రోజు ట్రంప్ ట్వీట్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాకిస్తాన్‌ ఉర్దూ టీవీ ఛానెళ్ల ప్రైమ్ టైం చర్చల్లో ఈ ట్వీట్ హాట్ టాపిక్‌గా నడిచింది.

ట్రంప్ చేసిన ట్వీట్ మున్ముందు అమెరికా పాలసీగా మారవచ్చనే అభిప్రాయం ఆ చర్చల్లో వ్యక్తమైంది.

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికాతో పాకిస్తాన్ తన సంబంధాలను పున:సమీక్షించుకుంటుందని, అమెరికా విషయంలో కఠిన వైఖరిని అనుసరిస్తుందని పాక్ వార్తా పత్రికలు పేర్కొన్నాయి.

ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో తమ త్యాగాలను దౌత్య విధానంలో పాకిస్తాన్ ప్రముఖంగా పేర్కొంటుందని పత్రికలు తెలిపాయి.

'అమెరికా సాయం అవసరం లేదు'

ట్రంప్ ట్వీట్ పై అమెరికా దౌత్యవేత్త డేవిడ్ హేల్‌కు పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం తన నిరనస తెలిపింది.

పాకిస్తాన్‌కు అమెరికా ఎలాంటి సహాయమూ చేయలేదని.. తమకు ఆ దేశం సాయం అవసరం లేదని పాక్ విదేశాంగ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ వ్యాఖ్యానించారు.

సోమవారం రాత్రి ఓ టీవీ షోలో ఆయన మాట్లాడుతూ, అమెరికాకు పాకిస్తాన్ సేవలు అందిస్తూ.. ప్రతిఫలంగానే నిధులు పొందుతోందని అన్నారు.

అమెరికా బెదిరింపులు కొత్తేమీ కాదని, కానీ ఇప్పుడు అమెరికా బెదిరింపులనే ఒక విధానంగా అమలు చేస్తోందని అదే షోలో పాల్గొన్న సమీక్షకుడు తలత్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ ట్వీట్ వెనుక ఒక ప్రణాళిక ఉన్నట్టు అనిపిస్తోందని అన్నారు.

పాక్ వ్యతిరేక ట్వీట్‌తో ట్రంప్ నూతన సంవత్సరాన్ని ప్రారంభించారని.. 'దునియా కమ్రాన్ ఖాన్ కె సాథ్' అనే మరో షోలో టీవీ వ్యాఖ్యాత మసూద్ రజా అన్నారు.

'ఆ ట్వీట్‌ను తేలిగ్గా తీసుకోవద్దు'

''ఇది పాకిస్తాన్- చైనాల మధ్య స్నేహానికి పరీక్ష'' అంటూ 'రిపోర్ట్ కార్డ్ ' అనే టీవీ షోలో సమీక్షకుడు హసన్ నిసార్ అభిప్రాయపడ్డారు.

ట్రంప్ ట్వీట్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని అన్నారు.

అఫ్గాన్ తాలిబన్లపై పాకిస్తాన్ తన విధానాన్ని పున:సమీక్షించుకోవాలని మరో సమీక్షకుడు ఇంతియాజ్ ఆలమ్ సూచించారు.

వాషింగ్టన్‌లో ఉన్న సమీక్షకుడు మొయీద్ యూసుఫ్ 'దునియా' టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ, పాకిస్తాన్ ఈ ట్వీట్‌పై జాగ్రత్తగా ప్రతిస్పందించాలని సూచించారు.

'ఈ ట్వీట్ ఒక విధానంగా రూపొందుతుందేమో మనం గమనించాలి' అన్నారు.

అదే విధంగా మిలటరీ అనుకూల ఏఆర్‌వై న్యూస్‌లో ప్రసారమయ్యే 'ఆఫ్ ద రికార్డ్' అన్న షోలో కాషిఫ్ అబ్బాసీ, ట్రంప్ ప్రకటన పాకిస్తాన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోందన్నారు.

ఇది కేవలం ఒక వ్యక్తి ఇచ్చిన ప్రకటన కాదని, ఒక విధానంగా రూపొందుతోందని ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ మాజీ దౌత్యాధికారి షెర్రీ రహమాన్ అభిప్రాయపడ్డారు.

Image copyright Getty Images

'పాక్ ప్రజలకు కోపం తెప్పించొద్దు'

"రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అమెరికా మానుకోవాలి. ఇలాంటివి పాకిస్తాన్ ప్రజలకు ఆగ్రహం తెప్పిస్తాయి" అని ది మ్యాన్‌డేట్ దునియా పత్రిక తన సంపాదకీయంలో వ్యాఖ్యానించింది.

"ట్రంప్ ట్వీట్‌పై పాక్ స్పందించి అమెరికాతో మాట్లాడాలి. ఇస్లామాబాద్‌పై వాషింగ్టన్ ఆధిపత్యం చలాయించలేదన్న విషయాన్ని స్పష్టం చేయాలి" అని పాకిస్తాన్‌కు సూచించింది.

అమెరికా చర్యలను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని జిహాదీ అనుకూల పత్రిక 'ఉమ్మత్' వ్యాఖ్యానించింది. అమెరికా సాయాన్ని నిలిపివేస్తే.. పాకిస్తాన్ చైనా, సౌదీ అరేబియాల సాయం కోరుతుందని పేర్కొంది.

"ఒకవేళ భారత్‌తో కలిసి అమెరికా ఏవైనా చర్యలకు పూనుకుంటే.. వాటిని తిప్పికొట్టేందుకు పాకిస్తాన్ సిద్ధంగా ఉంది" అని రాసింది.

Image copyright Reuters
చిత్రం శీర్షిక అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు హమిద్ కర్జాయి

ట్రంప్‌ వ్యాఖ్యలను స్వాగతించిన అఫ్గాన్ పత్రికలు

పాకిస్తాన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అఫ్గానిస్తాన్ మీడియా స్వాగతించింది. ఈ ఒత్తిడితో ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌లో మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు అభిప్రాయపడింది.

ట్రంప్ స్టేట్‌మెంట్‌ను స్వాగతిస్తున్నట్టు అఫ్గాన్ అధ్యక్షుడు హమిద్ కర్జాయి ట్వీట్ చేశారు. మోసకారి పాకిస్తాన్‌కు ట్రంప్ ట్వీట్ గట్టి సమాధానమని వ్యాఖ్యానించారు.

పాక్ పట్ల సహనాన్ని విడనాడేందుకు అమెరికా సిద్ధమైందన్న బలమైన సంకేతాలను ట్రంప్ ఇచ్చారని 'ది సెక్యులర్' పత్రిక పేర్కొంది.

Image copyright Reuters

ఇస్లామాబాద్‌‌ను ట్రంప్ సరైన రీతిలో హెచ్చరించారంటూ మరో పత్రిక ఎతిలాత్- ఇ రోజ్ వ్యాఖ్యానించింది. ఈ దెబ్బతోనైనా కొత్త సంవత్సరంలో ఉగ్రవాదుల పట్ల పాకిస్తాన్‌ వైఖరి మారుతుందేమోనంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.

పాకిస్తాన్ పట్ల అమెరికా వైఖరి మారుతోందన్న స్పష్టమైన సంకేతాలు ట్రంప్ ఇచ్చారని 'ది డెయిలీ అఫ్గానిస్తాన్' పత్రిక అభిప్రాయపడింది.

(ప్రపంచవ్యాప్తంగా టీవీ.. రేడియో.. వెబ్.. ప్రింట్ మీడియాలో వచ్చే వార్తలను 'బీబీసీ మానిటరింగ్' సమీక్షిస్తుంది. మీరు బీబీసీ మానిటరింగ్‌ను ట్విటర్, ఫేస్‌బుక్‌లలో ఫాలో అవ్వచ్చు)

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)