కిమ్‌కు ట్రంప్ జవాబు: ‘నా దగ్గరున్న న్యూక్లియర్ బటన్ నీకన్నా పెద్దది’

  • 3 జనవరి 2018
cartoon

న్యూక్లియర్ లాంచ్ బటన్ ఎల్లప్పుడూ తన టేబుల్ మీద ఉంటుందన్న ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిస్పందించారు. కిమ్ న్యూక్లియర్ బటన్ కన్నా తమ బటన్ మరింత పెద్దది, మరింత శక్తివంతమైనది అని ట్వీట్ చేశారు. అంతే కాదు, 'ఆ బటన్ పని చేస్తుంది కూడా!' అన్నారు.

అమెరికా అధ్యక్షుడి ట్వీట్ రెండు విషయాలను స్పష్టం చేసింది. అణ్వాయుధ ప్రయోగాలు అమెరికా అధ్యక్షుడి కనుసన్నలలో జరుగుతాయనేది ఒకటి కాగా, అమెరికా వద్ద అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలు ఉన్నాయనేది రెండోది.

తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, అమెరికాపై కూడా దాడి చేసే సత్తా కూడా ఉందని ఉత్తర కొరియా అంటోంది. ప్యాంగ్ యాంగ్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నా, వాటిని ఇతర దేశాలపై ప్రయోగించే సాంకేతిక పరిజ్ఞానం ఉందా లేదా అనేది సందేహమే.

ఇటీవలి కాలంలో ఈ నేతలు ఇద్దరు ఒకరినొకరు మారుపేర్లతో పిలుచుకోవడం జరుగుతుతోంది. గతంలో ట్రంప్‌ను కిమ్ జోంగ్ ఉన్ 'బుద్ధిలేని ముసలోడు' అని పేర్కొనగా, కిమ్‌ను ట్రంప్ 'లిటిల్ రాకెట్ మ్యాన్' అని ఎగతాళి చేశారు.

ట్రంప్ తాజా ట్వీట్‌పై సహజంగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రతిస్పందన వ్యక్తమైంది.

అణ్వాయుధాలపై ఇలాంటి బాధ్యతారహిత కామెంట్లను చేస్తున్న ప్రపంచ నేతలపై సోషల్ మీడియాలో కొందరు నిరసన వ్యక్తం చేయగా, మరికొందరు వాటిపై సరదా కామెంట్లు పోస్ట్ చేశారు.

ట్రంప్ మద్దతుదారులు - ఆయన కామెంట్లు సరైనవే అని, అవి అమెరికా శక్తిని, పట్టుదలను సూచిస్తున్నాయని పేర్కొన్నారు.

అమెరికా అంటే ఏమిటో ఉత్తర కొరియాకు చూపించాలని సూచించారు.

మరికొందరు రెండు బటన్‌లను టేబుల్ మీద పెట్టి, ఏది పెద్దగా ఉందో కొలవాలని ప్రతిపాదించారు.

Image copyright ptasha

అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా చేతుల పరిమాణంపై మార్కో రూబియో, ట్రంప్ మాటకు మాట అనుకున్నారు.

ఆ సమయంలో ట్రంప్, ''ఆయన నా చేతుల్ని ఉద్దేశిస్తూ, 'అవి చిన్నగా ఉంటే, మరొకటి కూడా చాలా చిన్నగా ఉండి ఉండాలి' అన్నారు. కానీ దానిలో ఎలాంటి సమస్యా లేదని నేను గ్యారంటీ ఇస్తాను'' అన్నారు.

మంగళవారం చేసిన ట్వీట్‌లలో ట్రంప్ పాలస్తీనానూ బెదిరించారు. తాము పాలస్తీనాకు చేస్తున్న సాయానికి ప్రతిఫలంగా ఆ దేశం తమకు తగిన గౌరవం ఇవ్వడం లేదన్నారు.

అంతకు ముందు ట్రంప్ పాకిస్తాన్ పైనా అలాంటి వ్యాఖ్యలే చేశారు. పాక్‌కు చేస్తున్న బిలియన్ల డాలర్ల సాయానికి ప్రతిఫలంగా ఆ దేశం తమను అబద్ధాలతో మోసగిస్తోందని అన్నారు.

ఇతర కథనాలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)